తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఐదు రోజుల క్రితం అనగా తేదీ 31-08-2020 నాడు విడుదల చేసిన జీవో ఎంయెస్ 131 ద్వారా నూతన లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (LRS) ప్రవేశపెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు అశాస్త్రీయమని, అత్యంత లోప భూయిష్టమని ఎఐసిసి కాార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భూ క్రమబద్దీకరణ పథకం కేవలం ఖజానా నింపడానికి , ధనార్జనే ధ్యేయంగా చేపడుతున్న కార్యక్రమం లని ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు.
లోపభూయిష్టమయిన ఈవిధానాన్ని సవరించాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రతి పక్షాలతో చర్చించి చట్టబద్దమైన, శాస్త్రీయమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సహేతుక విధానాలను ప్రవేశ పెట్టాలని వంశీచంద్ డిమాండ్ చేశారు.
కరోనా అంటువ్యాధి నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు వ్యాపారాలు లేక, పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటూ ఆర్ధిక-ఆరోగ్య జీవన పరిస్థితులు చిన్నా భిన్న మై ఉన్న ప్రజలకు ఉపశమన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఇలా ఖజానా నింపుకునేందుకు పూను కోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన లే అవుట్ క్రమబద్దీకరణ పథకం పై ఆదిలోనే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం గుర్తు చేస్తూ సామాన్యులు సైతం ఈ నూతన పథకంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అనడానికి ఇది నిదర్శనం వంశీ అన్నారు.
ఇది ఖజానా, సంపద ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికేనని, ఈ కుట్రను గమనించి యావత్తు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.
ఇంత స్వల్ప కాల పరిధిలో తాజా భూ క్రమబద్దీకరణ పథకం పై లోటుపాట్లను వాటి వివరాలను, ప్రజల భయాందోళనలు చర్చనీయాంశం చేయడం తమకు ముఖ్యం కాదని ప్రజలు ఆందోళన తీవ్రరూపం దాల్చక ముందే కెసిఆర్ సర్కారు ఈ విధానాన్ని మెరుగుపర్చాలని కోరారు.