(శలకోటి వీరయ్య,తూతిక శ్రీనివాస విశ్వనాథ్)
ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ స్వాతంత్ర సమరయోధులు, మాజీ శాశన సభ్యులు, కీ.శే పుచ్చల సత్యనారాయణ గారి వర్దంతి సంధర్భంగా జోహార్లు పలుకుతు నివాళులు అర్పిస్తుంది
చేనేత వర్గానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కీ.శే పుచ్చల సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో 10-4-1909 సం.లో జన్మించారు. వీరు చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కమ్యూనిస్టు యోధుడు గా ఎదిగారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొంటూ 1936 లో ఉప్పాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచి సంఘసేవలు అందించేవారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సర్వమానవ సమానత్వానికై పాటుపడ్డారు.
1955 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసిన శ్రీ పుచ్చల సత్యనారాయణ గారు అఖండ మెజార్టీతో గెలుపొందారు. 1962 వరకు ప్రజానాయకుడిగా సేవలు అందించారు. దేవాంగ కులభూషణుడైన ఆయన ముఖ్యంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి, సమాజహితానికి చేసిన కృషి ఎనలేనిది.
చేనేతవర్గాలపై ఆయన ప్రేమ ఎనలేనిది. చేనేతవర్గాలు వెనుకబడిపోతున్న తీరును గమనించి విద్యతోనే అభివృద్ధి సాద్యమని గ్రహించి 1976 లో కాకినాడలో పేదవిద్యార్థులకు ఉచిత హాస్టల్ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు చేయూతనందించారు.
MLA గా వున్న సమయంలోనే వారు చేనేత పరిశ్రమకు అద్దం పట్టేలా చేనేత దర్పణం అనే పుస్తాకాన్ని రచించారు. దానితో పాటు AP సేల్స్ టాక్స్ అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఎన్నో విషయాలు వాటిలో చర్చించారు.
(ఆయన రాసిన చేనేత దర్పణం (విశాలంధ్ర ప్రచురణ. ఇపుడు అందుబాటులో లేదు) పుస్తకం చేనేత రంగం పరిస్థితుల మీద వచ్చిన చాలా లోతైన విశ్లేషణ. చేనేత రంగం సంక్షేమం కోరేవాళ్లు ఆ పుస్తకాన్ని తప్పక చదవాలి. ఈ పుస్తకం ఒక గొప్ప పరిశోధనా గ్రంధం. మగ్గం పుట్టుపూర్వోత్తరాలను ఆనేక పరిశోధన పత్రాాలను శోధించి రాశారు. ఆయనలెక్క ప్రకారం మగ్గానికి కనీసం 5000 సంవత్సరాలచరిత్ర ఉంది. హరప్పా, మొహంజోదారో తవ్వకాలలో ఎముకలతో తయారుచేసిన మగ్గం పలకలు కనిపించాయి.
తర్వాత భారతదేశంలో చేనేత రంగ పరిణామాన్ని చాలాకూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ పుస్తకం ఏ పిహెచ్ డిగ్రాంధానికి తీసిపోదు. నిజానికి చేనేత రంగం పతనానికి రంగం 1956 నాటికే తయారయిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆరోజు నిత్యానంద కనుంగో (ఒరిస్సా ఎంపి) నాయకత్వంలో వేసిన కమిటీ (Textile Inquiry Committee) రిపోర్టుయే చేనేత రంగానికి రాసిన మొదటి మరణ శాసనం అని, అప్పటినుంచి ప్రభుత్వాల నిర్లక్ష్యం చేనేత రంగాన్ని పతనం చేస్తూ వస్తున్నదని ఆయన నిస్సంకోచంగా చెప్పారు.
1954 సెప్టెంబర్లో కానుంగో కమిటీ చేసిన 4 సిఫార్సులు
- చేమగ్గాల స్థానంలో పవర్ మగ్గాలను ప్రవేశపెట్టడం,
- పవర్ మగ్గాల స్థానంలో ఆటోమేటిక్ మగ్గాలను ప్రవేశపెట్టడం
- చేనేత మగ్గాలకు రిజిస్ట్రేషన్ పద్ధతిని సూచించడం
- చేమగ్గాల సంఖ్యను వీలయినంత తగ్గించి క్రమక్రమంగా ఆపరిశ్రమను రూపుమాపడం.
సత్యానారాయణ తన పుస్తకంలో మరొక విషయం కూడా వెల్లడించారు.అదేమిటంటే, తనను కలుకునేందుకు వచ్చిన చేనేత ప్రతినిధి బృందంతో నాటి ప్రధాని నెహ్రూ ‘చీరెలను ధోవతులను పూర్తిగా చేనేత రంగానికి రిజర్వు చేయడమనేది చాలా ప్రమాదకరమయిన నిర్ణయం అవుతుంది,’ అని అన్నారట. దీని వల్ల వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే ఒక రంగం మీద స్వాతంత్య్రం వచ్చాక ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుస్తుంది.
ఆ రోజు లో చేనేత రంగాన్ని అధ్యయనం చేసేందుకు వేసిన కొనుంగో కమిటీ స్వాతంత్య్ర భారత దేశంలో వేసిన మొదటి కమిటి. దురుదృష్ట వశాత్తు ఆయన చేనేత రంగాన్ని మూసేయాలని సెలవిచ్చారు. చేనేత రంగానికి భవిష్యత్తు లేదని చెప్పడం సత్యనారాయణను బాగా బాధించింది. ఆయన రాసిన ‘చేనేత దర్పణం’లో ఒక పేజీ ఇది.
చారిత్రక విలువ ఉన్న అమూల్యమయిన పుస్తకం ఇది. చేనేత రంగంలో పనిచేస్తున్న సంస్థలు, పెద్దలు ఈ పుస్తకాన్ని పునర్ముద్రించాల్సిన అవసరం ఉంది. ఇందులో గణాంక వివరాలు పాతవే కాని, ఆయన ఒక సత్యాన్ని ఆవిష్కరించారు. అదే చేనేత రంగాన్నినాశనం చేసేందుకు బీజం ఆరోజు పడింది, అదెలా మొలకెత్తి క్రమంగా మానయిందనేది ఆ సత్యం. అందుకే ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరు చదవాలి.)