వ్యవసాయాన్ని, పరిశ్రమలను బహుళజాతి కార్పొరేట్ శక్తులకు అప్పగించే, రైతాంగాన్ని, కార్మికులను కట్టుబానిసలుగా మార్చనున్న ఇటీవలి పార్లమెంటు బిల్లులు, చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలకు కవుల, కళాకారుల, రచయితల, మేధావుల సంఘీభావంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన పూర్తి పాఠం:
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ కూటమి, నయాన్నో భయాన్నో రాష్ట్రాల్లో తమకు పాలకమిత్రులుగా మార్చుకున్న పార్టీలతో కలసి ఈ దేశ ప్రధాన పునాది రంగాలైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను దుంపనాశనం చేయడానికి ఉద్దేశించిన బిల్లులను పార్లమెంట్ లో హడావిడిగా ఆమోదించింది.
కరోనా పేరుతో ఇప్పుడు నడుస్తున్నది అప్రకటిత ఎమర్జెన్సీ రోజులు. ప్రజలంతా కరోనాకు, దాని పేరుతో పాలకులు సాగిస్తున్న అనాలోచిత విధానాలకు గడచిన ఆరునెలలుగా ఎంత మూల్యం చెల్లించారో చూస్తున్నాం.
గత పార్లమెంటు సమావేశాలకు, ఈ పార్లమెంట్ సమావేశాలకు మధ్య బిజెపి పాలిత రాష్ట్రాల్లో రిహార్సల్స్ వేసుకుని ఏకంగా భారత రైతాంగం పైన, కార్మికుల పైన, మొత్తం ప్రజల పైన ప్రభావాన్ని చూపే దుర్మార్గపు బిల్లులను – సెప్టెంబర్ 20 న మూడు బిల్లులు, 23 న కొన్ని బిల్లులు పార్లమెంట్ లో ఆమోదించారు.
మొదటి 3 చట్టాలుగా మారితే కార్పోరేట్ కంపెనీల చేతుల్లో చిన్న రైతులు లీజుకి భూములిచ్చిన బందీలుగా, క్రమంగా ఒకనాటి నీలి రైతులుగా మారిపోతారు. మార్కెట్ యార్డులను గల్లీ దళారులకు బదులు ఢిల్లీ దళారులు కబ్జాపెడతారు. ఇప్పటికే ప్రకటించిన మద్దతు ధర ఎన్నడూ, ఎక్కడా అమలు గాదు. మొక్కజొన్నకు 1700 అంటరు, మేమే కొనేస్తామంటరు.1300 కి ఆడిగేటోళ్లు లేరు. గిట్టుబాటు ధర అన్న పదమే ఉండదు.
పంటల విధానం, మార్కెట్, స్టోరేజ్ – వాటిపైన పన్నులు రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రం బహుళజాతి కార్పొరేట్లకప్పగించేస్తుంది. నిత్యావసరాల సరుకుల లిస్టు లోనుంచి చాలా పంటలకు మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా అన్ని ఆహారపంటలు లక్షల టన్నులు కార్పొరేట్ బ్లాక్ మార్కెట్లోకి వెళతాయి.
ఈ దేశ ప్రజానీకాన్ని ఇప్పటివరకు వినియోగదారులుగా చూస్తున్న కంపెనీలు తమకు లాభాలు కురిపించే నట్టులు బోల్టులుగా చూస్తారు. రైతుకు ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుందని, దళారుల పీడ వుండదని పాలకులు, వారి అనుకూలమైన మేధావులు, మీడియా తెగ ఊదరకొడుతున్నారు. అమెరికా నుంచి దిగుమతులపై మరొక 15 శాతం సుంకం తగించే ఒప్పందాలు చేసుకుని కార్పొరేట్ కంపెనీలకు మరింత స్వేచ్ఛ ఇచ్చారు. వారు ఎవరి ముడి సరుకులు కొంటారో స్పష్టమే.
ఇప్పటికే రైతాంగానికి సుబాబుల్, జామాయిల్, పొగాకు కొనుగోళ్ల అనుభవాలు బోల్డున్నాయ్. మొత్తం వ్యవసాయమే గిట్టుబాటు కాదనుకుని పాడి రైతులుగా మారినప్పుడు వారిని ఆ కంపెనీలు ఎలా దోపిడి చేస్తున్నాయో, రేపటి రోజున ఈ కంపెనీలన్నీ కార్పొరేట్ హాస్పిటళ్లు అమ్ముడుపోయినట్టు అమ్ముడయి ఏ వాల్ మార్ట్ మాత్రమే మిగిలితే, పాడికూడా గిట్టుబాటు కాని రోజు రాబోతున్నదని బతుకంతా మోసానికి గురౌతున్నా ఇంకా అర్ధం కాని వారెవరుంటారు. పాలకులు చెప్పే స్వేచ్ఛ కంపెనీలకు. వ్యవసాయ రంగంలో బతుకులు సాగిస్తున్న 70 శాతం పైగా ఉన్న ప్రజల జీవితాల్లో మరొక చీకటి దశ మొదలవబోతుంది.
