ప్రపంచ వ్యాప్తంగా ఉన్న #CoronaVaccine పందెంలో ‘ఎవరు శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారు, ఏది సరైన వ్యాక్సిన్? హడావుడిగా వచ్చే ఈ వ్యాక్సిన్ ల వల్ల ఏ ప్రమాదము రాదు కదా?” అనే భయాందోళనలు ఒక పక్క, ఈ వ్యాక్సిన్ లు అసలు పనిచేస్తాయా అనే సందేహం మరో పక్క ప్రజలను పీడిస్తోంది.
( డా. ఎస్ జతిన్ కుమార్ )
తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య కరోనా. అది కలిగించిన జీవన విధ్వంసం, సామాజిక, ఆర్ధిక కుంగుబాటు అపరిమితం. ఇది రాస్తున్న వేళకు (15-9-20) ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 96 వేల మంది వ్యాధి బారిన పడ్డారు. తొమ్మిది లక్షల మంది కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా 67 లక్షల వ్యాధిగ్రస్తులతో మొదటి స్థానంలో ఉంటే, శరవేగంగా పెరుగుతున్నకేసులతో, 50 లక్షలతో ఇండియా రెండవ స్థానంలో ఉంది.
ఒక్క ఆగస్ట్ నెలలోనే 20 లక్షల పోజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇండియా లో నమోదు అయిన ప్రతి కేసుకు 80 నుండి 120 నమోదు కాని కేసులు ఉన్నాయని ఒక అధ్యయనం IJMR అనే వైద్య పత్రిక ప్రకటించింది.
అమెరికాలో 2 లక్షలు, ఇండియాలో 80 వేల మరణాలు నమోదు అయ్యాయి. 200 దేశాలు ఈ వ్యాధి బారిన పడి ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాధి వ్యాపిస్తున్నా2-3% లో మాత్రమే మరణాలు సంభవించటం కాస్త ఊరటనిచ్చేఅంశమే.అనేక రకాల చికిత్సా విధానాలు, ఔషధాలు ఉపయోగిస్తున్నా, ఈ వైరస్ కి కచ్చితమైన ప్రత్యేకమైన మందు అంటూ ఏదీ లేదు. దాంతో వ్యాధిని నిరోధించే టీకాలు (వ్యాక్సిన్లు) అందుబాటులోకి వస్తే తప్ప ఈ రోగం కుదరదు అనే అభిప్రాయం బలపడుతోంది.
అందువల్ల ప్రపంచ దేశాలన్నీ వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలతో చికిత్స చేయటం అనేది వదిలివేసి, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చూపిస్తూ- అదిగో, ఇదిగో వ్యాక్సిన్ అని దేశ దేశాల నేతలు, ముఖ్యంగా అగ్రదేశాల అధినేతలు ఊక దంచుతున్నారు. ప్రజలను భ్రమ పెడుతున్నారు. ఫార్మా కంపెనీల మీద, శాస్త్రజ్ఞుల మీద, పరిశోధకుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు.
