(CS Salem Basha)
ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన హాకీ క్రీడ ఇప్పుడు క్రమంగా కనుమరుగు కావడానికి కారణమేంటి? “మన జాతీయ క్రీడ హాకీ” అనే జనరల్ నాలెడ్జ్ బిట్ గా హాకీ క్రమంగా మారిపోయే పరిస్థితి ఎందుకు దాపురించింది? భారత జాతీయ జంతువు బెంగాల్ టైగర్ లాగే హాకీ కూడా క్రమంగా అంతరించి పోతుందా? అసలు ఈ దుస్థితికి ఎవరు కారణం?
చాలామంది మనదేశంలో క్రికెట్ కు పెరుగుతున్న ఆదరణ వల్ల క్రమంగా వెనక్కి వెళ్ళి పోయింది అని అనుకుంటున్నారు. అది పూర్తిగా వాస్తవం కాదు. క్రికెట్ ఒక కారణం మాత్రమే. మిగతా కారణాలు కూడా చూద్దాం.
1928 నుండి 1956 వరకు ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు వరుసగా ఆరు బంగారు పతకాలు, ఒక రజతం(1960 రోం ఒలింపిక్స్), మళ్లీ ఒక బంగారు పతకం(1964 టోక్యో) సాధించింది. ధ్యాన్ చంద్ లాంటి క్రీడాకారులు భారత హాకీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. 1968(మెక్సికో), 1972(మ్యూనిక్) లో కాంస్య పతకం మాత్రమే సాధించి 1976(మాంట్రియల్) లో ఏడో స్థానం లో నిలిచింది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరిసారిగా బంగారు పతకం గెలిచింది.
1980 తర్వాత భారత జట్టు గోల్డ్ కాదు, అసలు ఒక్క పతకం కూడా గెలవలేదు. పతకాల మాట అటుంచితే, 5,6 స్థానాలతో సరిపెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫై కూడా కాలేదు! 2020 టోక్యో ఒలింపిక్స్ కు అతి కష్టం మీద క్వాలిఫై అయింది.
ఒలింపిక్స్ లో నిరాశాజనకమైన ప్రదర్శనతో పాటు, ఇతర హాకీ టోర్నమెంట్లో కూడా భారత జట్టు ప్రదర్శన అంత బాగా లేకపోవడం కూడా ఒక కారణం. ఇంతవరకు జరిగిన 14 ఈ ప్రపంచ కప్పు టోర్నమెంట్లలో కూడా భారత్ కేవలం 1975 కౌలాలంపూర్ లో ఒక్కసారి మాత్రమే బంగారు పతకం సాధించింది. మిగతా టోర్నమెంట్లలో ఐదు నుంచి 11 స్థానాలు మాత్రమే సాధించింది. అలాగే 16 చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఒక్క పతకం కూడా సాధించలేదు. 6 కామన్వెల్త్ క్రీడలలో కేవలం రెండుసార్లు రజిత పతకాలతో సరిపెట్టుకుంది. 18 ఏషియన్ గేమ్స్ లో మూడు సార్లు మాత్రమే బంగారు పతకాలు సాధించింది
దీన్నిబట్టి అర్థమయ్యేది ఏంటంటే, 1976 నాటికే భారత హాకీ తన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టింది. అప్పటికి ఇంకా క్రికెట్ ప్రజల్లోకి వెళ్ళలేదు! మరి దానికి కారణం ఏంటి? అని చాలామంది ఆలోచించడం లేదు. ఈ నిరాశాజనక ప్రదర్శనకు కారణం హాకీ సమాఖ్య అధికారులు, కొంతవరకు ఆటగాళ్లు కూడా. ఇక్కడ ప్రేక్షకులను, హాకీ అభిమానులను తప్పు పట్టడానికి లేదు.
