అది రామవరప్పాడు నుండి రైల్వే స్టేషనుకు వెళ్ళే బి.ఆర్.టి.ఎస్.రోడ్డు. రోడ్డు మధ్యలో వాహనాల రాక పోకలను నిషేధించిన(ప్రస్తుతానికి) పెద్ద రోడ్డు నిర్మించబడి ఉన్నది. ఆ రోడ్డులో చాలా మంది “మార్నింగ్ వాక్” చేస్తుంటారు. నేను రోజూ ఆ మార్గంలోనే “మార్నింగ్ వాక్”కు వెళుతుంటాను.
ప్రకాశం బ్యారేజీ నుండి సాగు నీటిని సరఫరా చేసే ఏలూరు కాలువ అటువైపుగానే వెళుతుంది. ఆ కాలువపై వంతెన నిర్మించబడి ఉన్నది. అక్కడ రోడ్డు ప్రక్కనున్న ఖాళీ స్థలంలో మూడు, నాలుగు బండ్లపై వస్తువులు పెట్టుకొని అమ్ముకొనే చిరు వ్యాపారులున్నారు.
నాలుగైదు రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్రొత్త వ్యక్తి పది, పదిహేను జతల చెప్పులను రోడ్డు మీద పరచిన తివాచీపై ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని, ఎవరైనా వస్తారా కొనుక్కోవడానికి అన్నట్లు బిక్కమొహంతో వేచి చూస్తున్నాడు. నాకెందుకో చూడగానే చెప్పులు కొనుక్కొందామా! అన్న ఆలోచన వచ్చింది. కానీ, మరొక రోజు చూద్ధాంలే అన్న భావనతో వచ్చేశాను.
మరుసటి రోజు దినపత్రికలో వార్త చదివినప్పుడు మనసు నొచ్చుకొన్నది. ఆ రోజు “వాకింగ్”కు వెళ్ళినప్పుడు పలకరిద్దామని చూస్తే, అతను అక్కడ లేడు. జిల్లా కలెక్టర్ అప్పటికే స్పందించారు కాబట్టి, బహుశా ప్రత్యామ్నాయంగా ఏదైనా తోడ్పాటు అందించారో! లేదా! పత్రికల్లో వార్త ప్రచురించబడింది కాబట్టి నూనతాభావంతో ఆ స్థలం నుండి మరొక చోటికి ఆ వ్యక్తి తరలివెళ్ళారో! తెలియదు.
చెప్పులు అమ్ముకొని జీవనం సాగించడమన్నది అవమానకరమైనది కాదు. అందులోను విజయవాడలో చెప్పుల తయారీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈనాడు అది చాలా లాభసాటి వ్యాపారం కూడా. కాకపోతే, పదిహేను సంవత్సరాల పాటు ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేసిన విద్యావంతుడు కరోనా మహమ్మారి పర్యవసానంగా ఉపాథికోల్పోయి, రోడ్డున పడి, చెప్పులు అమ్ముకోవాల్సిన దుస్థితిలోకి నెట్టబడడమే బాధాకరమైన పరిణామం.
కరోనా పర్యవసానంగా ఉపాథి కోల్పోయిన వారికి సామాజిక భద్రత కల్పించి ఆదుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించక పోవడం దుర్మార్గం. సంపద సృష్టిలో, సామాజికాభివృద్ధిలో భాగస్వాములైన శ్రమజీవులు, బుద్ధిజీవులకు ఈ వ్యవస్థలో ఉపాథి భద్రత, సామాజిక భద్రత లేదు.
ఈ నేపథ్యంలోనే మరొక వైపు అశాస్త్రీయ భావజాలాన్ని, మూఢనమ్మకాలను, ఛాందస భావాలను, మత విశ్వాసాలను పెంపొందించే పాస్టర్లు, ఇమాంలు, పూజారులకు మాత్రం నెలవారి గౌరవ వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించడానికి మాత్రం ప్రజాధనాన్ని ప్రభుత్వం స్వేచ్ఛగా ఖర్చు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.