తమను తాము వివరించుకుంటూ, సమర్ధించుకుంటూ ,శక్తి కొద్దీ ప్రయత్నాలు,
పరస్పరం అర్ధం చేసుకోలేక…నిష్ప్రయోజనంగా….
రెక్కలు టపటపా కొట్టుకుంటూ…ఒంటరిపాటుగా దుఃఖాలాపన
‘ ప్రియతమా , నా దగ్గరకు వచ్చేయ్.నా బాధను తుడిచేయ్.”
“బయటికి దారి మూసుకుపోయిన నీ పంజరం లోకి వచ్చానా, నేను చస్తాను” స్వేచ్చావిహంగ స్వరం
“ఎలా మరి? ఎగరటానికి నాకు శక్తి లేదు” బందీపక్షి వేదనాభారం
(కింది వీడియో బెంగాలీ గేయ ప్రదర్శన)
విశ్వకవి, గురుదేవ్ ,రవీంద్రనాథ్ టాగోర్ (07 మే-1861 నుండి 07ఆగస్ట్ 1941) అనేక సామాజిక, తాత్విక విషయాల పై కవనం ఆలపించారు.
అవి మానవ సమాజంలోని అస్తిత్వ సంశయాలకు,సంవేదనలకు స్పందనలు. మానవ స్వభావానికి చెందిన లోతైన పరిశీలనలు, అత్యంత కళాత్మకంగా వెలువడిన భావనలు ఆ రచనలు. వాటి కవితా సౌందర్యం అనుపమానం. బెంగాలి భాష లో వాటికి సాటి రాగల రచనలు ఎన్నో లేవని అంటారు. అసలు రచనలతో పోలిస్తే, వాటి అనువాదాలు చాల పేలవం గా ఉంటాయని , వాటి నిగూఢ ,మార్మిక ,ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఏ మాత్రం బట్వాడా చేయలేక పోయాయని అమర్త్యసేన్ లాటి విజ్ఞుల అభిప్రాయం. టాగోర్ స్వయంగా చేసికొన్న ఇంగ్లీష్ అనువాదాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని ఈ రెండు భాషలు తెలిసిన వారు అంటారు. అందుకేనేమో ఇప్పటికీ అనేక టాగోర్ అనువాదాలు వెలువడుతుంటాయి. ఆయన రచనలలోని ఆలోచనా పటుత్వం,వాటి అంతర్గత సందేశం ఇతర కవిత్వాలను ఎంతో అధిగమించి పోతూ, చదువరిని ఉన్నతీకరిస్తుంది.
ప్రస్తుత కవితను టాగోర్, 1892లో రాసారు.ఆయన “ఆధునిక సాహిత్య- 1894” లో ఈ గీతం గురించి ఇలా రాసారు.”మన మానవ స్వభావం లో,ప్రకృతిలో స్వేచ్చగా విహరించే పురుషతత్వం (masculine entity)ఒకటి ఉంది. ఇది ఏ బంధాలకు కట్టుబడి ఉండటానికి ఇష్టపడదు. దీని ప్రక్కనే ఒక స్త్రీ అంశ (feminine) ఉంది. అది ఇంటి గోడల మధ్య భద్రమైన,సురక్షితమైన జీవనం కోరుకుంటుంది. దానికే ప్రాధాన్యత నిస్తుంది. విడదీయలేని ఒక అనుబంధంలో ఈ రెండూ కట్టుబడి ఉంటాయి. మొక్కవోని తన శక్తి సామర్ధ్యాలను అభివృద్ధి పరచుకోవాలని అమిత ఆసక్తి తో, అవి బహుముఖాలు గా విస్తరించాలని, ఎప్పటికప్పుడు నూతన జీవిత రుచులను ఆస్వాదించాలని కొత్త ప్రపంచాలను అన్వేషిస్తూ ఒకటి. సంప్రదాయ యోచనలతో, పూర్వ నిర్ధారిత ద్రుష్టి తో, అలవాటైన ఆలోచనలు ఆచరణలతో, చిక్కుకుపోయి మరొకటి.
ఒకటి నిన్ను విశాల ప్రపంచం లోనికి తీసుకు వెళుతుంది. మరోటి నిన్ను ఇంటి వైపు లాగుతున్నట్లు కనిపిస్తుంది.ఒకటి అడవి పక్షి, మరొకటి పంజరం పక్షి. ఈ అడవి పక్షి సదా పాడుతూనే ఉంటుంది. ఈ గానం లో అదుపులేని స్వేచ్చాకాంక్షల గుసగుసలు, విస్తృత మాధుర్యమూ ప్రతిఫలిస్తాయి.” అంటారు.
