(నేడు పి భానుమతి జయంతి)
(CS Saleem Basha)
తెలుగు, తమిళ సినిమా రంగాల్లో తన ప్రతిభాపాఠవాలతో చెరగని ముద్ర వేసి, దక్షిణ భారత చలన చిత్ర సీమలో మొట్టమొదటి “సూపర్ స్టార్” గా పేరుపొందిన భానుమతీ రామకృష్ణ జయంతి సందర్భంగా(సెప్టెంబర్ 7, 1925) ఆమె జీవిత విశేషాలు కొన్ని ప్రస్తావించడం, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి కి మనం ఇవ్వగల గౌరవం.
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ఆత్మగౌరవానికి(అహం అని కొంతమంది అనుకున్నప్పటికీ), ధైర్యానికి భానుమతి ప్రతీక. దేనికీ ఎవరికీ భయపడని ఆమె మనస్తత్వం ఆ కాలం హీరోయిన్ లకు ఒక స్ఫూర్తి!
దక్షిణ భారత చలనచిత్ర రంగంలోని వారు ఆమెను ” అష్టావధాని” అంటారు. ఎందుకంటే ఆమె వివిధ రంగాలలో నిష్ణాతురాలు. నటిగా గా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, ఎడిటర్ గా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో యజమానిగా ఆమె తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఏది చేసినా ఏం చేసినా భానుమతి భానుమతే అని అందరూ చెప్పుకునే విధంగా ఆమె జీవితం మొత్తం ఉండింది. ఏ రంగంలోనైనా ఆమె తన మార్కును చూపడం భానుమతి multi-faceted పర్సనాలిటీకి నిదర్శనం.
భానుమతికి ఆత్మవిశ్వాసం తో పాటు, ఆత్మ గౌరవం కూడా చాలా ఎక్కువే. దాన్ని చాలామంది పొగరు గా పొరబడినప్పటికీ ఆమె తన పంథాను ఏ మాత్రం మార్చకోలేదు. ప్రముఖ నిర్మాత చక్రపాణి తో ఆమె కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దాంతో ఆమె మిస్సమ్మ సినిమా నుంచి తప్పుకుంది. మిస్సమ్మ సినిమా హిట్ అయిన తర్వాత ” ఒక మంచి పాత్రను నేను పోగొట్టుకున్నాను, కానీ సినిమా పరిశ్రమకు సావిత్రి లాంటి మంచి నటి దొరికింది” అని చెప్పడం భానుమతి కే చెల్లింది.
ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం ఆమె నైజం. అలాగే అంతస్తులు సినిమా కోసం వి.బి.రాజేంద్రప్రసాద్ ఆమెను సంప్రదిస్తే నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించడం కూడా ఆమె ధైర్యానికి నిదర్శనం. ఆ సినిమా కోసం హైదరాబాద్ లో హోటల్ రూమ్ బుక్ చేస్తే, డబ్బులు దండగా నేను సారథి స్టూడియో లోనే ఉంటాను అని చెప్పడం, నిర్మాతల పట్ల ఆమె దృక్పథానికి సూచిక.
అంతేకాకుండా స్టూడియోలో సరైన వసతులు లేనందువల్ల ఆమె ఇబ్బంది పడినప్పటికీ షూటింగ్ కు ఏమాత్రం అంతరాయం కలగకుండా సినిమాలు పూర్తి చేయడం ఆమె కమిట్ మెంట్ ను తెలియపరుస్తుంది.
13 ఏళ్ల వయసులో ఆమె సినిమా రంగంలో కాలు పెట్టింది. వరవిక్రయం సినిమాలో ఆమె కాళింది పాత్రలో నటించింది. 13 ఏళ్ల అమ్మాయి ఒక వృద్ధుడిని వివాహం చేసుకుని న న తర్వాత ఆత్మహత్య చేసుకునే పాత్ర అది. అలాంటి పాత్రను ఒప్పుకోవటం ఆమె మనస్తత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది. పద్దెనిమిదేళ్ల వయసులో రామకృష్ణారావును పెళ్లి చేసుకోవడం కూడా ఒక సంచలనమే. కృష్ణ ప్రేమ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణారావు ను పెళ్లి చేసుకోమని అడగడమే ఒక సంచలనం. ఎందుకంటే భానుమతికి అప్పటికే నటిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మొదట్లో రామకృష్ణారావు సందేహించినా చివరకు ఒప్పుకున్నాడు.
