రాజంపేట వైసీపీ ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ బాబు పై కడప జిల్లా సుండుపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదు కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నది. అదీ కూడా విజయశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన అనుచరులు కొందరు వైసీపీ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్న ఆరంరెడ్డి, ఆయన కుమారులు, అనుచరులపై మారణాయుధాలతో దాడి చేశారన్న ఆరంరెడ్డి పిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు ఈ కేసు నమోడు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాలు తలపడటం జిల్లాలో తీవ్ర చర్చినీయాంశంగా మారింది.
ఈ దాడి నేపధ్యంలో రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
రాజంపేట నియోజకవర్గంలో రాజకీయంగా తన పట్టు పెంచుకొని ఏక చ్ఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించడం కోసం వైసీపీ ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు పార్టీకి గండంగా మారాయని ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు అంటున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో తన రక్త సంభందీకులను మాత్రమే ప్రతినిధులుగా ఉంచి, వారి ద్వారా ఎంఎల్ ఏ అన్ని వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని పలువురు పార్టీ నాయకులు ఆరోపించారు.
అందులో భాగంగా ఎంఎల్ ఏ తన సోదరుడు విజయశేఖర్ రెడ్డిని సుండుపల్లె మండలంలో తన అధికార ప్రతినిధిగా ఉంచారని, ఆయన వ్యవహార శైలి వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఐక్యంగా ఉన్న పార్టీ కార్యకర్తలను చీల్చి ఆయన వర్గాలను తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుండుపల్లె మండలంలో రాజకీయంగా తిరుగులేని పట్టున్న రవీంద్రారెడ్డి కుటుంబంలో ఉన్న విభేదాలను పెంచి పెద్ద చేసి వారి కుటుంబంలో కూడా ఆయన వర్గాలు ఏర్పాటు చేయగలిగారనే ఆరోపణలున్నాయి.
మండలంలో ఉన్న అధికారులను పూర్తిగా తన కనుసన్నలలో ఉంచుకొన్న మేడా సోదరుడు “ఎవరికీ ఏ పని జరగాలన్నా తన అనుమతి లేకుండా జరగకుండా అధికారులు చేయలేని పరిస్థితి సృష్టించారనే” ఆరోపణలు ప్రబలంగా ఉన్నాయి. ఎం.ఆర్.ఓ కార్యాలయం పూర్తిగా మేడా సోదరుడి ఆధిపత్యంలో ఉందని, ఎం.ఆర్.ఓ కేవలం మేడా సోదరుడి ష్టాంపుగా పని చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ కూడా విజయశేఖర్ రెడ్డి సూచనల మేరకు పని చేస్తున్నదని ఆరోపణలున్నాయి. అందుకే ఆరంరెడ్డి తన ఫిర్యాదును సుండుపల్లెఎస్.ఐ.కి ఇవ్వకుండా రాయచోటి రూరల్ సి.ఐకి ఇచ్చారని వైసీపీ నాయకులు అంటున్నారు.
విజయశేఖర్ రెడ్డి ఎంఎల్ ఏ గా ఉన్న తన సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డి పలుకుబడి ఉపయోగించుకొని మండలంలోని ప్రభుత్వభూములను ఆక్రమించుకుంటున్నారని, పలు గుట్టలు కూడా అన్యాక్రాంతమయ్యాయని, అందులో భాగంగా బైరాగి గుట్ట వద్ద ఆయనఅనుచరుడు రఫీ చేస్తున్న గుట్ట తవ్వకాలను స్థానికులతో కలసి అడ్డుకోవడమే ఆరంరెడ్డి చేసిన నేరమని, అందుకు ఆగ్రహించిన ఎంఎల్ ఏ సోదరుడు దాడి చేయించారని బాధితులు, పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అలాగే గతంలో టీడీపీ ఎంఎల్ ఏ గా ఉన్నపుడు తెలుగు తమ్ముళ్ళతో ఉన్న సంబంధాలను మేడా, ఆయన సోదరుడు కొనసాగిస్తూ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంఎల్ ఏ సోదరుడి ఆధిపత్య ధోరణి వల్ల పార్టీ లో వర్గాలు ఏర్పడి పార్టీ పూర్తిగా నాశనం అవుతున్నదని సీనియర్లు వాపోతున్నారు. ఇదే పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా ఉందని, మేడా కుటుంబ ఆధిపత్యం వల్ల నియోజక వర్గంలో పార్టీ పూర్తిగా ఇబ్బంది పడక తప్పదనే విషయాన్ని ముఖ్యమంత్రికి చేరవేయడానికి మేడా భాదితులు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇక ఒక మంత్రిగారి ప్రమేయంతోనే ఆరంరెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు అయిందనేది ఈ వార్తకు కోసం మెరుపు. .