ప్రస్తుత కవితలో ఈ రెండు లక్షణాలను రెండు పక్షులుగా ప్రతిరూపించారు. అయితే వాటిని స్త్రీలు, పురుషులు అనే వ్యక్తులుగా కన్నా, రెండు జాతులుగా కన్నా, రెండు విరుద్ధ లక్షణాలుగా, రెండు స్వభాలుగా పరిగణించాలి.ఈ స్వభావం ఏ వ్యక్తిలోనయినా ఉండవచ్చు. కవితలో పక్షుల లింగభేదం స్పష్టంగా వాచ్యంగా లేదు, కానీ టాగోర్ చెప్పిన పురుష అంశకు స్వేచ్చా విహంగం, స్త్రీ అంశకు బందీపక్షి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అతి తేలికగానే తెలిసిపోతుంది. 1800 పూర్వార్ధపు స్త్రీ పురుష సామాజిక పాత్రలను ఈ విధంగా చిత్రించారు అనుకోవచ్చు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్థితి, ముద్ర పూర్తిగా తొలిగిపోలేదని మనం చూస్తున్నదే. ఇప్పటికీ, స్త్రీలను ఇంటి దీపాలుగాను, ఇంటి నిర్వాహకురాలి గాను చూస్తున్నాం,అలాగే పెంచుతున్నాం,అదే నేర్పుతున్నాం. టాగోర్ ఈ కవిత రాసిన 125 సంవత్సరాల తర్వాత కూడా స్త్రీ పురుష ధృ వాలు దాదాపు అదే సంఘర్షణలో ఉన్నాయి. ఈ రెంటి లో సున్నితమైనది స్త్రీత్వం, అందుకే ఇంకా కొల్లగొట్ట బడుతూనే ఉంది. ఆధిపత్యం,ఆజమాయిషీల క్రింద నలిగిపోతూనే ఉంది
ఇప్పుడు ఇల్లు సురక్షితమేనా అన్న ప్రశ్న అలా ఉండనిచ్చి, సురక్షితమైన ఇంటికీ, భద్రమైన జీవితానికి కట్టుబడి స్త్రీత్వం; నిశృంఖల విహారానికి,దుస్సాహసిక ఆటవిక ప్రవృత్తి కి పురుషత్వం ప్రతీకలుగా మారాయి.
ఈ రెండు స్వభావాలు పరస్పరం అభిముఖం. నిజానికివి ద్వంద్వం. అయితే ఈ ఆధునిక జీవితంలో ఈ స్వభావాలను లింగ పరంగా అన్వయించ లేము,కానీ వీటి మధ్య సామాజిక సంతులనం సాధించటమే సామరస్యం. అడవి సహజం,పంజరం కృత్రిమం. ఈ విరుద్ధ స్వభావాల సమతులనమే జీవన సౌగంధం.
ఈ సంభాషణా గీతంలో టాగోర్, ఇటు స్వేచ్చనీ, అటు బంధాన్నీఒకే తమకంతో వర్ణించారు,దాంతో ఆయన దేనిని సమర్దిస్తున్నదీ తెలియదు. రెండింటిలొనూ ఆయన ఆనందం చూస్తున్నారా! అనిపిస్తుంది. “దేన్నయినా త్యజించడం లో నాకు విమోచనం లేదు. వేయి బంధాల ఆనందం లోనే నేను స్వేఛ్చ ఆలింగనపు అనుభూతిని పొందుతాను” అంటారు ఆయన. టాగోర్ తాను భూమికి , మాతృభూమికి , దేశవాసులకీ, అణగారిన ప్రజలకీ కట్టుబడి ఉన్నట్లు భావించారు. అయితే ఆయన సంపూర్ణ జీవన తాత్వికత మొత్తం స్వేఛ్చ చుట్టూ పరిభ్రమిస్తుంది.స్వేచ్చకు టాగోర్ కల్పించిన రూపమే విను వీధుల్లోకి ఎగిరిపోతున్న పక్షి.
(డా. మోనిష్ ఆర్ చటర్జీ ,22సెప్టెంబర్ న కౌంటర్ కరంట్స్ వెబ్ పత్రికలో టాగోర్ కవితకు ఇంగ్లీష్ అనువాదం , వ్యాఖ్యానం ప్రచురించారు. దాని ఆధారంగాడ డాక్టర్ జతిన్ కుమార్ కవితానువాదం,వ్యాఖ్యానం )