శానిటైర్ కంటే సబ్బు నీటితో శుభ్రం చేసుకోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లోనే శానిటైజర్ వాడండి
ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇటు మన దేశంలోనూ కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
వైరస్ రాకుండా ఉండేందుకు ముఖానికి మాస్కు ఎంత ముఖ్యమో.. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచించారు.
అయితే తరచూ చేతులు కడుక్కోవడానికి సబ్బు మరియు నీరు అందుబాటులో ఉండదు.
అందుకే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది.
ఎక్కువగా హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం మంచిది కాదని.. తరచూ శానిటైజర్ వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు శుభ్రత పాటించడం మంచి అలవాటే అయినా మరీ మితిమీరి శానిటైజర్లను ఉపయోగించడం మాత్రం మంచిది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్కే వర్మ అన్నారు.
శానిటైజర్ బదులుగా ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో కడుక్కోవడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.
అతిగా శానిటైజర్ వాడితే శరీరంలోని మంచి బ్యాక్టీరియాకు దెబ్బ
శానిటైజర్ బ్యాక్టీరియాను చంపడంలో కీలకమైనదే. అయితే మన శరీరంలోని వివిధ రకాల సూక్ష్మజీవులు మనల్ని అనారోగ్యాల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతాయి. కానీ శానిటైజర్ అధికంగా వాడితే మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది.
అందుకే సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు మాత్రమే శానిటైజర్ ఉపయోగించాలని, ప్రతీసారి అవసరం లేదని నిపుణులు సూచించారు.
శానిటైజర్ అతిగా వినియోగిస్తే కలిగే ప్రమాదాలు ఏంటి?
* ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత శానిటైజర్ ఉపయోగించకూడదు. * శానిటైజర్ వాడకంతో ఉపయోగాలతో అనర్థాలు కూడా అధికమే * శానిటైజర్ కారణంగా అర చేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది * వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి * శానిటైజర్లలో 60 నుంచి 90శాతం ఆల్కహాల్ ఉంటుంది, అదే క్రిములను చంపుతుంది అధిక మోతాదులో శానిటైజర్ వినియోగం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది * శరీరానికి, చేతులకు సహస సిద్ధంగా ఉండే రోగనిరోధక శక్తి స్థాయి తగ్గిపోతుంది * అధికంగా వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం…
ప్రతిరోజూ హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తుంటే, మీ చేతులు చాలా పొడిగా మారడం గమనించవచ్చు. హ్యాండ్ శానిటైజర్లోని ఆల్కహాల్ చర్మాన్ని ఎండిపోయేలా చేస్తుంది.
* ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నపుడు కూడా సబ్బు, నీరు అందుబాటులో ఉంటాయి కాబట్టి క్రిముల బారిన పడకుండా కనీసం 20సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి
* చేతులు మట్టిలో ఉంచిన తర్వాత హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నంత మాత్రాన అది పనిచేయదు. హ్యాండ్ శానిటైజర్ ధూళిని తొలగించలేదు. చేతులు మట్టిలో ఉన్నప్పుడు సూక్ష్మక్రిముల వైరస్‌లను చంపడంలో తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.
అలాగే చేతులకు అంటిన రసాయనాలు, లేదా, ఇతర ప్లాస్టిక్ ధూళి కణాలు క్యాన్సర్ కారకాలు వాటిని చేతులు కడగకుండా శుభ్రం చేసుకోలేము.
* ఒకవేళ రసాయన పరిశ్రమలో పనిచేస్తే మాత్రం హ్యాండ్ శానిటైజర్ వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ద్రవ జెల్ మరియు రసాయనాల కలయిక శరీరానికి హానికరం.
జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, హ్యాండ్ శానిటైజర్‌ను పురుగుల మందులు జల్లే వ్యవసాయ కార్మికులు వాడకపోవడమే మంచిదని సూచించారు.
(డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19, ఆంధ్రప్రదేశ్)