(CS Saleem Basha)
ఐపీఎల్ 2020 టోర్నమెంట్ చాలా పెద్దది. అంత పెద్ద టోర్నమెంట్లో వివాదాలు, తప్పులు, పొరపాట్లు కూడా సహజంగానే ఉంటాయి. ఒక వివాదంలో ఏకంగా రెండు జట్లను రెండేళ్ల పాటు నిషేధించాల్సి వచ్చింది. ఐపీఎల్ పదమూడవ సీజన్ ఈ రోజే UAE లో మొదలౌతుంది.
2013 సీజన్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అందరినీ నివ్వెర పోయేలా చేసింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్ ఉండడం అందరూ ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ రాయల్స్ జట్టు లో ఉన్న శ్రీశాంత్ , అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లను అరెస్టు చేయడం ద్వారా ఇది బయట పడింది. అంతేకాకుండా ముంబై పోలీసులు బాలీవుడ్ లో గత తరం నటుడు దారా సింగ్ కుమారుడు విందూ దారా సింగ్ ను అరెస్టు చేయడం జరిగింది. అతనితోపాటు మాజీ బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ని కూడా అరెస్ట్ చేశారు. బుకీల తో సంబంధం ఉందని, బెట్టింగ్ కు పాల్పడుతున్నాడని పోలీసులు అరెస్ట్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దరిమిలా 2015 లో సుప్రీంకోర్టు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను ఐపీఎల్ లో పాల్గొనకుండా రెండు సంవత్సరాల నిషేధం విధించింది. ఈ సంఘటనతో ఐపీఎల్ ప్రతిష్ట కొంతవరకు దెబ్బతింది. ఈ విషయంలో మహేందర్ సింగ్ ధోనీ కూడా విమర్శలకు గురి అయ్యాడు. “మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చంపడం కన్నా పెద్ద నేరం” అని ఈ సందర్భంగా ధోనీ చెప్పటం గమనార్హం! చివరికి మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2018లో ధోని నాయకత్వంలోనే పునరాగమనం చేసి టోర్నమెంట్ కూడా గెలుచుకోవడం, విశేషం!
https://trendingtelugunews.com/top-stories/sports-top-stories/cricket-lovers-festival-season-ipl-2020-commences-in-sharjah/
మొదటి సీజన్(2008) లోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్ బౌలర్ శ్రీశాంత్ చెంప పగలగొట్టి వివాదానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత రసాభస అయి, హర్భజన్ సింగ్ ను ఆ సీజన్ నుంచి తప్పించి తప్పును సరిదిద్దారు. తర్వాత కూడా హర్భజన్ సింగ్ బీసీసీఐ ద్వారా ఐదు వన్డే మ్యాచ్ ల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కూడా ఇరుక్కున్నాడు.
2010 లో ఐపీఎల్ మొట్టమొదటి చైర్మన్ మరియు కమిషనర్ లలిత్ మోడీ మీద కేసు రిజిస్టర్ అయింది. క్రమశిక్షణా రాహిత్యం, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు వంటివి లలిత్ మోడీ ని తొలగించడానికీ కారణమయ్యాయి. బీసీసీఐ జరిపిన విచారణలో అవి నిజమని తేలడంతో 2013లో లలిత్ మోడీ ని జీవితకాలం నిషేధించారు. లలిత్ మోడీ తర్వాత దేశం వదిలిపెట్టి లండన్ కు పారిపోయాడు.
2012 సీజన్ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని సినీ నటుడు షారుక్ ఖాన్ ను ఐదు సంవత్సరాల పాటు ముంబైలోని వాంఖడే మైదానంలోకి రాకుండా నిషేధం విధించింది. దీనికి కారణం అసోసియేషన్ అధికారులతో, భద్రతా సిబ్బందితో షారుక్ ఖాన్ దురుసుగా, అనాగరికంగా ప్రవర్తించడమే అని ప్రకటించింది. ” తన కూతురుతో భద్రతాసిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడం వల్ల, ఒక తండ్రిగా నేను అలా స్పందించాల్సి వచ్చింది” అని షారుక్ ఖాన్ సంజాయిషీ ఇచ్చాడు
2014 లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా తన బిజినెస్ పార్ట్నర్ నెస్ వాడియా మీద వేధింపుల కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. 2017 లో ముంబై పోలీసులు వాడియా మీద కేసు పెట్టారు. ప్రస్తుతం వాడియా బెయిల్ మీద ఉన్నాడు.
ఇంకా 2015 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన విరాట్ కోహ్లీ, వర్షం సందర్భంగా ఒక మ్యాచ్ ఆగి ఆగి పోయినప్పుడు స్టాండ్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ను కలవడం వివాదాస్పదమైంది. అది బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. అయితే అది చిన్న విషయం గా పరిగణించి బీసీసీఐ ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది.
2013 సీజన్లో చెన్నైలో జరిగిన మ్యాచ్ నుంచి శ్రీలంక జట్టు ఆటగాళ్లని ఆడించ లేదు. తమిళనాడు ప్రభుత్వం శ్రీలంకలో తమిళుల పట్ల వివక్ష కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు భయపడి శ్రీలంక ఆటగాళ్లు చెన్నై లో ఉండడం క్షేమకరం కాదని భావించడం వల్ల అలా జరిగింది.
ఇంకా తనను “బ్రెయిన్ లెస్”అన్నాడని, ముంబై జట్టు ఆటగాడు పొలార్డ్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై విరుచుకుపడడం, తమతో అసభ్యంగా ప్రవర్తించారని చీర్ లీడర్ ” గాబ్రియెల్లా” చెప్పటం, కోల్కత్తా నైట్ రైడర్స్ నుంచి షారుక్ ఖాన్ గంగూలీని తీసేయడం, వంటి వివాదాలు కూడా ఉన్నాయి.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)