” శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఒక కొత్త అబ్బాయి పాడాడు.మంచి గొంతు, అద్భుతంగా ఉంది,”. అని ఆ పాట విన్న ఒకాయన రెండో ఆయనతో ఉన్నాడు. చిత్రం చూసిన రెండో ఆయన,‘నిజమే’ ననుకున్నాడు. ఆ అబ్బాయి పేరు బాల సుబ్రమణ్యం. చిత్రాల్లో పాడడం అదే మొదటి సారి.
బాల సుబ్రహ్మణ్యం పాట విని, అతన్ని చూసినవాళ్లు అతనే ఆ పాట పాడాడంటే నమ్మరు.ఎంచేతంటే ఘనమైన కూత కూసిన పిట్ట ఇంత కొంచెంగా ఉండటం ఏమిటని అనుకుంటారు.
ఆ అబ్బాయి ఇంకా అబ్బాయే. 22 ఏళ్ల వాడు. ఏ ఐ ఎం ఈ చదువుతున్నాడు.
బాల సుబ్రహ్మణ్యం తండ్రి గారు హరికథలు చెబుతారు. ఆయన పేరు పండితారాధ్యుల సాంబమూర్తి. ఆ వాసన బాల సుబ్రహ్మణ్యంలో చిన్నప్పుడే ప్రవేశించింది. తండ్రి గారి పాటలు, సినిమా పాటలు పాడటం సాగించాడు. పాటలు పాడటంలో మంచి ఉత్సాహం చూపాడు. అయితే సంగీతం నేర్చుకోలేదు. చదువు కోవడంతోనే సరిపోయింది.
1963 లో మద్రాస్ లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నాటక పోటీలు సంగీతంలో పోటీలు జరిపారు. ఉత్సాహంగల బాలసుబ్రమణ్యం నెల్లూరు నుంచి వచ్చి ఆ పోటీలలో పాల్గొన్నాడు. మొదటి బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు పెండ్యాల, ఘంటసాల, సుసర్ల.
ప్రేక్షకుల్లో కూర్చుని బాల సుబ్రహ్మణ్యం పాట విన్న సంగీత దర్శకుడు కోదండపాణికి అతని గొంతు బాగా నచ్చింది. ‘నీ పాట పాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. నీ చేత నేను చిత్రాల్లో పాడిస్తాను. అయితే ఇప్పుడు నీ గొంతు మరీ లేతగా ఉంది’,అని చెప్పి అతన్ని అభినందించాడు. కోదండపాణి కి అతని గొంతు ఎంత బాగా నచ్చిందో బాలసుబ్రహ్మణ్యానికి అంత కంటే బాగా ఈ ప్రశంస నచ్చింది. తన గొంతు ఎప్పుడు కాస్త ‘ముదిరితే’ అపుడు వెళ్లి కోదండపాణిని కలవాలని అనుకున్నాడు. అక్కడి నుంచి తన గాత్రం మీద శ్రద్ధ తీసుకున్నాడు.
బాలసుబ్రమణ్యం సొంత ఊరు నెల్లూరే అయినా అతను మద్రాసులో ఎఐఎంఇ చదవడం వల్ల కోదండ పాణిగారిని అపుడపుడు చూడటానికి అవకాశం కలిగింది.
ఒక రోజు కోదండపాణి బాలసుబ్రమణ్యానికి కబురు చేసి పిలిపించి, పద్మనాభానికి ఒక పాట పాట వినిపించాడు పద్మనాభానికి అతని గొంతు బాగా నచ్చింది. కొత్త వారిని ప్రోత్సహించాలన్న గట్టి నమ్మకం గల పద్మనాభం వారం తర్వాత బాల సుబ్రహ్మణ్యాన్ని పిలిపించి ఒక పాట ఇచ్చాడు.
ఆ పాటే ‘మర్యాద రామన్న’లో అతను శోభన్ బాబుకు పాడిన ‘ఏమి ఈ వింత మోహం’ అన్న పాట.
బాలసుబ్రహ్మాణ్యానికి ప్రారంభంలోనే మరో మంచి అవకాశం కూడా కలిగింది- సుశీల,శ్రీనివాస్, రఘురామయ్య పరిచయం కలగడం, వారితోకలసి పాడటం. తర్వాత దర్భార్ లో పద్మనాభం ముసలి పాత్రలో చదివిన ‘విశ్వము కంటెను విపులమైనది ఏది?’ అన్న పద్యాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం పాడాడు.అతని పాటను మెచ్చకున్న వాళ్లు, పద్యాన్నీ మెచ్చుకున్నారు.
బాలసుబ్రహ్మణ్యం సంగీతం నేర్చుకోలేదు. ఇపుడు నేర్చుకుంటున్నాడు.హిందూస్తానీ, కర్నాటక సంగీతాలను శాస్త్రీయంగా నేర్చుకోవాలని కృషి చేస్తున్నాడు.
కొదండపాణి సంగీత దర్శకత్వంలోో నిర్మింపబడుతున్న‘మూగజీవులు’ చిత్రంలో కూడా బాలసుబ్రహ్మణ్యం పద్యం, శ్లోకాలు చదివాడు.
కోదండపాణియే ఆతన్ని మహదేవన్ కు పరిచయం చేశాడు.మహదేవన్ అతనికి ‘ప్రైవేటు మాస్టార్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.అందులో రామ్మోహన్ కు సోలో పాడాడు బాల సుబ్రహ్మణ్యం. అతినికి ఒక కన్నడ చిత్రంలో కూడా అవకాశంకలిగింది.
చదవుకుంటున్న రోజుల్లోనే బాల సుబ్రహ్మణ్యానికి పాటల పోటీలలో బహుమతులు వచ్చాయి.65-66లో ఆలిండియా రేడియో వారు జరిపిన తేలిక పాటల పోటీలలోకూడా అతను బహుమతి పొందాడు. చాలా సభలలో సమావేశాలలో అతను పాటలు పాడాడు.
సంగీతం ఒకరి దగ్గిర నేర్చొకొనకపోయినా రాగతాళాలజ్ఞానం,సంగీత జ్ఞానం పుష్కలంగా ఉండటం వల్ల బాలసుబ్రహ్మణ్యం ఏ మాత్రం ఇబ్బంది,కష్టం పడకుండా అవలీలగా ట్యూన్ పట్టగలిగి, పాడగలిగాడు. అతని చేత పాడించిన సంగీత దర్శకులిద్దరూ అతను తప్పకుండా పైకి రాగలడని ఆశాభావాన్నివ్యక్తంచేశారు.
‘నాకు మొదటి అవకాశం కలుగ జేసిన కోదండపాణి గారికి, పద్మనాభం గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవడం కంటే వేరే చెప్పుకోవడానికి ఏమీ లేదు,’ అన్నాడు బాలసుబ్రహ్మణ్యం.