(CS Saleem Basha)
మనకోసం “మనసు” పాటలు మనసు పెట్టి మరీ రాసిన “మనసు” కవి, మన”సు” కవి “ఆచార్య ఆత్రేయ” అని మనం మనసారా పిలుచుకునే కిళాంబి వెంకట నరసింహాచార్యులు వర్ధంతి ఈరోజు (13.09.2020).
ఈ సందర్భంగా ఆయన పాటలను, మాటలను కొంచెం గుర్తు చేసుకుందాం.
మనసు పై ఈయన రాసిన పాటలు దాదాపు అన్ని సూపర్ హిట్. కాసింత వేదాంతాన్ని కలిపి రాసిన, ప్రేమ్ నగర్ లోని పాట ” మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే! మనసున్న మనిషికి సుఖము లేదంతే!”, నాకు ఇష్టమైన పాట. కానీ డాక్టర్ చక్రవర్తి సినిమా లోని ” మనసున మనసై బ్రతుకున బ్రతుకై” అనే పాట ఆయన రాయలేదు, అది కూడా చిత్రమే! దాన్ని శ్రీశ్రీ గారు రాశారు! అంతలా ఆయన మనసు మీద పాటలు రాయడానికి కారణం ఆయన ప్రేమ విఫలం అవ్వడమే. ఇష్టం లేకపోయినా పద్మావతి ని వివాహం చేసుకున్నాడు. కానీ ప్రియురాలిని మర్చిపోలేక పోయాడు ఆత్రేయ. అదీ విషయం! అభినందన(1988) సినిమా లో ” ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం” పాట ఎందుకు అందుకే రాసి ఉండవచ్చు. “మనసు” అన్నది మూడక్షరాల పదం. అయినా అది ముప్పుతిప్పలు పెడుతుంది అని సన్నిహితుల దగ్గర చెప్పేవాడట.
పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని, తదనుగుణంగా పాట రాయడం ఆత్రేయ స్పెషాలిటీ. ముఖ్యంగా సాధారణ జనబాహుళ్యం మాట్లాడుకునే భాషను. సినిమాల్లోకి తీసుకోవడం ఆత్రేయ కే చెల్లింది. మూగమనసులు సినిమాలో జమున పాత్ర పాడిన ” మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను.” పాట దీనికి ఉదాహరణ. ఈ పాటలో చరణం చూస్తే” నాకు ఒక మనసు నాది, మనసున్నాది, నలుగురిలా ఆశున్నాది, కలలు కనే కళ్ళు ఉన్నాయి, అవి కలతపడితే నీళ్ళున్నాయి” ఎవరికైనా అర్థం అయ్యే పాట. ఇట్లాంటి పాటలు వందలకొద్ది రాశాడు. పాట రాసినా మాట రాసినా చాలా సాధారణంగా ఉంటాయి, మనసుల్లోకి ఇంకిపోతాయి, నిలబడిపోతాయి.
“నాలుగు కళ్ళు రెండయినాయి, రెండుమనసులు ఒకటైనాయి (ఆత్మబలం), ” మౌనమే నీ భాష ఓ మూగ మనసా”(గుప్పెడు మనసు), లాంటి పాటలు ఆత్రేయ మనసు నుంచి జాలువారిన మణి, మాణిక్యాలు. మళ్లీ “మనసులేని బ్రతుకొక నరకం(సెక్రటరీ)” అనే పాట రాసిన ఆత్రేయ నే ” మనసున్న మనిషికి సుఖము లేదంతే”(ప్రేమ్ నగర్) అని కూడా రాశాడు. అదే ఆత్రేయ లో ఉన్న వైవిధ్యభరిత వైరుధ్యం. ప్రేమలు పెళ్లిళ్లు(1974) సినిమా కోసం ” మనసులేని దేవుడు.. మనిషికెందుకో మనసిచ్చాడు” అనే పాట ఆత్రేయ తప్ప ఎవరు రాయగలరు? దటీజ్ ఆత్రేయ! ఆయన పాట, మాట, చివరికి జీవితం కూడా అంతే. వెలుగు,నీడలు.
“ఆచార్య ఆత్రేయ’ అనేది ఆయనకాయన పెట్టుకున్న కలం పేరు. నరసింహాచార్యులనే పేరులోని ‘ఆచార్య” ఇక ‘ఆత్రేయ” అన్నది అయన గోత్రం. రెండూ కలిపితే కలం పేరయ్యింది .రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపించిన ఆత్రేయ కలం నుంచి జాలువారిన అనిముత్యాలు ఎన్నో. ఆయన సినిమా జీవితంలో 13 వందల పైచిలుకు పాటలు మరియు 200 సినిమాలకు మాటలు రాశాడు
ఇక ఆయన సినిమా తెరంగేట్రం 1951లో వచ్చిన “దీక్ష” సినిమా తో జరిగింది. ఆ సినిమాకు ఆయన కథ, మాటలు, పాటలు రాశాడు. అందులోని పాట “పోరా బాబూ పో పోయి చూడు ఈ లోకం పోకడ” అనే పాట ప్రాచుర్యం పొందింది. ఆయన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఆత్రేయ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక సినిమాకి పాటలు రాయడానికి ముందు అందులోని నటీనటుల గురించి వారి పాత్రల గురించి తెలుసుకునే వాడు. దాన్నిబట్టి ఆ పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అన్నట్టు పాటలు రాసేవాడు. పాట రాసేటప్పుడు ఆయన ఎంతో తపించేవాడు.
ముందే చెప్పినట్లు ఆత్రేయ చిత్రమైన మనస్తత్వం ఉన్నవాడు. నిర్మాతల దగ్గర ఒక 500 అప్పు తీసుకోవడం కోసం టాక్సీ కి 300 ఖర్చు పెట్టేవాడు! అలా ఎన్నో సార్లు చేశాడు. డబ్బులు వచ్చేదాకా బాగా కష్టపడే వాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేవాడు. డబ్బులు వచ్చాక ఖర్చు పెట్టే దాక నిద్రపోయేవాడు కాదు ఆత్రేయ కొత్త కొత్త వస్తువుల మీద వ్యామోహం ఎక్కువ. వాటికి డబ్బంతా ఖర్చు పెట్టేవాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదుర్తి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి, మాంగల్యబలం, మంచి మనసులు, వెలుగు-నీడలు, మూగమనసులు. వంటి చిత్రాలన్నీ సూపర్ హిట్ ! ఎన్నటికీ పాతబడని ఈ పాట వినండి
’ఆత్మబలం‘ సినిమా తీసేటపుడు ఒక సమస్య వచ్చింది.బెంగాలీ ‘అగ్నిసంస్కార్’ ని తెలుగు లో ఆత్మబలం పేరుతో తీస్తున్నారు. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను సంగీత దర్శకుడు కెవి మహదేవన్ కు చూపించాడు. ఇందులో పాటలకు స్కోపెక్కడ లేదని చెప్పారు. అక్కడే ఆచార్య ఆత్రేయకూడా ఉన్నారు. వారంతా అపుడు బెంగుళూరులోని ఒక హోటల్లో ఉన్నారు. పాటలకు స్కోప్ లేదని మహదేవన్ చెప్పడంతో గాభరా పడిన రాజేంద్ర ప్రసాద్ రాత్రంతా మేలుకుని పాటలకోసం కొన్ని ఘట్టాలు ఎంపిక చేశారు. కెవి మహదేవన్ కు అవినచ్చాయి. తర్వాత ఆత్రేయకు చూపించారు.ఆయన కొన్నిమాటలు చెప్పాడు. అది విని రాజేంద్ర ప్రసాద్ వూపిరిపీల్చుకున్నాడు. అయితే, ఆ పాటలు ఆత్రయే మనసు దాటి బయటకురావడంలేదు. రాజేంద్ర ప్రసాద్ విసుగొచ్చి హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారు. మరుసటి రోజు పొద్దునే ఆత్రేయ కారెక్కి డ్రైవర్ ని కబ్బన్ పార్క్ పోనీయమన్నాడు. బాగా వర్షం. పార్క్ లో మార్కింగ్ వాక్ కు వచ్చిన జనమంతా చెట్లకిందికి పరిగెత్తుతున్నారు. అందులో ఒక అమ్మాయి ఆత్రేయ కంటపడింది. రెండుచేతుల తలను కప్పుకుని ఆమె చెట్టు దగ్గరకు వడివడిగా నడుస్తూ ఉంది. ఈ దృశ్యం చూశాడో లేదో ఆత్రేయ పాట ఐడియా వచ్చింది. అదే చిటచిటచినుకుల.. సూపర్ హిట్ పాట.