ఇది ప్రపంచీకరణ స్వేచ్ఛ లాంటిదే. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మల లాంటి ఎల్ ఐ సి, బి ఎస్ ఎన్ ఎల్ , బ్యాంకులు, రైల్వే, ఎలక్ట్రిసిటీ, కోల్ రంగాలను విదేశీ కార్పొరేట్లకు అప్పగించే వినాశకర చర్యలను పాలకులు స్వేచ్ఛగా చేపడుతున్నారు. కరెంట్ మొత్తాన్నీ కేంద్రం తన గుప్పెట్లోకి లాగేసాక రేపు నెలకోసారి గ్యాసు ధరల్లాగా పెరగబోయే కరెంటు చార్జీలు కట్టుకోలేక దివాలా తీసే స్వేచ్ఛను బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రపంచమంతా పెట్రోల్, డీజల్ ధరలు ఎలా పెరుగుతున్నాయో, ఎవరు పెంచుతున్నారో తెలియనిదెవరికి. ఈ రైతు స్వేచ్చ బూటకం, పాలకుల నాటకం.
మరొకవైపు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ట్రేడ్ యూనియన్ లు ప్రతిఘటిస్తున్నప్పటికీ 44 చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి పార్లమెంటులో ఆమోదింపచేసారు. శతాబ్దం పైగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి యాజమాన్యాలకు, కార్పొరేట్లకు తాకట్టు పెట్టారు. గతంలో వందమంది వరకు వున్న పరిశ్రమలలో కార్మిక చట్టాల మినహాయింపు వుంది. దాన్ని 300 మందికి పెంచారు.
ఆధునిక టెక్నాలజీ యుగంలో ఈ మార్పుతో దాదాపు 49% పరిశ్రమలలో పనిచేసే కార్మికులు చట్ట పరిధి నుండి తప్పించబడతారు. 8 గంటల పని దినం బదులు 12 గంటల పని దినం అమలు లోకి వస్తుంది. ట్రేడ్ యూనియన్ హక్కులు దారుణంగా దెబ్బతింటాయి. ఇష్టారాజ్యంగా కార్మికులను తొలగించ గలుగుతారు. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ శాశ్వతంగా అమలు లోకి వస్తుంది. ఒక్క మాటలో 19 వశతాబ్దపు బానిస పరిస్థితి లోకి కార్మిక వర్గం నెట్టబడుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన రైతాంగం, కార్మికుల శ్రమ అనే రక్తాన్ని పిండి, పాకెట్లుగా కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా అప్పగించడానికి చూస్తున్నాయి. ఈ పరిస్థితులలో భారతదేశ శ్రామికులు చేయ తలపెట్టిన ఆందోళనలు న్యాయమైనవి. వారుచూపుతున్నది ధర్మాగ్రహం. వారి న్యాయమైన కోర్కెలను ప్రభుత్వాలు, రాష్ట్రపతి పతిగణలోకి తీసుకోవాలని, ఆ బిల్లులు చట్టరూపం పొందరాదని మేము కోరుతున్నాము. మనకందరికీ అన్నం పెట్టే శ్రామికులకు సంఘీభావాన్ని తెలుపుతున్నాము.
ప్రొ. వకుళాభరణం రామకృష్ణ, ప్రొ. డి. నర్సింహా రెడ్డి, ప్రొ.తోట. జ్యోతిరాణి, ప్రొ.కె.ఆర్ చౌదరి, సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, భూపాల్, శీలా వీర్రాజు, శీలా సుభద్రాదేవి, కాత్యాయని, ఘంటసాల నిర్మల, డా. నళిని, డా.ఆలూరి విజయలక్ష్మి, భండారు విజయ, ఎం లక్ష్మీ, శాంతి ప్రబోధ, విమల, దేవరాజు మహారాజు, ముక్తవరం పార్థసారధి, వారాల కృష్ణమూర్తి, సి.హెచ్. మధు, డా. ఎ కె. ప్రభాకర్, వఝల శివకుమార్, ప్రొ. దార్ల వెంకటేశ్వర్లు, శ్యామ్, వి.ఆర్ శర్మ, కె. పి. అశోక్ కుమార్, జనజ్వాల, కె.వేణుగోపాల్, అశోక్ కుమార్ (టిపిటిఎఫ్); డా. భట్టు లక్ష్మీనారాయణ, కె. రామ్మోహన్ (జనసాహితి); రమణ ప్రసాద్ (ఏఐ పిఎల్.సిఎఫ్), కోయిన్ని వెంకన్న, కె. శాంతారావ్, గడీల సుధాకర్ రెడ్డి కార్టూనిస్టులు: సుధామ, శంకు, నర్సింహ, సురేంద్రనాథ్