ఇక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరుగు పందెంలో తలమునకలై పోయి ఉన్నాయి. ప్రతి కంపెనీ, పక్క కంపెనీ తనకన్నా, ముందుగా వాక్సిన్ తెస్తదేమో, అని ఆరాటపడుతూ అవినీతి పద్ధతులకు, అశాస్త్రీయ విధానాలకు దిగజారుతున్నాయి. తమ జ్ఞానం చౌర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, తాము చాలా శాస్త్రబద్ధంగా ఉన్నట్టు, మిగతా వారి పరిశోధనలు తప్పుడు మార్గాల ద్వారా సాగుతున్నాయని విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలకు ఆ వరిశోధనల మీదనే విశ్వాసం సన్నగిలేలా చేస్తున్నారు. ఈ విపత్కర స్థితిలో ఒక సమిష్టి కృషి తో శాస్త్రీయ పరిశోధనలు సాగించి, సమన్వయంతో పరిష్కార జ్ఞానాన్ని పంచుకునే బదులుగా, మా ఇంటి కోడి మాదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
శాస్త్రీయ ప్రమాణాలు లేని వాక్సిన్ మొత్తం మానవాళి పై దుష్ప్రభావం చూపుతుంది:
ఇప్పటివరకూ వచ్చిన వ్యాక్సిన్ల చరిత్ర చూస్తే పరిశోధనలకు, పరీక్షలకు, అది మార్కెట్ కు వచ్చి ప్రజలకు అందేసరికి 10- 15 సంవత్సరాల కాలం పడుతుంది. ఇంత వరకు అతి త్వరగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ మంప్స్ వాక్సిన్& ఎబోలా వాక్సిన్. వాటికి ఐదేసి సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం 125 రకాల కరోనా వాక్సిన్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. ఏ వాక్సిన్ అయినా పరిశోధనలు ఒక దశ కు వచ్చాక ప్రయోగశాల లోను, జంతువుల మీద, చివరికి కొద్దిమంది మనుషుల మీద, ఆతర్వాత వేల మంది జనం మీద ప్రయోగించి, పరీక్షించి సఫలం అయితే మార్కెట్లో సర్వజనుల ఉపయోగం కోసం విడుదల చేస్తారు. ఇది దీర్ఘ కాలిక ప్రక్రియ. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియను బాగా కుదించి, అతి శీఘ్రంగా వాక్సిన్ విడుదలకు మార్గాలు వెతుకుతున్నామని చెబుతున్నారు. ఇలా త్వరపడటాన్ని కొందరు శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
2020 జనవరిలో, కరోనా వైరస్ జీవపదార్థ నిర్మాణ రీతిని (జినోమ్ ను) చైనా ప్రకటించిన వెంటనే, దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు కూడా ప్రపంచమంతా మొదలయ్యాయి అని చెప్పవచ్చు. చైనా, వైరస్ ను గురించి తమకు సరైన సమాచారం ఇవ్వలేదు అని ఆడిపోసుకున్న పాశ్చాత్య పెట్టుబడిదారీ ప్రపంచం, దాన్ని అరికట్టడంలో చైనా విజయం సాధించడంతో పాటు, తాము విఫలం కావడంతో, చైనా ముందే వాక్సిన్ తయారుచేసుకుని, తన ప్రజలను రక్షించుకుందని, మిగతా ప్రపంచం మీదికి మాత్రం వైరస్ ను తోలిందని అభాండం వేశారు. వ్యాధి బాగా వ్యాపించాక తన వ్యాక్సిన్ను అమ్ముకుని లాభాలు పొందాలని చైనా పెద్ద కుట్ర చేసింది అని దుష్ప్రచారం చేశారు. నిజానికి ఈ నాటికీ చైనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి రాలేదు.
తమ వ్యాక్సిన్ నేడో,రేపో రాబోతోందని అనేక దేశాలు ప్రకటిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే 2020 నవంబర్ కల్లా (అంటే తన అధ్యక్ష ఎన్నికలకు ముందే) అందుబాటులోకి తేవాలని, ఫార్మా కంపెనీల మీద పరిశోధనలు త్వరగా ముగించమని తెగ ఒత్తిడి చేస్తున్నాడు. అమెరికాలోని, ఎఫ్ డి ఏ సంస్థ, ఫార్మా కంపెనీలు ప్రజలమీద పరీక్షలు చేయటానికి కథినమైన నిబంధనలు విధించినదని, ఆ నియమాలు వాక్సిన్ విడుదల కాకుండా అడ్డుపడుతున్నాయని తన దేశ వ్యాధి నియంత్రణ సంస్థల పైనే ఆయన రుసరుసలాడుతున్నాడు. తన చేతిలో ఉన్నంత వరకు, నిబంధనలను మార్చి వేస్తున్నాడు. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (Operation Warp Speed:OWS) పేర నిధులు వెదజల్లుతున్నాడు. “నీ రాజకీయ లాభం కోసం మనుషుల పై పరీక్షలు పూర్తికాకముందే వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెడతావా” అని అతని వ్యతిరేకులు, డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. అమెరికా అధ్యక్షుని సలహాదారు ఆంథోనీ ఫాసీ కూడా తన అధ్యక్షుని వైఖరి మింగుడు పడక “ఉరుకులు పరుగులు కూడదని “, “ సమగ్రంగా పరీక్షించి నిరూపించబడిన పిదప మాత్రమే వాక్సిన్ ఉపయోగించాలని” ప్రకటించాడు.
రష్యా రెండవ దశ ముగియగానే వాక్సిన్ విజయ వంతమని ప్రకటించింది. ఇక మన దేశంలో ఆగస్ట్ 15 న నరేంద్ర మోడీ చేతుల మీదుగా వ్యాక్సిన్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఉబలాట పడ్డది. ఈమేరకు ICMR ఫార్మా కంపెనీలకు ఉత్తరాలు రాసింది. “ మొదటి వ్యాక్సిన్ రెండు మూడు నెలల్లోనే, తెలంగాణా నుంచే రాబోతోందని “లాక్డౌన్ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించాడు.
శాస్త్రీయ పద్ధతులను అత్యవసర అనుమతుల పేర ఇష్టం వచ్చినట్లు మార్చి వేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ పరిశోధనలను అనుచితంగా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో కంపెనీలు అడ్డదారులు తొక్కుతూ, తప్పుడు మార్గాలకు తెర తీస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర దేశాల మీద, ఇతర కంపెనీల ఫలితాల మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారు. నిందలు వేస్తున్నారు. తమ వాక్సిన్ భద్రత,సురక్షత గురించి మాత్రం అత్యంత గోప్యంగా ఉంటున్నారు.
అసలు వాక్సిన్ సంగతి అలా ఉంచి,ఆమందును నిలువ చేసే శీతల గిడ్డంగులు, రవాణా చేసేప్పుడు శీతల చైన్లు, క్షేత్ర స్థాయిలో రెఫ్రిజిరేటర్లు, థర్మోకల్ బాక్సులు సమకూర్చటం కూడా అంత తేలిక కాదు. ఆమందును పెట్టే గాజు కుప్పెలు (vials) 1500 కోట్లు కావాలి. అవి 2021 చివరికి కాని తయారు కావని అంటున్నారు.
ఆర్ధికంగా కుంగిపోయి ఉన్న అనేక దేశాలకు ఈ అదనపు భారం మోయటం శక్తికి మించినది. ఆచరణలో ఇంకా ఎన్నో ఇతర సమస్యలూ ఉంటాయి. వీటన్నిటినీ చక్కబరచకుండా వాక్సిన్ వచ్చేసింది అని చెప్పటం ప్రజలను మాయ చేయటమే ఈ పోటాపోటీలు ఎలా ఉన్నా”జనాభా మొత్తానికి వాక్సిన్లు అందాలంటే నాలుగు నుంచి ఐదు ఏళ్ళు పట్టవచ్చునని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సి యి ఓ అభిప్రాయ పడుతున్నారు. ” 2020 డిసెంబరు కల్లా కచ్చితంగా కొన్ని వాక్సిన్లు విడుదల అవుతాయి, కానీ పెద్ద సంఖ్యలో అవి అందుబాటు లోకి రావు” అని ప్రొఫెసర్ కౌలింగ్ ఒక వాస్తవ అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వాక్సిన్ పందెంలో ‘ఎవరు శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారు, ఏది సరైన వ్యాక్సిన్? నిలువ చేసే హడావుడిగా వచ్చే ఈ వ్యాక్సిన్ ల వల్ల ఏ ప్రమాదము రాదు కదా?” అనే భయాందోళనలు ఒక పక్క, ఈ వ్యాక్సిన్ లు అసలు పనిచేస్తాయా అనే సందేహం మరో పక్క ప్రజలను పీడిస్తోంది.
వ్యాక్సిన్ అంటే ఏమిటి?
ఏదైనా రోగ కారక క్రిమిని (వైరస్ కావోచ్చు, బాక్టీరియా కావొచ్చు) మనిషి శరీరం లో, తక్కువ మోతాదు లో ప్రవేశ పెడితే, అది వ్యాధిని కలిగించలేదు కాని శరీరం దానికి ప్రతిస్పందించి ఆ క్రిమి (antigen)కి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను (ANTIBODIES) తయారు చేసుకుంటుంది. నిజమైన క్రిమి అ వ్యక్తిలో ప్రవేశిస్తే, దాన్ని గుర్తించి సిద్ధం గా ఉన్న రక్షకాలు, ఎదురు దాడికి దిగి క్రిమిని నాశనం చేస్తాయి. అలా వ్యాధి నుంచి కాపాడతాయి. అయితే ఈ ప్రతిరక్షకాలు ఎల్లకాలమూ శరీరం లో ఒకే స్తాయి లో నిలవ వుండవు. వాటి స్థాయి తగ్గి పోతున్నప్పుడు మరోసారి టీకా ఇచ్చి, వాటిని తిరిగి ఉత్పత్తి చేయాలి. ఇలా ఇచ్చే దానిని బూస్టర్ డోసు (Booster dose) అంటారు. ఏ ప్రత్యేక రకం యాంటిజన్ కు వ్యతిరేకంగా యాంటిబోడీలు తయారుగా ఉన్నాయో, ఆ క్రిమిని మాత్రమె ఇవి సంహరించగలవు. క్రిమిశరీరం లో కానీ, దాని ధర్మాలలో కానీ మార్పు (mutation) వస్తే ఈ వాక్సిన్ ఉపయోగపడదు. ప్రస్తుత కరోనా క్రిమి అతి త్వరగా ఇలా మ్యూటేట్ అవుతోంది. వివిధ ప్రాంతాలలో అది వివిధ రూపాలలో ఉంటోంది. కనుక ప్రపంచమంతా పనికి వచ్చే వాక్సిన్ అనేది శాస్త్రరీత్యా సాధ్యం కాదు. అందుకే శాస్త్రజ్ఞులు వీలయినన్ని ఎక్కువ రూపాల వైరస్ ను తట్టుకునేలా శక్తివంతమైన వాక్సిన్ తయారు చేయటం లో నిమగ్నమై ఉన్నారు.
కచ్చితమైన వాక్సిన్ తయారు కావటానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ వైరస్ అంతకాలం ఉంటుందో, లేదో తెలియదు. ప్రజలలోఇప్పటి భయం కొనసాగుతుందో లేదో తెలియదు. అందుకే ఏదో ఒక రూపం లో వాక్సిన్ తెచ్చి ప్రజల భయాన్ని కాష్ చేసుకునే ప్రయత్నంలో కంపెనీలు తొందర పడుతున్నాయి.
ప్రజల ప్రాణ రక్షణ కన్న కంపెనీల లాభాలే మిన్న అనే ఉద్దేశ్యమే వాక్సిన్ ప్రవేశ పెట్టటంలో తొందరపాటు పద్ధతులకు కారణం అనే విమర్శ కూడా ఎక్కువగానే వినిపిస్తోంది.
కరోన వాక్సిన్ల తయారి ప్రస్తుతం ఏ దశలో ఉన్నది?
దాదాపు 160 వాక్సిన్ రకాలపై పరిశోధనలు జరుగుతూ ఉంటె, అందులో కొన్ని సఫలమూ, కొన్ని విఫలమూ చెంది 26 సంస్థలు మనుషులపై ప్రయోగించే దశకు వచ్చాయి. వాటిలో 10-15 రకాలు చివరి దశ పరీక్షకు చేరుకున్నాయి. అనేక చోట్ల వీటిని మనుషులకు ఇచ్చి ఫలితాలు పరిశీలిస్తున్నారు.ప్రాధమిక పరీక్షలు పూర్తి చేసుకున్న వాక్సిన్లను మూడు దశల మానవ ప్రయోగాలకు గురి చేస్తారు. మొదటి దశలో సామర్ధ్యాన్ని, రెండవ దశలో భద్రతనీ,మూడవ దశలో దుష్ప్రభావాలనీ పూర్తిగా అంచనావేసి ఆపిదప సురక్షితమైన వాక్సిన్ ను మార్కెట్ చేస్తారు. . ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలను సమన్వయ పరుస్తున్నది. శాస్త్ర రీత్యా, నిరభ్యంతరంగా అందరికి ఇవ్వవచ్చు అన్న దశకు ఏ వాక్సిన్ చేరుకోలేదని చెబుతున్నది.
