(ఎస్ పి బాలసుబ్రమణ్యం)
ఆ రోజు ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను.
ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా తనకు సాటి తానేననిపించుకొనిన వారు.
వీరి ముందు నా స్వల్ప జ్ఞానంతో పాడటం కష్టమనిపించింది. ఎలాగో ఒక విధంగా కళ్ళు మూసుకుని పాడాను.
ఇది కూాడా చదవండి
ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలి పాట ముచ్చట్లు (ఆయన మాటల్లోనే)
తప్పులున్నా చిన్నవాడినని భావించి వదిలేశారని భావిస్తాను.ఆ పాటను వాళ్ళు మెచ్చుకున్నారు. ఆ తరువాత అసలు పాటే నన్ను వాళ్ళకు పాడి వినిపించమన్నారు. మళ్ళీ మామూలుగా కళ్ళు మూసుకుని ‘ఏమి ఈ వింత మోహం’ మొదటి నుంచి చివరి దాకా పాడాను.
మరుసటి రోజు విజయా గార్డన్స్ రికార్డింగ్ ధియోటర్ లో రికార్డింగ్. మధ్యాహ్నం 2 నుంచి 9 గంటల వరకూ కాల్ షీట్. వాద్య బృందాన్ని,శబ్ద గ్రాహక యంత్రాల్ని చూడగానే ఏదో దడ,చెప్పలేని భయం నాకు కలిగినవి. శ్రీ కోదండపాణి,శ్రీ పద్మనాభంగారలు నాకు ధైర్యం చెప్పి ధైర్యంగా పాడమని ప్రోత్సహించారు.
నా గాత్రం స్పీకర్ లో ఎలా ఉంటుందో వింటే భయం ఉండదని నచ్చచెప్పారు. రికార్డిస్టు శ్రీ స్వామినాధన్ ఎంతగానో ప్రోత్సహించారు.రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి.నేను మైకు ముందు నిలబడ్డాను. సుశీలగారు పల్లవి ప్రారంభించారు. నేపధ్య సంగీతం పూర్తి కాగానే ‘రావే కావ్య సుమబాల’ పాడి ముగించాను. పాట పూర్తి కాగానే అందరూ ఒక్క సారిగా నన్ను చుట్టు ముట్టి అభినందనలు అందచేసారు. కోదండపాణిగారు చాలా బాగుందయ్యా..టేక్ తీద్దాం..భయపడకుండా పాడు అన్నారు…పాడాను(ము).
మొదటి టేక్ ఓకే కావటంతో కోదండపాణి,పద్మనాభంగార్ల బంగారు చేతులతో నా సినీ సంగీత జీవితానికి స్ధిరమైన పునాది ఏర్పడింది. దైవం ఆ విధంగా మానుష రూపాలలో వచ్చి నాకు తోర్పడినందు చేత నా ఈ సినీ జీవితంలో ఒక నిలకడ ఏర్పడింది.
(నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అది నడిపింది శ్రీ జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారి మిత్రులు గాయకులు పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించారు.