కరోనా పాజిటివ్ వచ్చిన వారు కొంతకాలం పాటు గుండె సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చెందిన గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ వనజ సూచించారు.
తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టిటిడి ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వనజ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం కారణంగా గుండె కండరాలు దెబ్బతినడం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి గుండెకు సరఫరాలో ఆటంకాలు ఏర్పడడం, గుండెపోటు లాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలని సూచించారు. ఇందుకు ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యమని, భారతీయులకు సంప్రదాయంగా వస్తున్న యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చక్కగా ఉపయోగపడతాయని వివరించారు. అనంతరం ఉద్యోగులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ ఆన్లైన్ అవగాహన కార్యక్రమంలో వైజాగ్, రిషికేష్ నుండి కూడా పలువురు ఉద్యోగులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు డా. ఎ.రామాంజులరెడ్డి, ఏఈవో శ్రీమతి జగదీశ్వరి పాల్గొన్నారు.