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో, కేం బ్రిడ్జి లో మోడేర్నా అనే సంస్థ ఆర్ ఎన్ఏ ఆధారంగా వాక్సిన్ తయారు చేస్తోంది. జూలై నుండి మూడవ దశ ట్రయల్ లో ఉంది. నోవావాక్స్ అనే సంస్థ కరోన వైరస్ కొమ్ములలో ఉన్న ప్రోటీన్ ను తీసి నానో పార్టికల్స్ ద్వారా మనిషి లో ప్రవేశ పెట్టే సాంకేతికతను వాడుతోంది. ఈ వాక్సిన్ ను జూలై నుండి మానవులపై ప్రయోగిస్తున్నారు. జాన్సన్ జాన్సన్ సంస్థ ఎడినో వైరస్ వాహకంగా ఒక వాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. 2021 చివరికి 70 కోట్ల డోసుల వాక్సిన్ తయారు చేస్తామని వారు అంటున్నారు.
చైనా లో మూడు సంస్థలు 3వ దశ పరీక్షలు చేస్తున్నాయి. సినోవాక్ సంస్థ రీసస్ కోతులు, ప్రయోగశాలలలో అధ్యయనాలు పూర్తి చేసి బ్రెజిల్ దేశంలో పది వేల మంది పై ఉపయోగించి పరిశీలిస్తోంది. కాన్సినో బయలాజిక్ సంస్థ వైరస్ వాహక వాక్సిన్ తయారు చేస్తున్నారు, గతంలో ఎబోలా వాక్సిన్ను ఈ పద్ధతిలోనే తయారు చేసారు. ఊహాన్ సంస్థ 500 వలంటీర్ల మీద 2వ దశ పర్రీక్షలు చేసినట్లు PTI సంస్థ ఏప్రియల్ 14న చెప్పింది. ఇప్పుడు వీరు ఏమిరేట్స్(UAE)లో 15 వేల మంది తో జూలై నుండి 3 వ దశ పరీక్షలు జరుపుతున్నారు.బీజింగ్ ఇన్స్టిట్యూట్ కూడా 2 వ దశను దాటింది. ఆనవాయి జిఫీ అనే మరో సంస్థ నానో పార్టికల్ టెక్నాలజీతో వాక్సిన్ అభివృద్ధి పరుస్తోంది. చైనా లో వైరస్ ను సమర్ధవంతంగా అరికట్టడంతో అక్కడ మనుషులపై పరీక్షించే అవకాశం లేకుండా పోయింది. తమ దేశంలోని సైనికులు, వైద్య రంగంలో పనిచేస్తున్నవారి మీద రెండవ దశ లో పరీక్షించి, సంతృప్తిని పొందిన తర్వాత, మూడవ దశ పరీక్షల కోసం, వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్న బ్రెజిల్, ఆరబ్ దేశాలలో చైనా సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు, వేరు వేరు వాతావరణ పరిస్థితులలో, వివిధ జాతుల ప్రజలపై పరీక్ష చేసి వాక్సిన్ సంపూర్ణంగా భద్ర మైన దేనా అని నిర్ధారిస్తారు. ఒక వాక్సిన్ కు పూర్తి అనుమతి లభించాలంటే ఈ విధమైన అంతర్జాతీయ పరీక్ష ముఖ్యమైన షరతు. ఈ విషయాన్ని తెలివిగా మరుగు పరిచి, చైనా ఇతర దేశాల ప్రజలను ప్రయోగ జంతువులుగా వాడుకుంటోందని కొందరు దుష్ప్రచార దండయాత్ర చేస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఇలా మరో దేశంలో తమ వాక్సిన్ ప్రయోగించి చూడటం ఒక సాధారణ విషయమే. అయినా చైనా పట్ల ద్వేష భావంతో కువిమర్శలు చేస్తున్నారు. ఇలాటి కుయుక్తులను సరకు చేయకుండా చైనా తన కృషి కొనసాగిస్తోంది. ఆగస్ట్27న BBC ప్రసారంలో చైనా లోని కార్మికులకు చాల మందికి టీకాలు ఇచ్చారని, నవంబరు కల్లా వారి వాక్సిన్ మార్కెట్ లోకి వస్తుందని, , ఈ డిసెంబర్ నుంచే వాణిజ్యానికి కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తమ వాక్సిన్” డిసెంబరు నుండి మార్కెట్ లో పూర్తి స్థాయిలో లభ్యం అవుతుందని” చైనా సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ కూడా ఈనెల 15న ప్రకటించింది. ప్రపంచం లో క్లినికల్ ట్రయల్ దశలు ముగుస్తున్న వాక్సిన్లు తొమ్మిది ఉంటే అందులో ఐదు చైనా అభివృద్ధి చేసినవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సూది మందు కాకుండా ముక్కులో వాడే స్ప్రే రూపం లో కూడా వాక్సిన్ తయారు చేయటానికి చైనా సమాయత్తమవుతోంది.
