తెలుగు రాష్ట్రంలో రాయలసీమ పట్ల వివక్షను తరిమికొడదాం
(యనమల నాగిరెడ్డి)
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి కీలకమైన శ్రీభాగ్ ఒప్పందానికి ప్రాణం పోసి రాయలసీమ పట్ల పాలకులు, రాజకీయపార్టీలు చూపుతున్న వివక్షను ప్రశ్నించడానికి, వారి వివక్షాపూరిత విధానాల నుండి మన సీమను కాపాడుకోవడానికి సీమ వాసులంతా సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. అందులోభాగంగా శ్రీభాగ్ ఒప్పందం ప్రాతిపదికన 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంద్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్1 న జరుపుకుని చరిత్రను అందరికీ గుర్తుచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు.
గత దశాబ్ద కాలంగా సీమ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులంతా అక్టోబర్ 1ని ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని, 1937 నవంబర్16 న కోస్తా రాయలసీమ పెద్దల మధ్య కుదిరిన శ్రీభాగ్ ఒప్పందాన్నిఅమలు చేసి రాయలసీమను ఆదుకోవాలని పాలక, ప్రతిపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కోరాలని ఆయన సభ్య సంఘాలకు విజ్ఞప్తిచేశారు.
శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యం :ఉల్లంఘన
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో వివక్షకు గురి అవుతున్న తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై అనేక దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసారు. ఈ పోరాటంలో తొలి విజయంగా అనంతపురంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనుమతులు లభించినా విశాఖపట్నంలో ఏర్పాటు చేసారు. ఈ సంఘటనతో తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి, ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి దూరమయ్యారు. రాయలసీమ ప్రజల సహకారం లేకుండా ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధన సాధ్యం కాదని గుర్తించిన కోస్తాంధ్ర నాయకులు రాయలసీమ నాయకులను ఒప్పించి “రాయలసీమ అభివృద్ధికి కీలకమైన అంశాలతో” 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒడంబడికను చేసుకున్నారు. ఈ ఒడంబడికను నమ్మిన సీమ నాయకులు తెలుగు రాష్ట్ర సాధనకు కోస్తా నాయకులతో కలిసి చేసిన పోరాటం, అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మ బలిదానంతో 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
ఐతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోస్తా పెద్దలు, పాలకులు, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాయలసీమకు సరిదిద్దలేని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన నీటి ఒప్పందం ఆచరణకు నోచుకోలేదు.
ఆ ఒప్పందం మేరకు “ రాయలసీమ, నెల్లూరు జిల్లాల వ్యవసాయ అభివృద్ధికి, సీమ ప్రాంతం కోస్తా జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందటానికి నీటి పారుదల విషయంలో పది సంవత్సరాలు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలం రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల పైన పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో రాయలసీమ జిల్లాల అభివృద్ధి కొరకు దృష్టి కేంద్రీకరించాలి. నదుల నీటి పంపకంలొ ఏవైనా సమస్యలు వస్తే రాయలసీమ అవసరాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు”.
1951లో ప్లానింగ్ కమీషన్ అనుమతి పొందిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో 20 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు లభించే ప్రతిపాదనను మూలన పడవేసిన కోస్తా నాయకులు నాగార్జునసాగర్ ను నిర్మించి నదీజలాల వినియోగంలో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యమిస్తామని చేసుకున్న ఒప్పందానికి తిలోదకాలిచ్చి, చివరి ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
రాజధాని లేదా హైకోర్టుల్లో సీమ వారి కోరిక మేరకు ఎదో ఒక దానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే 2014లో తిరిగి పూర్వపు ఆంద్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఒప్పందాన్ని కనీసం గుర్తు కూడా చేసుకోలేదు. అలాగే కోస్తా జిల్లాలతో సమానంగా సీమ జిల్లాలకు శాసన సభలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. రాష్ట్రంఏర్పడిన తర్వాత ఎవరు ఈఅంశాన్ని పట్టించు కోలేదని, శాసనసభలో సంఖ్యాబలం అధికంగా ఉండటం వల్ల పాలకులు సీమకు అన్ని రంగాలలో అన్యాయం చేయగలిగారని ఆయన ఆరోపించారు.
అందువల్ల శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు న్యాయం చేయాలన్న సీమ ప్రజల చిరకాల ఆకాంక్షను రాజకీయ పార్టీలకు, పాలక, ప్రతిపక్షాలకు జ్ఞాపకం చేయడం కోసం అక్టోబర్ 1 న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాల్సి ఉందని సభ్య సంఘాలు ప్రజల భాగస్వామ్యంతో ఈకార్యక్రమం నిర్వహించాలని ఆయన కోరారు.
(యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)