భారత హాకీ దుస్థితికి మొదటి కారణం హాకీ మైదానంగా చెప్పుకోవచ్చు. 1972 వరకు పచ్చిక మైదానాల్లో నిర్వహించిన హాకీ ఒలింపిక్స్, 1976 లో కృత్రిమమై ఆస్ట్రో టర్ఫ్ (Astro Turf) పైన నిర్వహించారు. అంతవరకూ పంజాబ్, కేరళ, గోవా, ఢిల్లీ పచ్చిక మైదానాల్లో ఆడటానికి అలవాటు పడిన భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ఆస్ట్రో టర్ఫ్ పైన ఆడటానికి తడబడ్డారు. పాస్ లతో ప్రత్యర్థులును ఇబ్బంది పెట్టి, పెనాల్టీ కార్నర్లు, స్ట్రోక్ లు అలవోకగా కొట్టగలిగిన మన ఆటగాళ్ళు చేష్టలుడిగి పోయారు. దాంతో మాంట్రియల్ ఒలింపిక్స్ లో భారత జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. తర్వాత మాస్కో ఒలంపిక్స్ లో బంగారం పతకం గెలిచినప్పటికీ 40 సంవత్సరాల పాటు భారత ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించ లేకపోయారు. ఆస్ట్రో టర్ఫ్ లో నైపుణ్యం కన్నా శారీరక దృఢత్వం అవసరం. పచ్చిక మైదానాల్లో అద్భుతంగా డ్రిబ్లింగ్ చేయగలిగిన మన ఆటగాళ్ళు, ఆస్ట్రో టర్ఫ్ పైన నిలబడలేకపోయారు.
మనదేశంలో ఆస్ట్రో టర్ఫ్ లు తక్కువ ఉన్నాయి. దానికి కారణం భారత హాకీ సమాఖ్య అధికారులు కూడా. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆస్ట్రో టర్ఫ్ లు ఉన్నాయి. ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్ట్రో టర్ఫ్ లు తయారు చేయడం భారత హాకీ సమాఖ్య అధికారులకు కష్టమైంది. దాంతో ప్రాక్టీస్ లేక భారత జట్టు నైపుణ్యమున్న ఆటగాళ్లను తయారు చేయలేక పోయింది. ఆస్ట్రేలియా, యూరప్ దేశాల ఆటగాళ్ళు బలంగా తయారు కావడానికి కారణం, వాళ్లకి అందుబాటులో ఎన్నో ఆస్ట్రో టర్ఫ్ లు ఉన్నాయి. ఆ విధంగా ఆస్ట్రో టర్ఫ్ లు, భారత సమాఖ్య అధికారులు భారత హాకీ దుస్థితికి చాలావరకూ కారణం. 1980 నుండి 2020 వరకు నలభై సంవత్సరాల కాలంలో, హాకీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన భారత హాకీ సమాఖ్య, ఇతర అధికారుల నిర్లక్ష్య వైఖరి హాకీ ని క్రమంగా అభిమానులకు దూరం చేసింది.
1983 లో మన దేశం ప్రపంచ కప్ క్రికెట్ గెలిచిన తర్వాత, ప్రేక్షకుల దృష్టి సహజంగానే క్రికెట్ వైపుకి మళ్లింది. ఆ తర్వాత వచ్చిన టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా క్రికెట్ ప్రజలకు చేరువైంది. దానికి తోడు ఒలింపిక్స్ లో మన జట్టు ఆటగాళ్ళు ఒక్క పతకం గెలవకపోవడం, ఇతర టోర్నమెంట్లలో పేలవమైన ప్రదర్శన వల్ల కూడా క్రమంగా ప్రేక్షకులకు దూరమవుతూ వచ్చింది. అంతవరకు రేడియో కామెంట్రీ, అప్పుడప్పుడు సినిమా హాళ్ళల్లో మూడు నిమిషాల సేపు చూపించే క్లిప్పింగ్స్ కు మాత్రమే పరిమితమైన క్రికెట్ టీ.వీ ల్లో నేరుగా ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యింది. ఓ పక్క హాకీలో నిరాశాజనక ప్రదర్శనలు, మరో పక్క క్రికెట్ వైపు ప్రేక్షకులను మళ్లించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల హాకీ మరింత దిగజారిపోయింది.
ఇక క్రికెట్ కాసుల వర్షం కురిపించింది. అధికారులకి, బిసిసిఐకి, స్పాన్సర్ కి అది ఒక బంగారు బాతు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా 70 నిమిషాల్లో పూర్తయిపోయే హాకీ కన్నా, గంటల సేపు నడిచే క్రికెట్ మంచిది అనిపించింది. అడ్వటైజ్మెంట్ ను టీవీలలో ప్రేక్షకులు ఎక్కువ సేపు చూసి అవకాశం ఉన్నది క్రికెట్ లోనే! దాంతో హాకీ క్రీడకు స్పాన్సర్లు దొరకలేదు. ఆటగాళ్లకు కూడా హాకీ లో ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది.
హాకీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే అధికారులతో పాటు, ప్రభుత్వము, ఆటగాళ్ళు ఒక ఉద్యమం చేయాల్సిందే. లేకపోతే భారత జాతీయ క్రీడ గా హాకీ కాకుండా, మరో ఆట ఆవిర్భవిస్తుంది.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)