తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?

(జింకా నాగరాజు)
నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1799) తర్వాత 1801 జూలై 31 తిరుమల తిరుపతి దేవస్థానం  ఈస్టిండియా కంపెనీ పూర్తి పాలనలోకి వచ్చింది.  ఇది తిరుమల,తిరుపతి ఆలయం పరిపాలన చరిత్రలో పెద్ద మలుపు.
 విజయనగరసామ్రాజ్యం పతనమయినప్పటినుంచి  1801 జూలై1 దాకా తిరుమల ఆలయం  ముస్లింపాలకులో చేతిలో ఉంది. కొంత కాలం గొల్కొండ నవాబుల పాలనలో ఉండి. ఔరంగజేబు దక్కను మీద దాడి జరిపి గోల్కొండ రాజ్యాన్ని పతనం చేసినపుడు ఇక్కడ రెండు ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి. నైజం, కర్నాటక రాజ్యాలు.
అపుడు తిరుపతి కర్నాటక నవాబుల కిందికి పోయింది. 1801లో ఈస్టిండియాలో కంపెనీ చేతికి వచ్చేటప్పటికి తిరుపతి అర్కాట్  నవాబు చేతిలో ఉండింది.  అర్కాట్ రాజ్యం ఉత్తర డివిజన్ లో ఉండింది. అర్కాట్ అనేది తమిళ మాట ఆర్ అంటే ఆరు, కాడు అంటే అడవులు. ఆరు అడవుల ప్రాంతమే అర్కాట్.
1801లో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ఉత్తర భాగాన్ని నార్త్ ఆర్కాట్ జిల్లాగా మార్చారు. దాని మొదటి కలెక్టర్ జార్జి స్ట్రాటన్ (George Stratton).ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల్లో ఇద్దరు తిరుమల వేంకటేశ్వరుని భక్తులని చెబుతారు. ఇందులో ఒకరు గర్నవర్  థామస్ మన్రో, రెండో వ్యక్తి కలెక్టర్ స్ట్రాటన్.  ఈ జిల్లాకు చిత్తూరు కేంద్ర స్థానం. తిరుపతి అపుడు నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉండింది.
Srivari Hundi/ thirupatinews.com
1799లో నాలుగో మైసూర్ బ్రిటిష్ వాళ్లకు, కర్నాటక నవాబులకు మధ్య యుద్ధం జరిగింది.  అపుడు బ్రిటిష్ వాళ్లు అర్కాట్ నవాబు మీద కప్పం కోసం బాగా వత్తిడి పెంచారు. దానికి తోడు నవాబు ఉమ్దుద్,  మైసూర్ గవర్నమెంట్ తో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా  కలసి కుట్ర చేస్తున్నాడని అనుమానం. దీనికిసాక్ష్యంగా కొన్ని ఉత్తరాలు బయటపడటంతో బ్రిటిష్ వారు బాగా  ఆగ్రహించారు.
 అర్కాటు నవాబు వయసు పైబడి మంచాన పడ్డాడు. పోరాడే శక్తి లేదు. సంధి చేసుకోవడమే మేలని భావించి  అంగీకరించాడు. ఆయితే, ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలోపు ఆయన చనిపోయాడు.
సింహాసనం వారసత్వం తీసుకున్న కుమారుడు అలీ హుసేన్  ఈ ఒప్పందలోని షరతులను తిరస్కరించాడు. దీనితో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి కోపం వచ్చింది. హుసేన్ ను తొలగించి నవాబు సోదరుడు అజిమ్ ఉల్ ఉమారాను నవాబుగా ప్రకటించారు. తమ చేతుల్లో పెట్టుకున్నారు.
ఆయన 1801లో బ్రిటిష్ వాళ్లిచ్చే స్టయిఫండ్ తీసుకుని రాజ్యాన్ని బ్రిటిష్ కు మొత్తంగా అప్పగించి చేతులు దులుపుకున్నాడు. అలా ఆర్కాటు సింహాసనం పూర్తిగా  తూర్పు ఇండియా కంపెనీ అదీనంలోకి వచ్చింది. దీనితో పాటు తిరుమల, తిరుపతి ప్రాంతం పూర్తిగా ఇంగ్లీష్ పాలనలోకి వచ్చింది.
Pilgrims at Brahmotsavalu/ thirupatinews com
1774-1750 మధ్య తిరుమల ఆలయం నుంచి అర్కాటు నవాబు తాను వసూలు చేసుకుంటున్న రెంటు రు. 2 లక్షలను  కప్పం కింద ఈస్టిండియా కంపెనీకి దక్కింది.
అంటే 1801లో పూర్తి అదుపులోకి రాకముందు నుంచే  ఆలయం నిధులు తూర్పు ఇండియా కంపెనీకి వెళ్లడం మొదలయింది. పరిపాలనను పేరుకు నవాబే చేసేవాడు. ఆలయం ఆదాయం మాత్రం కప్పం కింద ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి వెళ్లేది.  1801లో ఇది కూడా ముగిసింది.
అయినా సరే,   తిరుమల ఆలయ పరిపాలనలో వివరాల్లోకి వెళ్లేముందు ఒక మాట చెప్పాలి.
ముస్లిం పాలనలో ఉన్నపుడు ఆలయం అదనపు ఆదాయం నుంచి వాటా తీసుకోవడమే తప్ప ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే పనులను నవాబు లెవరూ చేయలేదు.
ఆలయ వ్యవహారాలలో నవాబులెపుడూ జోక్యం  చేసుకోలేదు. ఈ విషయాన్ని తిరుపతి ఆలయం మీద బాగా పరిశోధన చేసి అనేక విలువై పుస్తకాలు రాసిన వి.ఎన్ శ్రీనివాసరావు రాశారు.

తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…

శ్రీనివాసరావు గొప్ప పరిశోధకుడు, పండితుడు. ఆయన చిత్తూరు జిల్లా  తాహశీల్దారుగా ఉండేవారు. ఆయన పాండిత్యము, పరిశోధనా పటిమ గురించి మాటల్లో చెప్పలేం. రెవిన్యూ శాఖలో పని చేసే ఉద్యోగియే అయినా  యూనివర్శీటిలలో ప్రొఫెసర్లు మాత్రమే చేసేంత గొప్పపరిశోధన చేశారు.
నార్త్ ఆర్కాట్ జిల్లా మొదటి కలెక్టర్ జార్జి స్ట్రాటన్  మొదటి సారి తిరుమల గురించిన అధికారిక సమాచారాన్ని ప్రశ్నలు, జవాబులో రూపంలో సేకరించారు.
ఈ  పుస్తకం Sawal-E-Jawab పేరుతో ఆ రోజుల్లో వచ్చింది. తెలుగు లో  కూడా వచ్చిందని కూడా చెబుతారు.  తెలుగు పుస్తకాన్నే ఆయన ఇంగ్లీష్ లోకి అనువదించారని కొంతమంది చెబుతారు. తర్వాత Tirupati Sri Venkateswara Balaji (Origin, Significance &History of the shrine) అని మరొక పుస్తకం కూడా రాశారు. తిరుమల దేవాలయం గురించి వచ్చిన అధ్బుతమయిన పుస్తకాలివి.
ఇందులో Sawal-E-Jawab 1800 సంవత్సరంలో వచ్చిన తిరుమల గురించిన ఒక రికార్డు.  దీనిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తూ, “An Authoritative, unique and hitherto unpublished record of 1800 AD in the form of Questions and Answers” అని పేర్కొన్నారు.
ఈ పుస్తకానికి రాసిన పీఠికతో పాటు తన రెండో పుస్తకంలో కూడా ముస్లిం పాలకులను ఆయన ప్రశంసించారు. “The Nawabs allowed the institution to go on as usual  contenting themselves with the surplus income from the temple which they had farmed out to Hindu renters”.
ముస్లిం నవాబులు గాని,  ఈస్టిండియా కంపెనీగాని, హుండీ డబ్బులను కొల్లగొట్టలేదు. ఆలయ సేవలను హిందువులకు  ‘గుత్త’ (Rent) కు ఇచ్చేవాళ్లు. ఉదాహరణకు క్షౌరశాల ను ఒకరికి ఏడాది కొంతమొత్తం చొప్పున గుత్తకు ఇచ్చే వారు. క్షౌర శాల నిర్వాహకుడు భక్తులు గుండు గీయించుకున్నపుడు  వారిదగ్గరి నుంచి చార్జ్ వసూలు చేసే వాడు.
ఇలా తిరుమల సేవలను హిందువులకే గుత్తకు ఇచ్చి నవాబులు వారి నుంచి రెంటు తీసుకునే వారు. ఇదే నవాబుల ఆదాయం.
తర్వాత ఈస్టిండియా కంపెనీ ఆదాయం కూడా ఇదే. చిత్తూరు కలెక్టర్  మొదట చేసిన పని గుత్తేదార్లను నియమించేందుకు టెండర్లను ఆహ్వానించడం.  ఆయన తెలుగు వాళ్ల మనుసు దోచుకునేందుకు కారణం యాత్రికుల మీద అంతకు ముందు నుంచి విధిస్తూ వచ్చిన  యాత్ర పన్ను (pilgrim tax) రద్దుచేయడం.
ఈస్టిండియా కంపెనీ అధికారుల్లో ఉన్న ఈ డెడికేషన్ బ్రిటిష్ రాణి ప్రభుత్వాధికారుల్లో కనిపించదని కూడా  శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.
