(సిఎల్ సలీమ్ బాషా)
ఐపీఎల్ 2020 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్,ముంబై ఇండియన్స్ మధ్య (28.09.20న) నరాలు తెగే ఉత్కంఠతో సాగి సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్ గురించి తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ సీజన్ లో మొదటి మ్యాచ్. అంతకుముందు ఆర్ సి బి రెండు మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచింది ఒకటి ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ కూడా అంతే. రెండు మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలిచింది.
ఈ మ్యాచ్ లో ముంబై మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే గతంలో ముందు బ్యాటింగ్ చేసిన మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి. ఇక బ్యాటింగ్ దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ ను ఘనంగా ఆరంభించింది. ఒపెనెర్స్ దేవ దత్త పడికల్ , ఆరోన్ ఫించ్ లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. అయితే వీరి జోడి కి ట్రెంట్ బౌల్ట్ బ్రేక్ వేశాడు. 9 ఓవర్ వద్ద ఫించ్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువలేక పోయాడు. మూడు పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బి డీవిలిర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 24 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అందులో నాలుగు ఫోర్లు, అన్నే సిక్సర్లు ఉన్నాయి. అతనికి కొంత సేపు దేవ దత్త పడికల్ (40 బంతుల్లో 54 పరుగులు) మంచి సహకారం అందించాడు. అది ” బడే మియా బడే మియా, చోటే మియా సుభానల్లహ్” లా ఉండింది. దేవ దత్త పడికల్ 17 ఓవర్లలో బోల్ట్ బౌలింగ్లో పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శివం దూబే చివరిదాకా ఉంటూ డీవిలిర్స్ చక్కటి సహకారం అందించాడు. మొత్తం మీద రాయల్ చాలెంజర్స్ ముంబై ఇండియన్స్ కి 201 పరుగుల చాలెంజ్ విసిరింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెన్ రోహిత్ శర్మ, డీకాక్ అర్జంటుగా పెవెలియన్ చేరుకున్నారు. రోహిత్ రెండవ ఓవర్లో నే సుందర్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయే పవన్ నేగీ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏడవ ఓవర్లో డీకాక్ చహెల్ బౌలింగ్లో పవన్ నేగీ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా నేగి కే క్యాచ్ ఇచ్చి 15 పరుగులు కే పెవెలియన్ చేరుకున్నాడు. పవన్ నేగి వరుసగా మూడు క్యాచ్ లు పట్టడం విశేషం అయితే తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగి పోయాడు. వరుస సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించాడు. 9 సిక్సర్లు రెండు బౌండరీలతో హోరెత్తించారు. అతనికి తోడు పొలార్డ్ కూడా కళ్ళు చెదిరే, బౌలర్లకు దిమ్మతిరిగే షాట్లతో ఎడాపెడా బాదేశాడు.. కేవలం 24 బంతుల్లో 60 పరుగులు సాధించి పంజాబ్ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు, బౌలర్ల కు పీడకలగా మారిపోయాడు. 5 సిక్సర్లు మూడు బౌండరీలు కొట్టాడు. ఇద్దరూ కలిసి 5 ఓవర్లలో 89 పరుగులు బాదేశారు.
చివరి ఓవర్ లో కూడా నరాలు తెగే ఉత్కంఠ త కొనసాగింది. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ 19 పరుగులు చేయాల్సి ఉండగా. మొదటి రెండు బంతులకు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాత రెండు బంతులను సిక్సర్లు గా మలిచిన కిషన్. 3 క్యాచ్ పట్టిన పవన్ నేగి నాలుగో క్యాచ్ వదిలేశాడు! అది బ్యాట్స్మన్ కిషన్ కీలకమైన క్యాచ్. ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్లి ఉండేది కాదు అది సిక్స్ గా కూడా మారిపోయింది. కిషన్ ఐదవ బంతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఒక్క పరుగుతో శతకాన్ని మిస్ అయ్యాడు. చివరి బంతికి సిక్సర్ సాధిస్తే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచేది. అయితే పొలార్డ్ బౌండరీ మాత్రమే కొట్టడంతో రెండు జట్ల స్కోర్ సమం అయ్యి, సూపర్ ఓవర్ కు తెరతీసింది. సూపర్ ఓవర్ లో కాస్త సంచలనం తోనే రాయల్ చాలెంజర్స్ గెలిచింది.
సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఒక వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. 8 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఐదు బంతుల్లో కేవలం 7 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్ లో డివిడి ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించగా, రివ్యూ లో నాటౌట్ గా తేలడం ఒక విశేషం. చివరి బంతికి ఒక పరుగు చేయవలసిన పరిస్థితిలో మ్యాచ్ “టై” ( సూపర్ ఓవర్ లో కూడా స్కోర్ సమం అయితే) అవుతుందేమోనన్న ఉత్కంఠత నెలకొంది. అయితే చివరి బంతిని బౌండరీ గా మలిచి ఉత్కంఠతకు తెర దింపాడు
ఎంతో చక్కగా బ్యాటింగ్ చేసిన కిషన్ చివరి క్షణంలో అవుట్ అవ్వడం వల్ల ముంబై ఆశలు ఆవిరయ్యాయి.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)