ఎపిలో ఆలయాలకు భద్రత కల్పించాలి: బిజెపి నేత దిలీప్

(దిలీప్ కిలారు)
మొన్న పిఠాపురం, ఈ రోజు అంతర్వేది ఘటనలు. దేవాలయాలు, మతవిశ్వాసాలు అనేవి చాలా సున్నతమైన అంశాలు. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ దేవాలయాలపై దాడులు, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం ఇతర ఘటనల్లోని విధ్వంసాన్ని ఏపీ బీజెపీ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది ? ఒకటో రెండో ఘటనలైతే ప్రమాదం అనుకోవచ్చు.. కానీ ఇలా వరుస ఘటనలను ఎందుకు పట్టించుకోవడం లేదు ?
రాజ్యాంగం మనందరికీ సమాంతరమైన హక్కులను ప్రసాదించింది. మతానికీ, ప్రాంతానికీ ఎలాంటి వివక్షా లేకుండా అందరినీ సమానంగా చూడాలని సూచించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఘటనలు పిచ్చివాడి చర్యగా అభివర్ణించి తోసిపుచ్చడం సరైనది కాదు.  దీనిని రాష్ట్ర బిజెపి ఖండిస్తున్నది.
‘ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది.  వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నా కేవలం నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు.  అంతర్వేది ఆలయం రథం విషయం సీరియస్‌గా తీసుకుని, కారకులను కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హిందూ ఆలయాలకు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలి, ఘటనలు జరిగిన తర్వాత విచారించడం, విచారించినట్టు నటించడం బదులు.. ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Dileep Kilaru
అంతర్వేదిలో జరిగిన ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఆయన అనుచరులను ఎలా అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఏమైనా తీవ్రవాదులా?
చర్చిలపై రాళ్లు వేస్తేనే తీవ్రమైన చర్యలు తీసుకునే ఏపీ ప్రభుత్వం, అంతర్వేదిలో రథాన్ని కాల్చిబూడిద చేసినా పట్టనట్టు ఉండడం సరికాదు.
ఈ సంఘటనకు బాధ్యులను తక్షణం పట్టుకుని, వారిని కఠినంగా శిక్షించే వరకూ ఆందోళనలు కొనసాగూతూనే ఉంటుంది.
ఘటన జరిగిన రోజున.. దాన్ని ఓ పిచ్చివాడి చర్యగా చెప్పి, ఆ తర్వాత నిప్పుల కుంపటి అని.. చివరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌గా స్థానిక పోలీసులు ప్రచారం చేశారు. ఆఖరికి తీవ్ర శోధన అనంతరం అంతర్వేది ఘటనకు తేనెతుట్టె కారణం కావొచ్చని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.
జగన్ ప్రభుత్వం ఏడాదిన్నర హయాంలో 15 దేవాలయాలపై దాడులు జరిగాయి. టీడీపీ హయాంలోనూ 17 దేవాలయాలు కూల్చేశారు.  అప్పట్లో ఈ ఘటనపై టీడీపీని ప్రశ్నిస్తే.. రోడ్లు వేయకూడదా అని ఎదురు ప్రశ్న వేసి దబాయింపు ప్రదర్శించారు.
ఇది మతరాజకీయాల కోసం వైసీపీ, టీడీపీ చేస్తున్న కుట్రలాగా కనిపిస్తున్నది. #SAVEAPTEMPLES, #Rejectvotebankpolitics పేరుతో హిందువులంతా ట్వీట్లు చేసి ప్రభుత్వానికి బుద్ధివచ్చేలా చేయాలని ఆందోళన చేయాలి.

 

(దిలీప్ కిలారు, ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత, విజయవాడ)