“మేము కరోనాకు మొదటి వాక్సిన్ తయారు చేయటానికి పోటీ పడటం లేదు కానీ చాల సమర్ధవంతమైన వాక్సిన్ కోసం కృషి చేస్తున్నాము“ అని చైనా చెబుతోంది.
జర్మనీ లోని బయాన్ టిన్ సంస్థ ఫైజర్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన వాక్సిన్ తో జర్మని, అమెరికాలలో మానవ ప్రయోగాలు చేస్తున్నారు. వీరి ముందంజ చూసి యూరోపెయన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 1000 లక్షల పౌండ్ల ఆర్ధిక ఒప్పందం చేసుకుంది.
ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైరల్ వెక్టార్ ను ఉపయోగించి వాక్సిన్ తయారు చేసింది. బ్రిటిష్- స్వీడిష్ సంస్థ ఆస్త్రజేనికా దీని తయారీదారు. ఈ పరిశోధనలలో భాగంగా ఇంగ్లాండ్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఇండియాలలో మూడవ దశ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. దాదాపు పది వేల మందికి ఈ ఔషధ ప్రయోగం చేయాలనుకున్నారు. డిసెంబర్ వరకు ౩౦౦౦ లక్షల డోసులు తయ్యారు చేయటానికి ఏర్పాట్లు చేసారు. అయితే, కొద్దిగా కనిపించిన నరాల దుష్ప్రభావాలు చూసి అధ్యయనం తాత్కాలికంగా నిలిపి వేసినా, తిరిగి కొనసాగిస్తున్నారు.
భారత దేశం లో ఆక్సఫర్డ్ వాక్సిన్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా( పూనా) వారి ద్వారా మానవ ప్రయోగాలకు వాడుతున్నారు. 2,3 దశల పరీక్షలు సమాంతరం గా జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ ICMR ఆధ్వర్యంలో కోవాగ్జిన్ వాక్సిన్ పై పరిశోదిస్తోంది. దీని మొదటి దశ ట్రయల్స్ ఈ నెలలోనే ముగిసాయి. జైడస్ కాడిలా సంస్థ డిఎన్ ఏ ఆధారిత వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇవి 2 దశల పరీక్షలు పూర్తి చేసి, ఎన్నిక చేసిన సంస్థలలో నిమ్స్ ఆసుపత్రి వంటి చోట్ల మానవ ప్రయోగాలు ఆరంభించారు. 2021 తొలి మూడు నెలలలో మన దేశంలో వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి నిన్ననే ప్రకటించారు. 2021 కల్లా అందుబాటులోకి వస్తాయని ఆరోగ్య మంత్రి చెబుతుంటే, 2024 వరకు పడుతుందని సంబంధిత పరిశోధకులు అంటున్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని పెద్ద ఎత్తున తయారు చేయగల దిగ్గజ సంస్థలు భారత్ లోనే ఉన్నాయని భావించి బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్ మన సీరం ఇన్స్టిట్యూట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడ వాక్సిన్ విజయవంతమైనా దాన్ని భారత్ లో ఉత్పత్తి చేసేలా బిల్ గేట్స్ చర్చలు సాగిస్తున్నాడు.
ఇంగ్లాండ్ ఇంపీరియల్ కాలేజిలో స్వయంగా విస్తరణ చెందే RNA, సింగపూర్లో mRNA, ఆస్ట్రేలియా లో ప్రోటీన్ సబ్ యూనిట్ ఆధారంగా వాక్సిన్లు, కెనడాలో పొగాకు ఆకులలో ఈ వైరస్ ను ప్రవేశపెట్టి తద్వారా ఏర్పడిన సంయోజకాలతో వాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్ని ఇంచు మించు 2021 రెండవ అర్ధభాగం లో ప్రజలకు అందుబాటు లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
అన్ని దేశాలకన్నా ముందు తమ కరోన వాక్సిన్ సిద్ధమయ్యిందని రష్యా ప్రకటించింది. ఈనెల రెండవ వారంలో ఆ వాక్సిన్ ను తమ దేశం లోని అన్ని ప్రాంతాలకు అందజేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రి ప్రకటించారు. మూడో దశ ట్రయల్స్ 40 వేల మంది పై భారీగా జరుగుతున్నాయని. 2021 తొలి భాగం లోనే 100 కోట్ల మందికి తాము వాక్సిన్ అందించగలమని రష్యా అంటోంది. వీరిది కూడా వైరల్ వాహక వాక్సినే. రెండవ దశ పూర్తికాగానే, తమ వాక్సిన్ విజయవంతమని రష్యా ప్రకటించడంతో దాని చుట్టూ అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. వారి గమలేయ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పద్ధతులను 26గురు శాత్రవేత్తలు లాన్సేట్ అనే వైద్య పత్రికలో ప్రశ్నించారు.దీనికి సమాధానమా అన్నట్లు అధ్యక్షుడు పుతిన్ నాటకీయంగా తన కుమార్తెకు ఆ వాక్సిన్ ఇప్పించి వాక్సిన్ సురక్షితం అని ప్రకటించాడు. ఈ వాక్సిన్ కు స్పుత్నిక్ -వి అని పేరు పెట్టడం ద్వారా, రష్యా గతంలో రోదసి పరిశోధనలలో అమెరికాపై పైచేయి సాధించిన ఆధిపత్య చరిత్రను గుర్తు చేస్తోందని కొందరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఇది శాస్త్రపరమైన ముందంజగా కంటే ఒక రాజకీయ ఎత్తుగడగా అనేకులు చూస్తున్నారు.
వాక్సిన్ల అభివృద్ధి చాల సున్నితమైన, సంక్లిష్టమైన, శాస్త్రీయఅంశం. అనేక జాగ్రత్తలు తీసుకున్న తరువాతనే దాన్ని విడుదల చేయ వలసి ఉంటుంది. ఈలోగా తొక్కే అడ్డదారులు దొంగ దారులే అవుతాయి. వాస్తవంగా ఈనాటివరకూ అన్నివిధాలుగా విజయవంతమైన కరోన వాక్సిన్ రాలేదు.” 2021 మధ్యలో ఉపయోగపడగల వాక్సిన్ వస్తుంది. 2022 చివరికి కానీ అది తగిన స్థాయిలో ప్రజలకు చేరదు.” అని ఇంగ్లాండ్ లోని VMIC సంస్థ అధినేత పలుకులతో నేటి దశను మనం అర్ధం చేసుకోవచ్చు. “అంతర్జాతీయ ప్రమాణాలు లేకుండా వాక్సిన్ తయారు చేసి ,పంపిణీ చేస్తే దాన్ని ఉపయోగించిన వారి నుండి ఇతర దేశాలకు మళ్ళి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంద”ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా వ్యవహరించిన డా.శ్రీనాథ్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.
వాక్సిన్ రాజకీయాలు
కరోనా వైరస్ తల ఎత్తిన దగ్గరినుండి దాని చుట్టూ అనేక రాజకీయాలు ముసురుకున్నాయి. ఈ నెపంగా అమెరికా నేతృత్వంలో చైనా వ్యతిరేక ప్రచారానికి పెద్దఎత్తున వ్యూహాలు పన్నారు.ప్రతి చిన్న విషయంలో కూడా చైనా వ్యతిరేక విషం చిమ్మారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చైనా అనే బూచి కారణం అని ప్రచారం చేసారు. చైనా ఈ వైరస్ కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాల నుండి పాఠాలు నేర్చుకోకపోగా, కనీస సహకారం ఇవ్వకపోగా, అనేక నిందలు వేస్తున్నారు. చైనా దగ్గర వాక్సిన్ ఉందని, తమకు ఇవ్వటం లేదని, తన మిత్రులకు రహస్యం గా ఇచ్చిందని కొన్నాళ్ళు, తమ లాబోరేటరీల నుండి సమాచారం తస్కరించి వాక్సిన్ తయారు చేసుకుంటోందని కొన్నాళ్ళు, ఆపదలో ఉన్న దేశాలకు వాక్సిన్ అమ్మి సొమ్ము చేసుకోవటమే చైనా లక్ష్యమని కొన్నాళ్ళు, ఇష్టమొచ్చిన ప్రచారం సాగిస్తున్నారు. సెర్బియా, ఇటలీ తదితర దేశాలకు చైనా వైరస్ వ్యతిరేక కిట్లు, మాస్కులు పంపితే దానికి దురుద్దేశాలు అంటగట్టి దాన్ని చైనా వారి ”మాస్కుల దౌత్యం” అని ప్రచారం చేసారు యూరప్ దౌత్యవేత్తలు. ప్రస్తుతమ్ వాక్సిన్ ను అడ్డం పెట్టుకొని వారే దౌత్యమూ, వ్యాపారమూ చక్కబెట్టు కొంటున్నారు.