ఆత్రేయ ఒక మంచి రచయితే కాదు, మంచి హ్యూమరిస్ట్ కూడా. ఓసారి సినిమా హాల్ నుంచి బయటికి వస్తున్న ఆత్రేయను చూసి ఒకాయన ” ఆత్రేయ గారు మీరు సినిమా చూశారా?” అని అడిగాడట. దానికి ఆత్రేయ “లేదు నాయనా… భరించాను” అని అన్నాడట.
అలాగే ఒకసారి ఆయన్ను ఎవరో అడిగారు ” మీరు పాటలు మనసు మీదనే ఎందుకు ఎక్కువగా రాస్తారు?” అని. దానికి ఆత్రేయ “మనసు మీద మనసు పడ్డాను నాయనా” అన్నాడట.
ఒకసారి పాట పల్లవి రాసిన తర్వాత చరణాలు రావడం లేదు. నిర్మాత “సార్ చరణాలు ఎప్పుడు ఇస్తారు” అని అడిగాడు. దానికి ఆత్రేయ” అదే నాయనా చరణాల కోసం ఎవరి చరణాలు పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నా” అన్నాడట.
మీకు చావు అంటే భయం లేదా అని ఎవరో అడిగితే “నాకు చావంటే భయం లేదు నేను ఉన్నంత వరకు అది నా దగ్గరికి రాదు. అది వచ్చాక నేను ఎలాగూ ఉండను” అని చెప్పడం ఆత్రేయ కి మాత్రమే సాధ్యం.
ఆత్రేయ సినిమాల్లో రాసిన గొప్ప డైలాగుల్లో కొన్ని..
* ”ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా ఉంటుంది.
ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది”
* ”మనిషి తాను అనుకున్నట్టు బ్రతకనూ లేడు ఇతరులు అనుకున్నట్టు చావనూ లేడు”
* ”చావు ఎంతమందినో విడదీస్తుంది కాని కొంతమందిని కలుపుతుంది”
(మూగమనసులు)
* ”కవిత్వం వేరు, జీవితం వేరు. విలువలు తెలుసుకుంటే జీవితమే ఓ మహాకావ్యం అవుతుంది”
(”వెలుగునీడలు”)
* ” పిరికివాడెక్కడ చస్తాడు లతా … పిరికివాడు జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమని ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. రెండూ ఫలించని నాడు మరణిస్తాడు”
ఆత్రేయకు చిన్నప్పటినుంచి చదువు మీద కన్నా నాటకాల మీద ఎక్కువ దృష్టి. ఆయన కుటుంబం ఎంత సాంప్రదాయబద్ధమైన అంటే ఓసారి ఆత్రేయ ఓ నాటకంలో మీసాలు పూర్తిగా తీసేసి నటించాడని ఇంటికి వచ్చాక ఆయనకు గోమూత్రం తాగించి ప్రాయశ్చిత్తం చేశారట. ఓసారి ఓ మిత్రుడు ఆయనకి తను రాసిన కందపద్యాలు తెచ్చి చూడమన్నాడు. అప్పుడు ఆత్రేయకు అర్థం కాక “ఏమి చేయాలి?” అని మేనమామ ను అడిగాడట. అప్పుడు ఆయన మేనమామ కంద పద్య లక్షణాలు ఉన్న ఒక పుస్తకాన్ని తెచ్చి చదవమన్నాడు. అప్పుడు ఆ పద్యాలను ఆత్రేయ ఆకళింపు చేసుకొని నువ్వు చేసిన తప్పులు ఇవి అని తన మిత్రుని తప్పు అని రాసి చూపించాడట. అప్పుడు అది గమనించిన మేనమామ” ఒరేయ్ నువ్వు పాస్ అయితే నీకు రిస్ట్ వాచ్ మరి సైకిల్ కొని ఇస్తాను” అని అన్నాడట. అప్పుడు వెంటనే వెళ్లి మిత్రుల పాఠ్య పుస్తకాలను తీసుకుని కాపీ చేశాడట దాంతోనే అతనికి సగం పాఠ్యాంశాలు అర్థమై పోయాయట. అప్పుడు స్కూల్ ఫైనల్ పాస్ అయిపోయి మేనమామ ఇచ్చిన రిస్ట్ వాచ్ మరి సైకిల్ కి తీసుకుని ఊరంతా గర్వంగా తిరిగాడట.
