వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు విషాదం ఎదురయింది. తిరుపతి వైసిపి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా కారణంగానే ఆయన అనారోగ్యం పాలయ్యారని చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంట సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. చిన్నవయసులో అంటే 28 సంవత్సరాలకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. గతంలో నాలుగు సార్లు ( 1985-1989, 1994-1999, 1999-2004 & 2009-2014 )గూడూరు ఎమ్మెల్యే గా ఆయన గెలిచారు. 1996-98లో మంత్రిగా పనిచేశారు. గత పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన టిడిపి వదిలేసి వైసిపిలో చేరి తిరుపతి లోక్ సభ సీటుకు పోటీ చేశారు.గెలిచారు.
గోరంట్ల దిగ్భ్రాంతి
తిరుపతి వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఆయనతో తక్కువ పరిచయం ఉన్నా పార్లమెంటు సమావేశాల్లో ఆప్యాయంగా పలకరిస్తూ అనేక సూచనలు ఇచ్చి వారిని ఆయన కొనియాడారు . ఆయన మృతి వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు దళిత బడుగు బలహీనవర్గాల కు తీరనిలోటని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు