నా హైస్కూల్ ఉన్నతం… గురువులు మహోన్నతులు

(చందమూరి నరసింహారెడ్డి)
నేను చదువు కొన్న  ఉన్నత పాఠశాల నా దృష్టిలో ఉన్నతమైనది . అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం శిద్దరాంపురం నా ఊరు. ఓనమాలు దిద్దుకొని 10వతరగతి వరకు నా సొంత ఊర్లో నే చదువుకొన్నా. ఆనాటి మధరసృతులు , జ్ఞాపకాలు మరువలేనివి. ఆ పాఠశాల, అక్కడి ఉపాధ్యాయులు ఎపుడూ మరిచిపోలేని అనుభవం.
పొద్దున్నే లేవడం బొగ్గులు ఉప్పు వేసి నున్నటి పొడిగా నూరిపెట్టిన ‘టూత్ పౌడర్’ తో పళ్ళు తోముకోవడం (తరవాత కొంతకాలానికి జెమిని పొళ్ళపొడి వచ్చిందిలేండి) ఒక లోటకు కాఫీ తాగడం బుక్కుల బ్యాగ్ తగిలించుకొని పూజారోళ్ల సందులో హనుమంతరావు అయ్యవారి ట్యూషన్ కు పరిగెత్తడం నేనెలా మర్చిపోతాను.
పొద్దునే  8-30కి ఇంటికి రావడం కాలే కాలే సంగటి తిని టైం టేబుల్ చూసుకొని బుక్కుల బ్యాగ్ తిత్తి లో ఎసుకొని తెల్లంగి కాకినిక్కరు తొడుకొని 9 గంటలకు ఊరి చివర బుడ్డపరమాను దగ్గర ఉండే హైస్కూలు కు పోయేవాళ్లం. ఇదెలా మర్చిపోతాను.
గూనిపల్లి ,ధూపంపల్లి, చండ్రాయునిపల్లి ,తరుగొండ్లపల్లి, లింగప్పగారిపల్లి , కొట్టాలపల్లి నుంచి కొంతమంది సైకిళ్లపైన వచ్చేవాళ్ళు. చానామంది నడుచుకొంటా పరిగెత్తుతా వచ్చేవాళ్ళు. స్కూల్ గ్రౌండ్ లో ఆడుకొంటా ఎగురుకొంటా ఆనందంగా ఉండేవాళ్లం.

 

