మంగళగిరి ప్రెస్ క్లబ్ కు పెద్ద బిల్డింగ్ అందించిన ఇంజమూరి పార్వతమ్మ

సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులను ఎవ్వరూ పట్టించుకోని ఈ రోజుల్లో ఎక్కడా లేని విధంగా, ఎవ్వరూ చేయని విధంగా ఒక మధ్య తరగతి చేనేత కుటుంబం మంగళగిరిలో జర్నలిస్టుల కోసం అందమయిన భవనాన్ని నిర్మించి ఇచ్చింది.

(గోరంట్ల పూర్ణ చంద్రరావు)
పేద అభ్యున్నతికే ఎపుడూ నిలబడిన  భర్త ఇంజమూరు భావన్నారాయణ ఆశయాలు పది మందికి గుర్తుండే విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలని దృఢ సంకల్పం ఉన్న మహిళ పార్వతమ్మ. ఎంతో కాలంగా తాను కూడబెట్టుకున్న సొమ్మును,  భర్త కష్టార్జితం అయిన పింఛన్ సొమ్మును సమాజం బాగుకోసం వెచ్చించిన ఆదర్శమహిళ.
చేనేత కేంద్రమైన మంగళగిరి పట్టణంలో పూర్వం నుంచి విద్యాభివృద్ధికి బాగా ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. అందుకే ఎప్పుడో పేదల కోసం విద్యాసంస్థలు నెలకొల్పారు. ఇందులో చేనేత పెద్దత వితరణ  ఎంతో  ఉంది. నాటి విద్యాదాతల ఆశయ సాధన  నిజంచేసేందుకు విశేష కృషి సల్పిన వ్యక్తి ఇంజమూరి భావన్నారాయణ.  అక్కడి సికె విద్యా సంస్థను అభివృద్ధి పథంలో అగ్రగామిగా తీర్చిదిద్ది, ముందుచూపుతో అంచెలంచెలుగా విస్తరించేందుకు బాటలు వేసిన చేనేత ముద్దుబిడ్డ ఐ. భావన్నారాయణ ధర్మపత్ని ఆమె.
ఇంజమూరి పార్వతమ్మ
ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన దాతృత్వాన్ని ప్రకటించి వారి హృదయాల్లో ఆనంద జ్యోతులు వెలిగించారు పార్వతమ్మ.
మంగళ గిరి జర్నలిస్టుల కోసం అందమైన రెండంతస్తుల భవనాన్ని నిర్మించి తన ఉదారతను చాటుకున్నారు.
 ఇంటి నుంచి బయటకు రాని ఓ సాధారణ గృహిణి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఇది.  మధ్యతరగతి కుటుంబాలలో తండ్రితో పాటు తల్లి కూడ కుటుంబ భారాన్ని మోయడం తప్పనిసరిగా మారిన రోజులివి. ఇలాంటి నేపథ్యంలో అల్లికలు, కుట్టు మిషను పనులతో ఆర్థికంగా భర్తకు చేయూతనందిస్తూ వచ్చిన మహిళ పార్వతమ్మ.
గుంటూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో మంగళగిరి నుంచి చదువుకోటానికి వచ్చే పేద విద్యార్థులు (వారాల అబ్బాయిలకు) వారానికి ఒకసారి నెలలో నాలుగు రోజులు భోజన వసతి కల్పించి, ఎందరో పేద విద్యార్థులకు చదువు నిరాఘాటంగా సాగేందుకు దోహదపడి, మాతృ వాత్సల్యాన్ని చాటడం ఆమె మానవతా దృక్పథానికి  నిదర్శనం.
తన భర్త పేరు ఎళ్లకాలం అందరికీ జ్ఞాపకం ఉండాలనే సంకల్పంతో మంగళగిరి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పూనుకున్నారు.
తన నిర్ణయాన్ని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన కృషి, పట్టుదలతో అత్యంత అధునాతన భవనాన్ని ఎవరి నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా పూర్తిగా తమ సొంత ఖర్చులతో నిర్మించారు.
ఇది ఇంజమూరి భావన్నారాయణ( ఐబీఎన్) పేరు మీద (ఐబిఎన్ భవన్)గా రూపుదాల్చింది.
తల్లిదండ్రుల ఆశయ సాధనను నెరవేర్చే కుమారుడిగా శ్రీనివాస నరేంద్రబాబు భవన నిర్మాణ పనులను సర్వ హంగులతో పూర్తి చేశారు.
ఇంతటి గొప్ప అవకాశం తమకు కల్పించిన శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి, విలేకరులకు పార్వతమ్మగారు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నారు.
ఇంజమూరి భావన్నారాయణ
 ఒక క్రమశిక్షణ, విద్యా విజన్ ఉన్న వ్యక్తి హెచ్ ఎంగా వస్తే మరింత ప్రగతికి బాటలు పడతాయని ఆలోచన చేసిన సికె సంస్థ పెద్దలు, ప్రముఖుల సూచనల మేరకు విద్యాశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న భావన్నారాయణ డిప్యుటేషన్ పై సికె విద్యాసంస్థ హెడ్ మాస్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఉపాధ్యాయులకు, సిబ్బందికి జీతభత్యాలు, బకాయిలు చెల్లించే స్థితి కూడా లేని రోజులవి. అపుడు తనకున్న అపారమైన అనుభవంతో విద్యాసంస్థను చక్కదిద్ది నూతన విధానాలకు ఐబీఎన్ నాంది పలికారు.
ఇంజమూరి భావన్నారాయణ
పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత, ఇతర వృత్తుల కార్మికుల బిడ్డలకోసం ఈ విద్యా సంస్థలో ఫీజులు నామమాత్రం చేశారు. ఫలితంగా ఈకుటుంబాలకు చెందిన పిల్లలెందరో విద్యావంతులయ్యారు.
ఆ రోజుల్లో విద్యా సంస్థ ఊపిరి,  విద్యార్థులు  పంచ ప్రాణాలుగా ఐబిఎన్ పాఠశాల నిర్వహించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని భావించిన ఐబీఎన్ ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళికలతో, ఉత్తమ శిక్షకులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, విద్యార్థి ప్రతిభాపాటవాలు వెలికితీసే టాలెంట్ టెస్టులు నిర్వహిస్తూ వచ్చారు. బాలల భవిష్యత్తుకు బంగారు బాట వేశారుు.
కుల, మత భేదాలు చూపకుండా ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. అద్వితీయమైన రీతిలో ఉత్తమ శ్రేణి ఫలితాలు సాధిస్తూ, అసమాన్యమైన అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తున్న ఏకైక సంస్థగా తీర్చిదిద్దారు.
దశాబ్ద కాలం పాటు  ఈ సంస్థలో ఐబిఎన్ హెడ్ మాస్టర్ గా  సేవలందించారు. ఈ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించేందుకు పునాదులు వేశారు. సి కే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గర్ల్స్ హై స్కూల్ ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర పోషించారు.
ఉపాధ్యాయలు, సిబ్బంది సహాయ, సహకారాలతో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఆదర్శ పాఠశాలగా గణతికెక్కి, ఉత్తమ శ్రేణి విద్యాలయంగా అలరారుతోంది.
(గోరంట్ల పూర్ణచంద్రరావు, సీనియర్ రిపోర్టర్, మంగళగిరి)