రాయలసీమ యాసలో ‘ఏమిరా.. అబ్బి.. యాడికి పోయినావు’ అంటూ వెండితెరపై ప్రేక్షకలోకాన్ని మెప్పించారు జయప్రకాష్ రెడ్డి . వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా.. నాటకరంగంలో తనదైన ముద్రవేశారాయన.
గుంటూరులో స్థిరపడిన ఆయన నాటకరంగంపై గల ఆసక్తితో నెలనెలా జేపీస్ పేరిట నాటక ప్రదర్శనలు నిర్వహిస్తూ రంజింపజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో 1946 మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు.
నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది.
అనంతపురం సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివారు. ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, ఏఎల్, బీఎడ్ కళాశాలలో బీఎడ్ చేశారు. గుంటూరు నగరం కొత్తపేటలోని జలగం రామారావు హైస్కూల్ లో గణితం ఉపాధాయుడిగా ఉద్యోగ ప్రస్థానం కొనసాగించారు. 2000 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
తండ్రి వారసత్వంగా నటన అబ్బింది. అనంతరపురంలో చదువుకునే రోజుల్లోనే సాంస్కృతిక ప్రదర్శనలలో పాలుపంచుకున్నారు. గుంటూరు ఏసీ కళాశాలలో చదువుతున్న సమయంలో రత్నరాజు మాస్టర్ రాసిన రాచరికం అనే నాటకంలో ఆడపిల్ల వేషం వేసి ఉత్తమ నటి బహుమతిని కొట్టేశారాయన.
సినీప్రస్థానం..
నల్లగొండలో జయప్రకాష్ రెడ్డి శిష్యుడు జోసఫ్ బాబు ప్రజాపోరు అనే పత్రిక నడిపేవారు. ఆ పత్రిక వార్షికోత్సవానికి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు హాజరయ్యారు. ఆ వేదికపై నాటక ప్రదర్శన చేసిన జయప్రకాష్ రెడ్డి దాసరిని విశేషంగా ఆకర్షించారు. అలా సురేష్ ప్రొడక్షన్స్ వారి దృష్టికి వెళ్లడం జరిగింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఎదుట అన్నపూర్ణ స్టుడియోలో ‘గప్ చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శించగా జయప్రకాష్ రెడ్డి నటనను మెచ్చుకున్న రామానాయుడు బ్రహ్మపుత్రుడు సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత బొబ్బిలిరాజా, ప్రేమఖైదీ… అలా దాదాపు 80 సినిమాల వరకు నటించినా పెద్దగా పేరురాలేదు. దీంతో ఆయన మళ్లీ గుంటూరొచ్చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ వెళ్లిన ఆయన్ను చూసిన రామానాయుడు… ‘ఇన్నాళ్లు ఏమైయైపోయావంటూ’ వెంటనే సురేష్ బాబును కలవమని చెప్పారు. జయంత్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి పలికిన సంభాషణలు సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఆ తర్వాత శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారాయన. రాయలసీమ యాసను పరుచూరి బ్రదర్స్ బాగా ప్రోత్సహించారు. అయినా తనపై ఫ్యాక్షనిస్టు ముద్ర పడకుండా కమెడియన్, తండ్రి పాత్రల్లోనూ మెప్పించారాయన. 300కు పైగా చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో జయప్రకాష్ రెడ్డి రాణించారు. జయం మనదేరా సినిమాకు నంది అవార్డు, నాటకాల్లో ఐదు నందులు అందుకున్నారాయన.
వన్ మ్యాన్ షో..
జయప్రకాష్ రెడ్డి.. హిందీలో అనుపమ్ ఖేర్, షబానా ఆజ్మీ వంటి తారలు 50 నిమిషాలకు పైగా వన్ మ్యాన్ షో చేస్తున్నారని తెలుసుకున్నారు. అంతే తాను కూడా ఆ విధంగా వన్ మ్యాన్ షో చేయాలనే ఉత్సుకత కనబరిచారు. ఆ విధంగా రూపుదిద్దుకున్నదే ‘అలెగ్జాండర్’ నాటకం.
ఇందులో అలెగ్జాండర్ ఒక విశ్రాంత మేజర్. తన టెలిఫోన్ ని హెల్ప్ లైన్ అని పేరు పెట్టి దేశానికి తెలియజేస్తారు. సమస్యలతో ఉన్నవాళ్లు ఫోన్లు చేస్తారు. జయప్రకాష్ రెడ్డి తన పాత్రలో వాయిస్ ఓవర్ ఇస్తారు. అదొక చక్కటి సందేశాత్మక పాత్ర. జయప్రకాష్ రెడ్డి సినిమాల్లోకి వెళ్లాక కూడా వన్ మ్యాన్ షోను వీడలేదు. ఈ పాత్ర ద్వారాను నంది అవార్డు అందుకున్నారు.
సాంబిరెడ్డి, సాంబ్రాజ్యమ్మ దంపతులకు 1946 మే 8న జన్మించిన జయప్రకాష్ రెడ్డికి ఇద్దరు సోదరులు రవీంద్రనాథ్ రెడ్డి , శ్రీనివాస్, ఇద్దరు సోదరీమణులు స్వర్ణలత, నాగరేఖ. జయప్రకాష్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు చంద్రప్రకాష్ రెడ్డి. కుమార్తె శ్రీమల్లిక. స్వస్థలం గుంటూరు జిల్లా కొల్లిపర. నివాసం గుంటూరు విద్యానగర్.
ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన జయప్రకాష్ రెడ్డి నాటకరంగంలోనూ, సినిమా రంగంలో వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించారు. ఈ రోజు (8-9-2020) ఉదయం హఠాన్మరణం పొందిన జయప్రకాష్ రెడ్డి నాటక, సినీరంగాల్లో తనదైన ముద్రవేసి ప్రేక్షక లోకంలో వన్ మ్యాన్ గా చిరస్థాయిగా గుర్తుండిపోతారు.
-అవ్వారు శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు,గుంటూరు)