సినిమాల్లోకి రాకముందు ఆత్రేయ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన సందర్భం కూడా ఉంది. అప్పుడు ఆయన చిత్తూరులో ఉపాధ్యాయ శిక్షణ లో ఉన్నాడు. ఆ తర్వాత చాలా ఉద్యోగాలు లాచేశాడు. కోర్టులో కాపీయిస్ట్ గా, సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగా, జమీన్ రైతు పత్రిక సహాయ సంపాదకుడిగా పని చేశాడు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు లో వేతన కార్యదర్శిగా కూడా చేశాడు. మద్రాసు వచ్చిన కొత్తలో ఇంటింటికి తిరిగి సబ్బులు కూడా అమ్మాడు
ఇంత చేసినా ఆత్రేయకు నేను చేయాల్సింది వేరే పని ఉందని అనుకునేవాడట మనసులో. అలా ఓసారి రాజన్ అనే మిత్రుడి సహాయంతో ఇంట్లో వెండి గ్లాసు దొంగలించి మద్రాస్ ట్రైన్ ఎక్కేశాడు. అయితే మద్రాసులో చాలా కష్టాలు పడ్డాడు. ఉన్నప్పుడు తినేవాడు లేనప్పుడు నీళ్లు తాగి పడుకునేవాడు. రాత్రులు మన్రో విగ్రహం దగ్గర పడుకునేవాడు. ఓసారి తన దగ్గర పావలా ఎక్కువ ఉందని అనిపించి వెంటనే ఒక నోటు పుస్తకం కొని ” గౌతమ్ బుద్ధ” (1943)అనే నాటకం రాసి 50 రూపాయలకు అమ్మాడు. ఆత్రేయ గురించి చెప్పుకున్నపుడు ఆయన నాటకాలా గురించిచెప్పుకోవాలి.
అశోక సామ్రాట్(1944),పరివర్తన (1945), వాస్తవం(1946), ఈనాడు( 1947), ఎన్జీవో (1948) విశ్వశాంతి (1951)కప్పలు (1953), భయం (1954) మనసూ వయసు (1968)లు ఆయన ఆయన రాసిన నాటకాలు. ఇంందులో మధ్యతరగతి కుటుంబాల మీదరాసిన ‘ఎన్జీ వో’ తెలుగు సాంఘిక నాటకాలలో ఒక గొప్పనాటకంగా పేరు పొందింది. ఇదే 195ా3లో గుమస్తా పేరుతో సినిమాగా కూడావచ్చింది.
మద్రాసులో సినీ నటుడు రమణా రెడ్డి తో పరిచయం ఏర్పడింది. టిఫిన్ కి భోజనానికి సహాయం చేసేవాడు రమణారెడ్డి.