ఉ.9.20 కి చౌడన్న ఫస్ట్ బెల్ కొడతానే అందరూ  గుంపులు గుంపులుగా పరిగెత్తి పోయి  స్కూల్ ఆవరణలో పడిన చెత్తా ,ఆకులు ఏరి స్కూల్ ఎదురుగ్గా ఉండే గుంతలో ఏసేవాళ్లం .
10నిమిషాల కు సెకండ్ బెల్ కొడతానే స్కూల్ గేట్ బంద్. లోపలండే వాళ్లంతా ప్రార్థన కోసం తరగతి వారిగా నిలబడేవాళ్ళం . లైన్ కు 10మంది అట్ల వరసగా నిలబడే వాళ్ళం. ప్రతి తరగతి వాళ్లముందు క్లాస్ లీడర్(సి.పి.యల్) నిలబడతాడు. పిల్లోళ్ల వెనక అయ్యవార్లు నిలబడతాండ్రి. స్కూల్ పిల్లలకు అందరికీ ఒక యస్.పి.యల్ ఉండేవారు. ఆయప్ప పోయి హెడ్ మాస్టర్ ను పిల్చకచ్చి గౌరవ వందనం చేసి జండా ఎగరేపిచ్చేవారు.
సిపియల్ వాల్ల తరగతి నుంచి ఎంతమంది వచ్చినారని రిపోర్ట్ చేసేవాడు. తరవాత ప్రార్థన జరిగేది. ప్రతిరోజూ ఇదే తంతు. ప్రార్థన కు రాకుండా లేటుగా వచ్చినొళ్లకు డ్రిల్ అయ్యవారు రెండు దెబ్బలు జవురుత్యాండ.
క్లాసులు 10గంటలకు మొదలైతాండే. 40నిమిషాలు ఒకొక్క పిరియడ్ .పిరియడ్ కాగానే చౌడన్న బెల్ కొడతాడు. రెండు పిరియడ్లు జరగ్గానే 11.20 నుంచి 11.40 వరకు ఇంటర్వెల్ బెల్ కొడతాండ్రి. 11.40నుంచి 12.20 వరకు థర్డ్ పిరియడ్ 12.20నుంచి 1గంటవరకు ఫోర్త్ పిరియడ్ కాగానే భోజనం కు వదిలేసేవారు.
మేము ఊర్లోకిపొయి మధ్యాహ్నం సంగటి తిని వచ్చేవాళ్లం. చుట్టుపక్కల ఊర్లనుండి వచ్చిన వాళ్ళు క్యారియర్ లో భోజనం తెచ్చుకునేవారు. స్కూల్ చుట్టుపక్కల ఉన్న బావి దగ్గరికి వెళ్లి తిని వచ్చేవాళ్ళు.
రెండు గంటలకు మళ్లీ బెల్ కొడితే క్లాసులు ప్రారంభం. 2 నుంచి 2:40 వరకు ఐదోపిరియడ్ 2.40 నుంచి 3.20వరకు ఆరో పిరియడ్ 3.20 నుంచి 3.40 వరకు ఇంటర్వేల్ 3.40నుంచి 4.30వరకు ఏడో పిరియడ్ ఉండేది. ఇలా స్కూల్ జీవనం సాగిపోయింది.
ప్రతి గురువారం ఆఖరి పిరియడ్ అన్ని క్లాసులు కు యల్. ఏ(లిటరరీ అసోసియేషన్) పిరియడ్ ఉండేది. 6తరగతి నుంచి 10వతరగతి వరకు ఉండే వారంతా ఒకచోట చేరి ఎదో ఒక అంశంపై(ప్రసంగం) మాట్లాడాలి . వ్యాసరచన పోటీలు ఉండేవి. డ్రిల్ పిరియడ్ ఉండేది.
మా డ్రిల్ టీచర్ ఆదినారాయణప్ప ఖో ఖో ,సాఫ్ట్బాల్ , క్రికెట్ , బ్యాడ్ మింటన్ ఆడించేవారు. ఆడపిల్లల కు రింగ్ ఆట ,ఖోఖో , తాడాట ఆడించెవారు. ఆ ఆట పాటలు అల్లరి ,ఆనందం మరువలేనివి. మధురమైనవి.
ఈ స్కూల్ జీవితంలో అయ్యవార్లు ఆనాడు చెప్పిన విద్యాబుద్ధులు అపూర్వమైనవి. ఆనాడు సార్లకు ఇప్పటి లాగ వేరే వ్యాసంగాలుండేవి కాదు. ఇద్దరు ముగ్గురు అయ్యవార్లు పక్కన ఊర్లనుంచి వచ్చేవారు మిగిలిన సార్లు మా ఊర్లో నే ఉండేవారు.
చదువు తప్ప వేరేద్యాస ఉండేది కాదు. స్కూల్ టైం అయిపొయిన పిల్లోలు బజారులో అయ్యవారికి కనపడేవాళ్లం కాదు. దాముకొని వెళ్లేవాళ్లం.
నా గురువులకు పాదాభివందనం.నాకు చదువు నేర్పిన గురువులు తో నాకున్న అనుబంధం ఎంతో మధురమైనది. ఆత్మీయమైనది. నాటి మధుర క్షణాలు తలచుకుంటే ఆనందం కలిగిస్తుంది.
అక్షరాలను దిద్దిచ్చిన గురువులు తరుగుకేశవ రెడ్డి, గురక చెన్నారెడ్డి , శ్యామలాదేవమ్మ మొదటి ఉపాధ్యాయులు.
ఆరో తరగతి చేరాక హనుమంతరావు సార్ వద్దకు టూషన్ కు వెళ్ళెవాన్ని. వీరికి పొలం ఉండేది. సార్ తో పాటు పొలం వద్దకు పోయేవాన్ని. తప్పు చేస్తే కోదడం ఎక్కించేవారు. చదువు లో ఎప్పుడు కోదండం ఎక్కలేదు కాని అల్లరి చేసేవాన్ని.
ఉన్నతపాఠశాలలో తెలుగు మాస్టార్లు రాఘవాచార్యులు , ఆదినారాయణరెడ్డి. శంకరనారాయణ, వెంకటరమణ ,లెక్కలమాస్టార్ బి.టి నారాయణరెడ్డి, సైన్స్ మాస్టర్ గోవింద రెడ్డి, శంకరనారాయణ నాకిష్టమైన గురువులు మరువలేని మరచిపోలేని వారు.
సోషియల్ మాస్టర్ రామచంద్రా రెడ్డి , సైన్స్ టీచర్ బాలసుబ్రహ్మణ్యం ,ప్రధానోపాధ్యాయులు వెంకటరమణప్ప, హిందీ మాస్టర్ బాబయ్య హిందీ టూషన్ మేడం సరళమ్మ. వీరందరూ నాకు బాగా గుర్తున్న ఉపాధ్యాయులు.
వీరితో ప్రతి ఒక్కరితో ఎన్నో గుర్తుండిపోయే జ్ఞాపకాలన్నాయి. ఆనాడు వారందించిన జ్ఞానం నేడు నా జీవితం నడిపించడానికి ఎంతో దోహదం చేస్తున్నది. గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
వీరిలో కొందరు గురువులు పరమపదించారు. వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
పాఠశాలలో ఆనాడు చెట్లకింద , బోదకొట్టాలు లో చదువు కొన్నాం .నేడు మంచి గదులున్నాయి. పాఠశాల పూర్వవిద్యార్థులు సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ స్కూల్ తరహా లో తీర్చిదిద్దడం జరిగింది.
ఇదే స్కూల్ లో చదువుకొని ఉపాధ్యాయులైన చెన్నక్రిష్ణారెడ్డి చొరవ తీసుకొని పూర్వవిద్యార్థుల సంఘం నడిపిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ , ప్రతి క్లాస్ రూంలో టైల్స్ , విద్యుత్ సరఫరా , కంప్యూటర్స్ , మీటింగ్ హాల్ ఇలా నేడు అనేక సౌకర్యాలు తో అభివృద్ధి దిశలో ,మంచి ఫలితాలు సాధనలోను ప్రగతి పథంలో ఉన్నందుకు ఆనందంగా ఉంది.
Chandamuri Narasimhareddy
(చందమూరి సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)