విజయనగరం:సెప్టెంబర్ 21న మహాకవి, ‘కన్యాశుల్కం’ నాటక రచయిత గురజాడ అప్పారావు ( సెప్టెంబర్ 21, 1862-నవంబర్ 30, 1915) వారి జయంతి. ఈ సందర్భంగా విజయనగరంలోని మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి నివాసాన్ని సాంస్కతిక, పర్యాటక శాఖ విద్యుద్దీపాలతో అలంకరించింది.
2018లో ఈ ఇంటిని సుమారు 20 లక్షలు ఖర్చు చేసి మరమ్మతు చేశారు.
గురజాడ మహాకవి విశాఖపట్టణం జిల్లా యలమంచిలి సమీపంలోని రాయవరంలో జన్నించారు. అయితే,విజయనగరం రాజా వారి దగ్గిర కొలువులో చేరి విజయనగరానికి మకాం మార్చారు. 1891 లో ఈ ఇంటిని ఆయన రు. 2వేలు పెట్టి కొన్నారు. మరమ్మతులు చేసి, చివరిదాకా ఇందులోనే నివసించారు.
ఆయనవిజయనగరం కాలేజీలో బిఎ పాసయ్యారు. కాలేజీ రోజుల్లోనే ఆయన ఇంగ్లీష్ లో కవిత్వం రాసి పత్రికల్లో ప్రచురిస్తూ ఉండేవారు. పట్టభద్రులు కాకపూర్వమే 1884లొ విజయనగరం కాలేజీలో కొన్నాళ్లు ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని అపుడు వారికిచ్చే జీతంజ నెలకు పాతిక రూపాయలు మాత్రమే. ఈ స్వల్పజీతంతో అసంతృప్తి చెంది కాబోలు, తర్వాత కొన్నాళ్లు డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లార్కుగా చేరారు. అయిదు మాసాల్లోనే ఆ గుమాస్తా పనికి స్వస్తి చెప్పి, కాలేజీలో మళ్లీ లెక్చ రరుగా ప్రవేశించారు. జీతం కూడా వందరూపాయలకు పెరిగింది. ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలోనే (1896) ఆయన కన్యాశుల్కం రచించారు. కన్యాశుల్కం రెండవ కూర్పులో , ఆనాటక రచనకు తానెందువల్ల ఉపక్రమించవలసివచ్చిందో , అప్పారావుగారే స్వయం గా ఇలా చెప్పారు- “ సంఘ సంస్కరణోద్యమాన్ని బలపర్చడానికి, తెలుగు భాష నాటక రంగానికి అనుకూలమైనది కాదన్న అపోహ నెదుర్కోవడానికి, నేను కన్యాశుల్కాన్ని రాశాను.”
నూట ఇరవైసంవత్సరాల కిందట రాసినా కన్యాశుల్కం నాటకం పాత బడలేదు. నాటకంలోని గిరీశం పాత్రకు వందేళ్లు పైబడ్డా వృధ్యాప్యం రాలేదే. తెలుగు వాళ్లు ఎప్పటికీ మరచిపోలేని పాత్ర గిరీశం. కన్యాశుల్కం చాలా సీరియస్ సబ్జక్టు. సంఘసంస్కరణోధ్యం జోరుగా సాగుతున్న రోజలలో రాసిన నాటకం. అయితే, ఈ విషయాన్ని హస్యరసం మేళవించి తెలుగుదేశం మీదకు మిసైల్ లాగా వదిలారు.
కన్యాశుల్కాన్ని ఆయన వ్యావహారిక భాషలో రాశారు. నిజానికి ఆయన గ్రాంధీక భాషలో రాయాలని వత్తిడి తెస్తున్నారు. దానికి ఆయన అంగీకరించలేదు. “ నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికి వదులుకోలేను,” అని ఖచ్చితంగా సమాధానమిచ్చారు. అందుకే కన్యాశుల్కం తో పాటు ముత్యాల సరం వంటి రచనలన్నీ ఇంకా సజీవంగా ఉన్నాయి.