వన్డే ఇన్నింగ్స్ లో సచిన్ సాధించిన మూడు థ్రిల్లింగ్ బ్యాటింగ్ విన్యాసాలివే

(CS Saleem Basha)
క్రికెట్ మతం అయితే- సచిన్ దేవుడు“. ఒక క్రికెటర్ కి ఇంతకన్నా పెద్ద గౌరవం ఏముంటుంది? భారత క్రికెట్ ప్రేమికులకు సచిన్ ఒక ఆరాధ్యదైవం. సచిన్ టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. సచిన్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఎన్నోసార్లు జట్టును గెలిపించాడు, అన్ని ఫార్మాట్లలో కలిపి “100” వందలు చేశాడు. ఒక ఆటగాడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించారు. బ్యాటింగ్ కు పర్యాయపదం అయిన సచిన్, వన్డే ఇన్నింగ్స్ లో మూడు ఉత్తమమైన బ్యాటింగ్ విన్యాసాలను ఒకసారి చూద్దాం.

 

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ” కోకా కోలా కప్” 22.04.1998
సచిన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఇది ఒకటి. ఆస్ట్రేలియా లాంటి జట్టుని ఎదుర్కొని నిలవడం అంత సులభం కాదు. 285 పరుగుల లక్ష్యాన్ని (డక్వర్త్ లూయిస్ ప్రాతిపదికన భారత జట్టు లక్ష్యాన్ని 46 ఓవర్లలో 277 పరుగులకు కుదించారు.) చేధిస్తూ భారత జట్టు 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్త వీక్షకులను సమ్మోహితులను చేసిన ఇన్నింగ్స్ అది. ఆ ఇన్నింగ్స్ కు ” ఎడారి తుఫాను” అని పేరు. నిజంగానే ఒక తుఫానులా షేన్ వార్న్, ఫ్లెమింగ్, మైకేల్ కాస్పరోవ్విచ్ వంటి ఆస్ట్రేలియన్ బౌలర్లపై విరుచుకు పడిన సచిన్, 9 సొగసైన బౌండరీలు, నాలుగు సూపర్ సిక్సర్లతో కేవలం 131 బంతుల్లో 143 పరుగులు సాధించి ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్ళాడు. ఇండియా ఓడిపోయినప్పటికీ సచిన్ పడిన కష్టం చేసిన పరుగులు వృధా పోలేదు. న్యూజిలాండ్ తో పాటు సమానంగా పాయింట్లు సాధించిన ఇండియా, సచిన్ ఇన్నింగ్స్ తో మెరుగైన రన్ రేట్ సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్ సచిన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ లో మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడమే కాకుండా, నిప్పులు చెరిగే ఎండలో ఆడుతూ సచిన్ కూడా నిప్పులు చెరగడం ఈ మ్యాచ్ ను సచిన్ తో పాటు భారత క్రికెట్ అభిమానులకు మరపురానిది గా మిగిలిపోయింది. ఈ మ్యాచ్ లో ఇంకొక విశేషం వుంది. నిజంగానే ఒక “ఇసుక తుఫాను” 20 నిమిషాల పాటు ఈ మ్యాచ్ ను నిలిపేసింది. అందుకే మ్యాచ్ 46 ఓవర్లకు కుదించబడింది
మరోసారి చెలరేగిన సచిన్ (” కోకా కోలా కప్” ఫైనల్స్ 24.04.1998)
రెండు రోజుల తర్వాత (24.04.1998) ఆస్ట్రేలియాతోనే జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సచిన్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఈసారి జట్టును గెలిపించడమే కాకుండా, కోకోకోలా కంపెనీ కూడా మన దేశానికి అందించాడు. ఈ మ్యాచ్ లో కూడా చెలరేగి పోయిన సచిన్ 131 బంతుల్లో 134 పరుగులు చేసి బదులు తీర్చుకున్నాడు. మరోసారి షేన్ వార్న్, ఫ్లెమింగ్ లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో వీళ్లిద్దరూ 60 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో మైకేల్ కాస్పరోవ్విచ్ బౌలింగ్ లో బౌలర్ తలపై నుంచి నేరుగా సచిన్ కొట్టిన సిక్సర్ ను భారత అభిమానుల ఎప్పటికీ మర్చిపోలేరు. తన జన్మదినం సందర్భంగా (24 ఏప్రిల్) భారత అభిమానులకు అద్భుతమైన ఇన్నింగ్స్ ను తనే ఒక గిఫ్ట్ గా అందించాడు. ఈ రెండు మ్యాచుల తర్వాత షేన్ వార్న్ విలేకరులతో మాట్లాడుతూ ” సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ నాకు తరచూ వచ్చే పీడకల లాంటిది” అని చెప్పడం విశేషం.. దటీజ్ సచిన్ రమేష్ టెండూల్కర్. పై రెండు మ్యాచ్ లు సచిన్ బ్యాటింగ్ కిరీటంలో పొదగబడిన వజ్రాలు.

సచిన్ బ్యాటింగ్ కిరీటంలో పొదగబడిన మూడో వజ్రం (పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, 2003 ప్రపంచ కప్) గురించి మరోసారి చూద్దాం

 

Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)