‘రాయలసీమ నికర జలాల ప్రాజెక్టులకూ సక్రమంగా నీరందించడం లేదు‘

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  లేఖ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకంటే ముందే నిర్మాణం జరిగి కృష్ణా నది ఉపనదైన తుంగభద్ర ద్వారా నికరజలాలు పొందుతున్న ప్రాజక్టులు కర్నూలు కడప కాలువ (KC Canal), తుంగభద్ర ఎగువ కాలువ (HLC), తుంగభద్ర దిగువ కాలువ (LLC), సంజీవయ్య సాగర్/గాజుల దిన్నె ప్రాజక్టు (GDP), తుంగభద్ర నది ఉపనదైన వేదవతి ద్వారా నికరజలాలు పొందుతున్న ప్రాజక్టు బైరవాని తిప్ప ప్రాజక్టు (BTP) అన్న విషయం మీకు విదితమే.
తుంగభద్ర ప్రాజక్టు నిర్మాణం పూర్తవడంతో 1953 వ సంవత్సరం జులై నెలలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ ప్రాజక్టులకు నీటిని విడుదలచేసిన విషయం కూడా మీకు విదితమే.
ఈ ప్రాజక్టుల నిర్మాణం 1953 కే జరిగినప్పటికి పంట కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడం వలన ఈ ప్రాజక్టులకు కేటాయించిన నీటిని తుంగభద్ర డాం నుండి వినియోగించుకొనలేక పోయిన పరిస్థితులు తలెత్తాయి. ఈ విదంగా వినియోగించుకొనలేని నీటిని కృష్ణా డెల్టాలో రెండవ (రబీ) పంటకు వినియోగించుకనే వెసలుబాటు కల్పించమని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (KWDT – 1, బచావత్ ట్రిబ్యునల్) ను కోరింది. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలంచిన అనంతరం తుంగభద్ర ప్రాజక్టు నిర్మాణానికి ముందు కృష్ణా డెల్టాలో 37498 ఎకరాలలో రెండవ (రబీ) పంటకు నీరు వినియోగించినట్లుగా బచావత్ ట్రిబ్యునల్ గుర్తించింది. ఈ మేరకు చట్ట బద్ద హక్కులు కలుగచేస్తూ, పైన వివరించిన రాయలసీమ ప్రాజెక్టులు వినియోగించని నీటిని కృష్ణా డెల్టా రెండవ (రబీ) పంటకు అధనంగా వాడుకొనడానికి తాత్కాలిక అనుమతులనిచ్చింది.
బొజ్జా దశరథరామిరెడ్డి
ఈ విధంగా పొందిన తాత్కాలిక అనుమతులతో కృష్ణా డెల్టా రెండవ (రబీ) పంటకు 5 నుండి 6 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు నీరు పొందడంతో పాటు మరో 2 లక్షల ఎకరాల చేపల చెరువులకు నీళ్ళు పొందుతున్నది.
అదే సందర్భంలో కృష్ణా ఉపనదులైన తుంగభద్ర మరియు వేదవతి నదులనుండి నికర జలాల అనుమతులలో 50 శాతం నీటిని కూడా పైన వివరించిన రాయలసీమ ప్రాజక్టులు వినియోగించుకొనలేని పరిస్థితులు గత ఏడు దశబ్దాలుగా కొనసాగుతునే ఉన్నాయి. తుంగభద్ర డాంకు రావలసిన నీటికి రెండంతల నీరు చేరిన గత సంవత్సరంలో కూడా పై ప్రాజెక్టులకు కేటాయించిన నీటిలో 60 శాతం కూడా అందించలేని పరిస్థితి ఉంది. తుంగభద్ర జలాలు శ్రీశైలం చేరి, కృష్ణా డెల్టా రెండవ పంటకు అధనపు ఆయకట్టుకు నీరందిస్తూ, చేపల చెరువులను సంరక్షిస్తూ ఇంకా వందలాది శత కోటి గణపుటడుగుల నీరు సముద్రం పాలౌతున్నాయి.
గత ఏడు దశాబ్దాలుగా కృష్ణా డెల్టా పరిరక్షణే ద్యేయంగా ప్రభుత్వాలు పని చేసాయి, చేస్తున్నాయి. అందుకు ఉదాహరణలు దిగువన విరించిన ప్రాజెక్టుల నిర్మాణాలే. వాటిలో కీలకమైనవి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజక్టు, పులిచింతల రిజర్వాయర్, పట్టు సీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజక్టు, ప్రకాశం బ్యారేజ్ దిగువన కొత్తగా అనుమతులిచ్చిన రెండు బ్యారేజ్లు. ఈ ప్రాజక్టులన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నిదులతో నిర్మించినవే/నిర్మిస్తున్నవే.
కృష్ణా డెల్టా సంరక్షణపై పాలకులున్న చిత్తశుద్ధి తుంగభద్రపై ఆదారపడినపై రాయలసీమ ప్రాజక్టుల పట్ల పాలకులు గత 7 దశాబ్దాలుగా కనపరచలేదు. పాలకులు ఎప్పటికప్పుడు హామీలతో, చిత్తసుద్దిలేని పథకాలతో రాయలసీమ వాసులను మభ్య పరిచడంతోనే నికరజలాలను కూడా రాయలసీమ ప్రాజక్టులు పొందలేక పోతున్నాయి.
ఈ నేపథ్యంలో గత ఏడు దశాబ్దాలుగా నీటి హక్కులున్న రాయలసీమ ప్రాజక్టులకు సక్రమంగా నీరందించడానికి కార్యాచరణ చేపడాతామన్న భరోసా మీరు కల్పించడంతో రాయలసీమ వాసులు 2019 సార్వత్రిక ఎన్నికలో మీకు బ్రహ్మరథం పట్టారు. కాని మీరు అధికారంలోనికి వచ్చినప్పటి నుండి కూడా ఈ ప్రాజక్టుల పట్ల ప్రకటనలకు ఇచ్చిన ప్రాధాన్యత కార్యాచరణలో లేదన్న నిస్ప్హకు రాయలసీమ ప్రజలు లోనౌతున్నారు.
నికర జలాల హక్కులున్న ఈ ప్రాజక్టులకు, నదిలో కావలసినంత నీరు ప్రవహిస్తున్నా వినుయోగించుకొనలేని పరిస్థితులున్నాయి. కృష్ణా నది జలాలు ప్రాజక్టుల గేట్లు ఎక్కి పారుతూ, సముద్రం వైపు పరిగెడుతున్నా, నికర జలాలున్న రాయలసీమ ప్రాజక్టుల కింద ఏ రోజు వరకు నీరు అందిస్తారో, ఏ పంటలు వేసుకోవాలో చెప్పలేని పరిస్థితిలో సాగునీటి శాఖ ఉంది. సాగునీటి సలహ మండలి సమావేశం నిర్వహించి రాయలసీమ రైతులకు సాగునీటిపై భరోసా కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.
గత ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాజక్టుల కింద ఆయకట్టు కింద రైతులకు జరిగిన నష్టాన్ని, కర్నూలు పట్టణంతో పాటు అనేక గ్రామాల ప్రజలు తాగునీటికై పడిన ఇబ్బందులను తొలగించడానికి, మీరు హామి ఇచ్చిన రిజర్వాయర్ల, ప్రాజక్టుల నిర్మాణాలను తక్షణమే అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

 

(బొజ్జా దశరథ రామి రెడ్డి. అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి)