(Ahmed Sheriff)
బాలీవుడ్ దృష్టి ఇప్పుడు తెలుగు సినిమాల రీమేక్ పైన ఎక్కువగా వున్న నేపధ్యం లో నిర్మాతలు గమనించ వలిసిన విషయాలేమిటీ?
సాధారణంగా ఆపుడప్పుడూ ఒక భాష లోని సినిమాలు మరో భాషలో రీమేక్ చేయడం పరిపాటి. దీని వెనుక ముఖ్యంగా వ్యాపార పరమైన కారణం వుంటుంది. ఒక భాషలో బాక్సా ఫీసు వద్ద విజయ వంతమైన సినిమాను ఇతర భాషల్లో తీయడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులకు చూపించే అవకాశం వుంటుంది. తద్వారా చిత్రం మీద ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం బాలీవుడ్ నుంచి తెలుగు లో కి వచ్చే చిత్రాల కన్నా తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్లే చిత్రాల సంఖ్యే అధికంగా వుంది. దీనికి కారణం తెలుగు లో వచ్చే కథల్లోని వైవిధ్యం దర్శకత్వం లోని నూతనత్వమేనని, చెప్పవచ్చు.
అయితే తెలుగు లో బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన సినిమాలన్నీ హిందీ లో కూడా విజయం సాధిస్తాయని చెప్పలేం. చిత్ర విజయానికి నటీ నటులు కాకుండా, విజయాన్ని అందించే అంశాలు ముఖ్యంగా కథ, దర్శకత్వం, మాటలు, సంగీతం. వీటితో పాటు సినిమా అనుసరణ (adaptation) అనొచ్చు. రీమేక్ సినిమాలకు కథ, ఎలాగూ అదే. అయితే స్క్రీన్ ప్లే మారినా కష్టమే. ఇది కూడా దాదాపు మాతృక స్క్రీన్ ప్లే నే తీసుకుంటారు కాబట్టి సమస్య లేదు. ఇక పోతే మామూలు సినిమాల్లో హిందీ, తెలుగు డైలాగుల మధ్య పెద్ద తేడా రాక పోవచ్చు కానీ, తెలుగు లో డైలాగుల బలం మీద నడిచిన “అతడు” సినిమా లాంటి సినిమా రీమేక్ చేస్తే కష్టాలు రావచ్చు. ఇదే జరిగింది “ఏక్ – ది పవర్ ఆఫ్ ఒన్” లో .
ఏక్ దూజే కె లియె సినిమాలో దర్శకుడు ఒకడే వుండటం వల్ల సినిమా అనుసరణ విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకోగలిగాడు. ఇక పాటలు సంగీతమూ వచ్చేటప్పటికి, మరో చరిత్ర పాటలతో పోలిస్తె లక్ష్మి కాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చిన ఏక్ దూజే కె లియే పాటలు కూడా నువ్వా నేనా అనేలాగునే వున్నాయి. అందుకే ఆ చిత్రం విజయ వంతమైంది. అలాగే 1964 లో వచ్చిన తెలుగు సినిమా “మూగ మనసులు”, హిందీ లో “మిలన్” గా 1967 లో రీమేక్ అయింది. రెండు చిత్రాలకూ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావే. అమితంగా ప్రశస్తి పొందిన మూగమనసులు పాటలకు ఏమాత్రం తీసి ఫోకుండా మిలన్ సినిమా పాటలుండటం తో ఆ చిత్రం కూడా విజయవంతమైంది.
ఏ కారణాల వల్ల తెలుగు లో ఒక చిత్రం విజయ వంత మైందో, ఒక వేళ ఆ కారణాలు సడలితే, హిందీ లో నిర్మించ బడ్డ తెలుగు చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందే అవకాశాలూ వున్నాయి. తెలుగు నుంచి హిందీ లో కి వెళ్లిన కొన్ని చిత్రాల బాక్సాఫీసు చరిత్రలు చూద్దాం.
మరో చరిత్ర Vs ఏక్ దూజే కే లియే
కె. బాల చందర్ దర్శకత్వంలో 1978 లో కమల్ హసన్, సరిత జంటగా “మరో చరిత్ర” సినిమా వచ్చింది. ఇదొక రొమాంటిక్, ట్రాజెడీ చిత్రం. భిన్న సంస్కృతులకు చెందిన రెండు కుటుంబాల లోని తమిళ అబ్బాయి, తెలుగు అమ్మాయి ల మధ్య జరిగే ప్రెమ కథ, దాని పర్యవసానం గా వచ్చిన సినిమా. తెలుగులో అప్పుడది నిజంగానే మరో చరిత్ర అయింది. ఈ తెలుగు చిత్రాన్ని,అప్పట్లో తమిళం లో కానీ, కన్నడ భాషలో కానీ రీమేక్ చేయలేదు. అయితే కర్నాటకా, తమిళనాడు రాష్ట్రాల్లో దీన్ని డబ్బింగు కూడా చేయకుండా, తెలుగు భాషలోనే విడుదల చేశారు.
ఈ సినిమా 1981 లో కమల్ హసన్ హీరో గా, రతి అగ్నిహోత్రి హీరోయిన్ గా ”ఏక్ దూజే కే లియే” పేరు తో హిందీ లో వచ్చింది. దీనికి కె. బాలచందరే దర్శకత్వం వహించాడు. ఎల్ వి ప్రసాద్ నిర్మాత. సినిమాని హిందీ ప్రెక్షకుల కు తగ్గట్లు ఒక తమిళ అబ్బాయి (కమల్ హసన్) ఒక ఉత్తర భారత దేశపు అమ్మాయి (రతి అగ్నిహోత్రీ) మధ్య ప్రేమ కథ గా మార్చారు. దీనికి సంగీతం లక్ష్మి కాంత్ ప్యారేలాల్ ఇవ్వగా, దీనిలో పాటలు ఆనంద్ బక్షి రాశాడు . ఇది బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టరు గా ఋజువు చేసుకుంది. కథలో ఎక్కువ మార్పులు లేకూండా హిందీ ప్రేక్షకులకు తగినట్లు పాటలూ పరిసరాలు ఉన్నందున ఇది బాగా విజయ వంతమైంది.
ఒక్కడు Vs తేవర్
మహేష్ బాబు కు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా అంటే 2003 లో గుణశేఖర్ దర్శకత్వం లో మహేష్ బాబు ,భూమిక జంటగా వచ్చిన “ఒక్కడు” అనే చెప్పాలి. ఈ సినిమా అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వం లో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్ హా జంటగా 2014 లో “తేవర్” పేరు తో రీమేక్ అయింది. “ఒక్కడు” రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యం లో తెలుగు వారికి నచ్చే ప్రాంతీయత తో వచ్చింది. ఈ విషయం లో “తేవర్”, “ఒక్కడు” సినిమా కథను సరిగ్గా అడాప్ట్ చేయలేక పోయింది. ఫలితంగా ఒక ఫ్లాప్ చిత్రంగా నమోదయింది.
అతడు Vs ఏక్ – ది పవర్ ఆఫ్ ఒన్
త్రివిక్రం శ్రీనివాస్ రచనా దర్శకత్వం లో 2005 లో మహేష్ బాబు, త్రిష జంటగా “అతడు” సినిమా వచ్చింది. దీన్ని మహేష్ బాబు సినిమా చరిత్రలో ఒక “పై మలుపుగా” చెప్పవచ్చు. “ఒక్కడు” సినిమా తరువాత మహేష్ బాబు కి పేరు తెచ్చిన సినిమాలు లేవు. ఈ సినిమా మహేష్ బాబు సినిమా ప్రయాణం లో గొప్ప మైలు రాయి . ఈ సినిమా “ఏక్ – ది పవర్ ఆఫ్ ఒన్” గా సంగీత్ సివన్ దర్శకత్వం లో బాబీ డియోల్, శ్రియా శరణ్ జంటగా 2009 లో రిమేక్ అయింది. అతడు సినిమాకి బలమంతా డైలాగులూ, ప్రాంతీయత కాగా, వీటి ఎఫెక్టు హిందీలో తీసుకు రాలేక పోయారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందటమే కాకుండా, అతడు సినిమా సృష్టించిన చార్మ్ సృష్టించలేక పోయింది. దీనికి కారణం డైలాగులూ దర్శకత్వం అనుకున్నారంతా.
పోకిరీ Vs వాంటెడ్
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో 2006 లో పోకిరీ సినిమా వచ్చింది. దీన్లో మహేష్ బాబూ, ఇలియానా జంటగా నటించారు. గ్యాంగ్ స్టర్ సినిమాగా ఇది బాగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా, 2009 లో సల్మాన్ ఖాన్ హీరోగా ఆయేషా తకియా హీరోయిన్ గా వాంటేడ్ సినిమా గా వచ్చింది. మహేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వూ లో తన సినిమా రీమేక్ కి వ్యక్తిత్వం, ఆటిట్యూడ్ దృష్ట్యా సల్మాన్ ఖానే సరిగ్గా సరిపోయే నటుడని చెప్పాడు. ఈ చిత్రం విజయ వంతమైంది. దీనికి మరో కారణం ప్రభుదేవా కావచ్చు. ప్రభుదేవా మూలాలూ దక్షిణ భారత దేశం లో వుండటం ఒక ప్లస్ పాయింటు. ప్రభుదేవా బాలీవుడ్, టాలీవుడ్ రెండూ సినీ పరిశ్రమలతో పరిచితుడవటం వల్ల సినిమా అనుసరణ సులభ మయింది. హిందీ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
విక్రమార్కుడు Vs రౌడీ రాథోడ్
రవితేజా, అనుష్కా జంటగా 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 2012 లో రౌడీ రాథోడ్ గా రీమేక్ చేశారు. ఇది కూడా ప్రభుదేవా దర్శకత్వం లో వచ్చింది. అందు కే అనుసరణ సులభమైంది. రవితేజా స్థానం లో అక్షయ్ కుమార్, అనుష్కా స్థానం లో సోనాక్షి సిన్ హా నటించారు. పాత్రలకు న్యాయం చేకూర్చే నటులతో సినిమా సూపర్ హిట్ అయింది. రౌడీ రాథోడ్ బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్బు లో చేరిందని ఘనంగా చెప్పుకున్నారు.
కిక్ Vs కిక్
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రవి తేజా, ఇలియానా లు, జంటగా 2009 లో కిక్ సినిమా వచ్చింది. ఇది ఒక సార్వజనిక రాబిన్ హుడ్ తరహా కథ. అయితే దీన్లో కొన్ని అందరికీ అర్థ మయ్యే “మెమరీ లాస్” లాంటి కొత్త తరహా కామేడీ అంశాలున్నాయి. పకడ్బందీ స్క్రీన్ ప్లే మీద నడిచింది. దీన్ని సల్మాన్ ఖాన్ హీరో గా, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా అదే పేరు తో 2014 లో రీమేక్ చేశారు. దీనికి సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయవంతమైంది.
కందిరీగ Vs మై తెరా హీరో
రాం, హన్సికా మోత్వాని, అక్షా పర్ద సాని కలయిక లో 2011 వ సంవత్సరం లో ఆక్షన్, రొమాంటిక్ సినిమా గా కందిరీగ సినిమా వచ్చింది. దీనికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తెలుగులో బాగా విజయ వంతమైంది. ఈ సినిమా వరుణ్ ధావన్, ఇలియానా, నర్గిస్ ఫాఖ్రి కలయికలో “మై తెరా హీరో” గా 2014 హిందీ లో నిర్మించారు. దీనికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించాడు. ఇది అంతగా రాణించలేదు.
రెడీ Vs రెడీ
ఒక ఆక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా గా 2008 లో రెడీ సినిమా వచ్చింది. దీన్లో రాం, జెనీలియా జంటగా నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఇదే సినిమాని సల్మాన్ ఖాన్, అసిన్ జంటగా ఇదే పేరుతో 2011 లో హిందీ లో నిర్మించారు. ఇది సూపర్ హిట్ గా నమోదయింది.
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610