ఆత్రేయ సహృదయత ఒక మంచి తార్కాణం ఒకటుంది. వాగ్దానం(1961)కు దర్శకత్వం వహించారు. కవితా చిత్ర బ్యానర్ కింద వచ్చిన ఈ చిత్రానికి కె సత్యనారాయణ, డి శ్రీరామమూర్తి నిర్మాతలు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ప్రధాన పాత్ర దారులు. ఈ చిత్రం ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమకు” దాశరధిని ” పాటల రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో చాలా విశేషాలున్నాయి. కె. రాఘవేంద్ర రావు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇందులో శ్రీనగజా తనయం అనే హరికథని మహా కవి శ్రీశ్రీ రాశాడు. తమాషా ఏంటంటే,ఈ సినిమా అక్కినేని, గుమ్మడిలాంటి గొప్పనటులను హాస్యనటుడు రేలంగి డామినేట్ చేశాడు.ఇక్కడ డైరెక్టర్ హీరో హీరోయిన్ లను కాపాడలేకపోయాడు. ఫలితంగా పెండ్యాల సౌండ్ ట్రాక్ తో ప్రాణంపోసినా సినిమా ఫస్టు రిలీజ్ లో బాక్సాఫీస్ దగ్గిరఫెయిలంది. రెండో రిలీజ్ లో ఖర్చులెళ్లాయనిచెబుతారు.
“వాగ్దానం” సినిమా ఫెయిలవడంతో ఇంకోసారి చచ్చినా సినిమా తీయను అని ఆత్రేయ “వాగ్దానం” చేశాడట!
ఆత్రేయ కి స్క్రీన్ పై మంచి పట్టు ఉంది. ” జీవనతరంగాలు” సినిమాలో పోలీసులనుంచి తప్పించుకొని పారిపోతున్న కృష్ణంరాజు అనుకోకుండా తల్లి శవాన్ని తీసుకు వెళ్తున్న పాడెను మోస్తాడు. అప్పుడు ఆ సీన్ కి, సాహిత్యాన్ని కలపడం కోసం, “మమతే మనిషికి బందిఖానా/భయపడి తెంచుకు పారిపోయినా/తెలియని పాశం వెంటబడి/ఋణం తీర్చుకోమంటుంది/ నీ భుజం మార్చుకోమంటుంది” అని చరణం రాయడం ఆత్రేయ క్రియేటివిటీకి, స్క్రీన్ ప్లే సామర్థ్యానికి నిదర్శనం.
ఆత్రేయకు శ్రీ శ్రీ “రాత్రేయ” అని పేరు పెట్టాడు. ఎందుకంటే రాత్రంతా పనిచేసి పగలంతా పడుకుంటాడు కాబట్టి! ఆత్రేయ ఇంకో పేరు ” బూత్రేయ”. దానికి సమాధానం ఇస్తూ ” నేను కొన్ని చెత్త పాటలు రాశాను. కొన్ని బూతు పాటలు కూడా రాయాల్సి వచ్చింది. సినిమా పాటల రచయిత జీవితం పడుపు వృత్తి లాంటిది” అని బాధపడటం ఆత్రేయ నిజాయితీకి నిదర్శనం. మంచి అయినా చెడు అయినా బయటికి చెప్పగలగడం ఆత్రేయ నిజాయితీ. నారాయణ రెడ్డి తో పాటు ఏకవీర సినిమా చూసి గా వస్తుండగా , నారాయణ రెడ్డి గారు సినిమా లో మాటలు ఎలా ఉన్నాయి(ఈ సినిమాకి డాక్టర్ నారాయణ రెడ్డి గారు మాటలు రాశారు) అని అడిగితే ” తెలుగులో రాసి ఉంటే బాగుండేది” అని చెప్పడం ఆయన నిర్మొహమాటనికి ఉదాహరణ. అదే నారాయణ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని చెప్పినప్పుడు ” ఈ వయసులో నారాయణ రెడ్డి నా దగ్గరికి డాక్టర్ని పంపిస్తున్నాడు. ఏం లాభం?” అని చమత్కరించాడు. అదీ ఆత్రేయ నైజం.
ఇక ఆయనకు లభించిన పురస్కారాలు విషయానికొస్తే 1989 మే 5వ తారీఖున ఆంధ్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ అందజేశారు. తొలికోడి కూసింది సినిమాలోని “అందమైన లోకమని” అనే పాటకు గానూ ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు పొందాడు.
ప్రేమ-మనసు పైన ఎన్నో పాటలు రాసిన ఆత్రేయ, పాటలు రాసిన చివరి సినిమా పేరు కూడా ” ప్రేమ”(1989) కావడం యాదృచ్చికం.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)