Sawal-E-Jawaba లో  పీఠిక ప్రకారం, ఏడాదికి దాదాపు రెండులక్షల రుపాయలు (24వేల పౌండ్ స్టెర్లింగులు) ప్రభుత్వానికి గిట్టేవి. ఇదే పద్ధతి ఈస్టిండియా కంపెనీ కూడా కొనసాగించింది.  వాళ్ల పరిపాలన ఆలయ విధుల్లోకి చొరబడ లేదని చాలా మంది పరిశోధకులు అంగీకరించారు.
కలెక్టర్ స్ట్రాటన్ తొలిసారి తిరుమల ఆలయం గురించి సమగ్రమయిన సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించగానే తన ఎలుబడిలోకి వచ్చిన  తిరుమల విస్తీర్ణం అనే రెవిన్యూ వ్యవహారం  గురించే కాకుండా,  చరిత్ర, సంప్రదాయాలు, ఆదాయం వనరుల గురించి సమగ్రమయిన పరిశోధన చేయించారు.
ఆప్పటికి గుడిని ఆలనా పాలనా చూస్తున్నవారందరి దగ్గరి నుంచి ప్రశ్నలు-జవాబు (questionnaire) ల రూపంలో సమాచారం సేకరించారు. అదే Sawal-E-Jawab.
తిరుమల ఆలయం పాలనను ఆధునికీకరించే తొలిప్రయత్నం చేసింది కూడా ఆయనే. తిరుపతి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలతో తిరుపతి  తాలూకా ఏర్పాటు చేశారు. ఒక తాహశీల్దార్ ను నియమించి, ఆలయసేవలను  గుత్తకిచ్చే పద్ధతి రద్దుచేయించి, తాహశీల్దార్ ను ఆయన కార్యనిర్వాహకుడిని చేశారు. ఆపుడు ఈ కార్యనిర్వహాకుడిని ఆమణి (Amani) అని పిలిచారు. ఇపుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు అదే మూలం.
చాలా కాలం ఆలయ పరిపాలనా వ్యవహారాలు, సంప్రదాయాలను, ఆలయానికి ఉన్నభూముల వ్యవహారాలను, రాబడి వ్యవహారాలను ఆలయం మీద పెత్తనం ఉన్న వాళ్లు రహస్యంగా ఉంచారు. ఎపుడో అవసరమయినపుడు కోర్టులకు చూపించడం  తప్ప వాటిని చాలా గోప్యంగా కాపాడుతూ వచ్చారు.  ఈ సమాచారాన్ని అచ్చేయించి ప్రజలందరికి అందుబాటులోకి తెచే ప్రయత్నం జరగలేదు. దేవుడికి ఏయే సేవలు, పూజలు, ఉత్సవాలు చేస్తుంటారో మొదటి సారి  Sawal E Jawab లో రికార్డు చేశారు. ఈ పుస్తకం ప్రకారం తిరుమల 149 సంవ్సరాల పాటు  ముస్లిం పాలనలో  ఉండింది.
నవాబుల పాలనలో తిరుమల
ముస్లిం నవాబులో పాలనలో ఉన్నా తిరుమల క్షేత్రం దోపిడికి ఎపుడూ గురికాలేదు. “…with the exception of  a few, Muhammadan rulers respected Hindu institutions  and preserved them from interference,”అని అనేక రాతపత్రాలలో ను పరిశీలించాక  విఎన్ శ్రీనివాస రావు  1949 లో తన వచ్చిన పుస్తకంలో రాశారు.
నిజానికి,  ఉత్తరాది ఔరంగాజేబు దాడితో  గోల్కొండ రాజ్యం పతనమయ్యాక మాత్రం ఈ ప్రాంతం ప్రశాంతత దెబ్బతినింది. దేవాలయాన్ని దోచుకోచుకునేందుకు కొంత మంది సూదూరపు రాజులు ప్రయత్నించారు.
 గోల్కొండ పతనం, కరువులు,  కాటకాలు ఈ ప్రాంతాన్ని కష్టాల్లో పడేశాయి.