ఏ దేశం లో వాక్సిన్ ప్రయోగాలు విజయవంతమవుతున్న సూచనలు కనిపించినా వారితో బేరసారాలు నిర్వహిస్తూ రాని వాక్సిన్ ను ముందుగానే కొని వేస్తున్నారు. ధనిక దేశాలు అనేక ఫార్మా కంపెనీలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కంపెనీలకు కావలసిన నిధులు అద్వాన్సుగా సమకూర్చుతున్నాయి. దానితో సమీప భవిష్యత్తులో వాక్సిన్లు మార్కెట్ కు వచ్చినా అవన్నీ ధనిక దేశాలకు తరలి వెళ్లిపోతాయి. ఈ పాటికే అలాంటి ఏర్పాట్లు జరిగిపోయాయి అని GAVI అనే అంతర్జాతీయ వాక్సిన్ సమాఖ్య బట్టబయలు చేసింది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి వాక్సిన్ ముందుగా అవసరం ఉందో వారికి ముందుగా పంపిణీ చేయాలి” అనే సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ”ఎవరు కొనగలరో వారికే వాక్సిన్” అనే వ్యాపార సూత్రం అమలు చేయ బోతున్నాయి పెట్టుబడిదారీ దేశాలు. ఉత్పత్తి, సరఫరా, ధర, వంటి అంశాలలో వారిదే పెత్తనం కాబోతోంది. పెద్దఎత్తున రోగ గ్రస్తమవుతున్న పేద దేశాలకు, ధనిక దేశాలలో ఉన్న పేద వర్గాలకు ఈ వాక్సిన్ అందుబాటులో ఉండదు. ఉన్నా వారు కొనలేని ఖరీదులో ఉంటుంది. ఈ పరిస్టితులలో మా వాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా దక్షిణ ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు పంపుతామని చైనా ప్రకటించి ఆ దేశాలకు ఊరట కల్గించింది. దీన్నికూడా చైనా వారు చేస్తున్న “వాక్సిన్ దౌత్యం” గా వక్రీకరిస్తున్నారు పెట్టుబడిదారులు. మాప్రజల అవసరాలు మాకు ముఖ్యం అనే సాకుతో వారు ప్రచారం చేసుకొంటున్న బూటకపు ”వాక్సిన్ జాతీయత’ కు చైనా చూపిస్తున్న అంతర్జాతీయతే సరియిన విరుగుడు గా బీదదేశాలు భావిస్తున్నాయి.
ఇలా వాక్సిన్ అనేది వ్యాధి నిరోధక టీకాగా కంటే ఒక రాజకీయ శస్త్రంగా మారిపోయింది. ఒక ప్రచారఅస్త్రం గా మారిపోయింది. కొందరికి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు నేరవర్చే సాధనం గా మారిపోయింది.
“మన చుట్టూ వైరస్ కమ్ముకుని ఉంటే మనం మన వృత్తి వ్యాపారాలు ఎలా కొనసాగించ గలము? సాధారణ జీవితం ఎలా మొదలు పెట్టగలము? రాక పోకలు ఎలా చేయగలము? అందరూ సురక్షితం గా ఉంటేనే, మనమూ సురక్షితం గా ఉంటాము“ అని GAVI సియివో సేత్ బర్క్లీ పలికిన హిత వచనాలు పాటించి కరోనాను సమిష్టిగా ఎదుర్కోవాలి. దీనికి అడ్డు పడుతున్న రాజకీయ, ఆర్ధిక శక్తులను కూడా ప్రజలు ఎదిరించక తప్పదు.
(Dr Jatinkumar is a practising orthopedic surgeon, writer and socio-political analyst)