ఫార్మసిస్ట్ లేనిది మందు లేదు, చికిత్సా లేదు: ఈ రోజు ప్రపంచ ఫార్మసిస్టుల దినం

 September 25: World Pharmacists Day

 

(డాక్టర్ రాపోలు సత్యనారాయణ)
కొవిడ్ 19 నేపథ్యంలో ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యత ప్రపంచానికి చాలా తెలిసి వచ్చింది. మందు లేదన్న మహామారికి ఉన్న మందులలో అనువైన వాటి ఎంపిక, డిమాండ్ కు సరిపడా ఉత్పాదన, పంపిణీ ఒక వైపు; వాక్సిన్ పరిశోధన మరొక వైపు చేస్తూ మానవాళి ఆరోగ్యం కోసం అహరహం పోరు సల్పుతున్న నిశ్శబ్ద యోధులు ఫార్మసిస్ట్ లు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా దేశాధినేతలంతా కొవిడ్ 19 పోరులో ఫార్మసిస్ట్ ల సేవలను ప్రశంసించిండ్రు. మన దేశ రవాణా మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా ఫార్మసిస్ట్ లను కీర్తించగా, తెలంగాణ పరిశ్రమల మంత్రి కె తారకరామా రావు ఫార్మసిస్ట్ ఎర్ర రమేశ్ విడియో సందేశాన్ని ట్విట్టర్ లో పంచుకొన్నరు.

 

 

ఆరోగ్య వృత్తిదారులలో మూడవ అతిపెద్ద సంఖ్య ఫార్మసిస్ట్ లది. ఔషధ నిపుణులైన ఫార్మసిస్ట్ లు పరిశోధన, ఉత్పత్తి మొదలుకొని వినియోగం వరకు అన్ని దశలలో సర్వాంతర్యాములై తమ సేవలు అందిస్తున్నరు. స్కాటిష్ ఫార్మసిస్ట్ అలెక్సాండర్ ఫ్లెమింగ్ 1923 లో కనుగొన్న పెనిసిలిన్ వైద్యరంగంలో పెను విప్లవం. అంతకు మునుపు, ఆ తరువాత ఇప్పటి దాకా ఫార్మసిస్ట్ లు చేస్తున్న ఆవిష్కరణలు అసామాన్యమైనవి. రుగ్మత ఏదైనా స్వస్థత తమ ధ్యేయంగా ఔషధాలు అందిస్తున్నరు ఫార్మసిస్ట్ లు. అంతర్జాతీయ ఫార్మసిస్ట్ ల సమాఖ్య (ఎఫ్ఐపి) ఆవిర్భవించిన సెప్టెంబర్ 25 తేదీని ఏటా “ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం”గా జరుపు కొంటున్నం. “ప్రపంచ ఆరోగ్యాన్ని పరివర్తనం చేస్తున్న ఫార్మసిస్ట్ లు” ( ఫార్మసిస్ట్ స్ : ట్రాన్స్ ‌ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్) ను ఈ ఏటి నినాదంగా ఎంపిక చేసింది ఎఫ్ఐపి. ఫార్మసిస్ట్ లు ఆరోగ్య సాంకేతికతను, ఔషదీయ సంరక్షణను జనాలకు అందిస్తున్న తీరును ప్రపంచానికి మరింత విశదం చేసెటానికే ఈ నినాదం ఎంపిక చేసినట్లు ఎఫ్ఐపి అధ్యక్షుడు డొమినిక్ జోర్డాన్ ప్రకటించిండ్రు.
ఫార్మసిస్ట్ లేనిది ఔషధం లేదు; ఔషధ చికిత్స లేదు. అటువంటి ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యతను ఆరోగ్య వ్యవస్థ అప్రధానం చేస్తున్నది. హాస్పిటల్ లలో రోగుల నిష్పత్తికి తగిన సంఖ్యలో ఫార్మసిస్ట్ ల నియామకం లేదు. పదోన్నతులు లేవు. ఇన్ పేషంట్ లకు వార్డ్ ఫార్మసిస్ట్ వ్యవస్థ లేదు. బస్తీ దవాఖాన లలో ఫార్మసిస్ట్ లే లేరు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ఫార్మసిస్ట్ లు ఉండరు. జాతీయ ఆరోగ్య విధానం 2017 లో ‘మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్’ గ ఫార్మసిస్ట్ లను వినియోగించు కోవాలని నిర్దేశించినా అధికారుల వివక్ష. కమ్యూనిటీ ఫార్మసీ లో తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేదు. వీటన్నిటి ఫలితంగా ఉన్నత ప్రమాణాలతో అర్హతలు సాధించిన ఫార్మసిస్ట్ లు చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఆత్మన్యూనతతో బాధ పడుతున్నరు. దీని వలన ఫార్మసిస్ట్ లు వ్యక్తులుగా నష్ట పోవచ్చు. కాని, ఈ లోపభూయిష్ట ఆరోగ్య వ్యవస్థ వలన నిజంగా నష్ట పోయేది ప్రజలే!
Dr Rapolu Satyanayana
(వ్యాసకర్త ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు) ఫోన్: 940163211