అపుడు ఔరంగజేబు  తిరుమలని దోచుకోవడానికి వస్తున్నాడనే ప్రచారం మొదలయింది. ఔరంగజేబు సేనలు దాడి చేస్తే ఎలాంటి బీభత్సం సృష్టిస్తారో బాగా ప్రచారంలో ఉంది.  ఢిల్లీ సుల్తాన్ దాడి జరగుతుందేమో నని  ప్రజల్లు  భయంతో వణికిపోయారు.
ఈ భయ వాతావరణం  గురించి వేంకటాచల విహార శతక కర్త నిందాస్తుతిలో పద్యాలు రాస్తూ, ఇక మొద్దు నిద్ర చాలించి మమ్మల్ని కాపాడరావయ్య అని ఆగ్రహంగా పిలిచాడు.
ఈ పద్యాలను శ్రీనివాస రావు ఉదహరించారు. రామభక్తితో కష్టాల్లోపడిన రామదాసు తన కీర్తనల్లో “ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగేవు “అని శ్రీరామచంద్రుని ఆటపట్టించినట్లే. వెంకటాచల విహార శతక కర్త (1665) కూడా తిరుపతిలో ఉన్న గోవింద రాజస్వామితో అన్న వేంకటేశ్వరుడి గురించి ఎంత మాట అంటాడో చూడండి.
సీ. పొట్టేళ్ల గతిఁబట్టి బోడి సన్యాసుల, ఢీయని తాఁకులాడించనొకఁడు
సోమయాజుల సూత్రముల్ ద్రెంచి సిం, గాణివిండ్లకుఁ నల్లెఁగట్టునొకడు
ఖూబ్ ఘోడాయంచు గుడికీలుగుఱ్టము, నెక్కి థేయని తరటెత్తునొకడు
పైకాలు గొమ్మని  బల్మిఁగోమటివారి చెలువపైఁబడి బూతు సేయునొకఁడు
యవనసమర్ద దుర్తినంబైన దిగువ, తిరుపతినిఁజూడు మిటువంటి తఱిని నిదుర
పోవుచున్నాఁడు   మీయన్న లేవలేక, శత్రు సంహార వేంకటాచల విహార.”
ఇంతగా భయపెట్టినా,  ఔరంగజేబు దాడి జరగలేదు.
 అయితే,  స్థానిక  పాలకులు అప్రమత్తమయ్యారు. ఆలయ సేవలను, దర్శనాలను గుత్తకిచ్చారు.  అంతేకాదు,  తిరుపతి వచ్చే దారి పొడుగునా యాత్రికులకు రక్షణ ఏర్పాటు కల్పించి, వాటికి ఫీజు వసూలు చేశారు. ఈ బాధ్యతని కూడా గుత్త కిచ్చారు. యాత్ర దారిలో ఉండే పాలెగాళ్లు ఈ రక్షణ ఏర్పాట్ల చేసేవారు.
దానికి యాత్రికుల నుంచి పైసలు వసూలు చేసే వారు. ఇందులో కొంత మొత్తాన్ని  నవాబులకు  వార్షిక గుత్త (Rent)గా చెలించేవారు. ఇది స్థిరంగా వచ్చే ఆదాయం కావడంతో ఆలయపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఆదాయం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి, గొల్కొండ సుల్తానులు, వాళ్ల వారసులు, కర్నాటక నవాబులు ఆలయ పవిత్రత, ప్రతిష్ట దెబ్బతీసే సాహసం చేయలేదు. ఎపుడూ ఆలయ అనుకూల వైఖరియే ప్రదర్శించారు.  ఈ ప్రాంతంలో ఉన్న దారిదోపిడిగాళ్ల నుంచి కూడా వాళ్లు ఆలయానికి రక్షణ కల్పించారు. ఆనాటి సేవలకు గుర్తింపు తిరుమల శ్రీవారికి మన్రో తలిగే (Munroe Thaligai) అని సమర్పిస్తారు. మన్రో తో పాటు స్ట్రాటన్ కూడా శ్రీవారి భక్తులని పేరుంది.

 

(జింకా నాగరాజు, జర్నలిస్టు, హైదరాబాద్)

Like this story? Share it with a friend!

 

 

One thought on “తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?

Comments are closed.