తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం సాయంత్రం ”భాగ్‌సవారి” ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బందీస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బందీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్ – 19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర నిర్వహించారు.