పెళ్లయిన తర్వాత భానుమతి సినిమాలో నటించడానికి అయిష్టత చూపినప్పటికీ, దర్శకుడు బి.యన్.రెడ్డి పట్ల ఉన్న గౌరవం తో, ఆయన స్వర్గసీమ(1945) సినిమాలో నటించింది. ప్రముఖ రచయిత బెర్నాడ్ షా “Pygmalion” నాటిక ఆధారంగా తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో భానుమతి పాడిన ” ఓహో హో పావురమా” ఒక సంచలనం సృష్టించడమే కాకుండా భానుమతి గాత్రం సినిమా రంగానికి పరిచయం అయింది. ఆ పాట ఒక స్పానిష్ ట్యూన్ ఆధారంగా కంపోజ్ చేయడం ఒక విశేషం. ఆ సినిమాకు బాలాంత్రపు రజనీకాంతరావు, చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు సంగీత దర్శకులు! స్వర్గసీమ సినిమాను ఆ పాట కోసమే 30 సార్లు చూశానని శివాజీ గణేషన్ భానుమతితో చెప్పడం మరో విశేషం. అదే సంవత్సరం ఆమె కు కుమారుడు భరణి కి పుట్టాడు.
స్వర్గసీమ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆమె ఒక్క సినిమాకు 25 వేల రూపాయలు పారితోషికంగా తీసుకునేది. మొత్తం సినిమా నిర్మాణంలో అది 50%!! అప్పుడే భానుమతి తన భర్త కోసం ” భరణి” స్టూడియో నిర్మించి లైలా మజ్ను, విప్ల నారాయణ లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలు తీసింది. విప్రనారాయణ జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు పొందింది. మల్లీశ్వరి సినిమా ఆల్ టైం తెలుగు క్లాసిక్ సినిమా. ఆ సినిమా ఎన్టీ రామారావు లాంచింగ్ ప్యాడ్. భానుమతి నటన, పాటలు మర్చిపోలేం.
60 ఏళ్ల నట జీవితంలో భానుమతి తెలుగు తమిళ హిందీ సినిమాలతో కలిపి దాదాపు 100 సినిమాల్లో నటించింది. 1953 లో చండీరాణి సినిమా న మూడు భాషల్లో ఏకకాలంలో తీసి మొట్టమొదటి మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించింది.
తన “అత్తగారి కథలు” ఆమెను ఓ రచయిత్రిగా గొప్ప స్థానం ఇచ్చాయి. ఆ కథలకూ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 1994 లో ” నాలో నేను” అనే తన జీవిత చరిత్ర కి జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా విశేషం.
భానుమతి అందుకున్న అవార్డులు సత్కారాలు గురించి రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. 1963 పద్మశ్రీ పొందిన మొట్టమొదటి దక్షిణాది నటి భానుమతి. 2003 లో పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకుంది. వంద సంవత్సరాల భారతీయ సినిమా చరిత్ర ను పురస్కరించుకొని, భారతదేశ తపాలా శాఖ ఆమె మీద 5 రూపాయల స్టాంపును విడుదల చేయడం ఆమెకు లభించిన గౌరవం!
రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల కమిటీ లో సభ్యురాలిగా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి విజిటింగ్ ప్రొఫెసర్ గా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ లో సభ్యురాలిగా ఆమె ఉండటం ఆమెకు లభించిన గౌరవం. అన్నాదురై ద్వారా “నడిప్పుక్కు ఇలక్కణం”(నటనకు వ్యాకరణం) బిరుదు లభించడం ఆమె బహుముఖ ప్రజ్ఞకు దక్కిన గౌరవం. 1985 లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1987 లో లో ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య అవార్డు, ఆమె బహుముఖ నటనా కిరీటంలో కలికితురాయి లు!
అన్ని రంగాల్లో తనదైన ముద్ర అని చూపించిన “పులువాయి భానుమతి రామకృష్ణ”, ఎనిమిది పదుల వయసులో 2005, డిసెంబర్ 24వ తేదీ ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)