(CS Saleem Basha)
1960-70 మధ్యకాలంలో “సాధనా కటింగ్” అంటే తెలియని కన్నెపిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు. అది అమ్మాయిల్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే చాలామంది అలాంటి కటింగ్ ని చేయించుకున్నారు. ఒక దశాబ్దం పాటు ఎన్నో హిట్ సినిమాల్లో తన అందంతో, నటనతో, హెయిర్ కటింగ్ తో ప్రేక్షకులను, అమ్మాయిలను ఉర్రూతలూగించి, ఐదేళ్ల క్రితం మనల్ని వదిలి వెళ్ళి పోయిన ” సాధనా శివదాసాని” జయంతి ఈరోజు.
సాధన హెయిర్ కటింగ్ వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అప్పట్లో నుదుటి మీదికి జుట్టు చివర్లను అలా వదిలేయడాన్ని”fringe haircut” అనేవాళ్ళు. చాలా మంది సాధనను చూసి ఆ కటింగ్ చేయించుకుంటే, ఈసాధనకు ఈ కటింగ్ చేయించడానికి కారణం ప్రముఖ హాలీవుడ్ (బ్రిటీష్) నటి Audrey Hepburn! ఆమె హెయిర్ కట్ అలా ఉండేది.
ఆ విధంగా Audrey Hepburn తో ప్రభావితమై తో ప్రభావితమై సాధన హెయిర్ కటింగ్ మార్చబడి తే, ఆమెను చూసి చాలామంది అమ్మాయిలు తమ హెయిర్ కట్ మార్చుకున్నారు, కొంతమందికి మార్చబడింది . అలా హెయిర్ కట్ మార్చబడిన అమ్మాయిల్లో మా చెల్లెలు కూడా ఉంది.
( కాకపోతే 2 సంవత్సరాల వయసులో, పై ఫోటోలో కుడిచివర ) 1963 లో మా ఇంట్లో కూడా మా చెల్లికి సాధనా కటింగ్ జరిగింది.
మా అమ్మకి సాధన అంటే చాలా ఇష్టం. ఆమె పాట ” లగ్ జా గలే” ను మా అమ్మ తరచూ హమ్ చేసేది! సాధన సినిమాలు చూసిన మా అమ్మ, మా చెల్లికి స్వయంగా తనే సాధన కటింగ్ చేసింది . అప్పట్లో ఆడపిల్లలకి జడ వేయాలన్న, జుట్టు కత్తిరించాలి అన్నా అమ్మనో, పెద్దక్క పెద్దక్క నో చేసేవాళ్ళు.
1960 లో హీరోయిన్ గా తన మొదటి సినిమా “లవ్ ఇన్ సిమ్లా”. అప్పటి ప్రముఖ నిర్మాత ముఖర్జీ తన కుమారుడు జాయ్ ముఖర్జీ హీరోగా ఆ సినిమా తీశాడు. దర్శకుడు ఆర్.కె. నయ్యర్
“నీ నుదురు విశాలంగా ఉంది, దానికి కొంచెం తగ్గించాలంటే (Audrey Hepburn లాగా) నుదురు మీదుగా కొన్ని వెంట్రుకలు అలా వదిలేస్తే, నుదురు చిన్నదిగా ఉంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది అని” ఇచ్చిన సలహానే ఈసాధన కటింగ్ కి దారి తీసింది. ఈ సినిమా (షూటింగ్ సందర్భంగా) దర్శకుడు నయ్యర్, సాధన మధ్య ప్రేమ పుట్టి, పెళ్లికి దారి తీయటం ఒక విశేషం. లవ్ ఇన్ సిమ్లా, అలా తన పేరును సార్ధకం చేసుకుంది.
సాధన ఒక ఒక సింధీ కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రుల ఒకటే కూతురు కావడం వల్ల, ఆమెని గారాబంగానే పెంచారు. నటి బబిత తండ్రి, సాధన తండ్రి అన్నదమ్ములు. సాధన కుటుంబం కరాచీ లో ఉండేది. విభజన సమయంలో ఆ కుటుంబం ముంబై చేరింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కూడా సాధన రోజుకు రెండు సినిమాలు చూసేది.అలా సాధనకు సినిమా యాక్టర్ కావాలనే కోరిక కలిగింది.
హిందీ సినిమా రంగంలో ఆమె మేకప్ వేసుకున్న మొదటి సినిమా రాజ్ కపూర్ Shree 420. అందులో ” ముడ్ ముడ్ కే న దేఖ్ ” పాటలో కోరస్ డాన్సర్ గా నటించింది. తర్వాత 1958 లో ” అబ్బన” ఒక సింధీ సినిమాలో హీరోయిన్ షీలా రమణికి చెల్లెలిగా నటించింది. ఆమె షీలా రమణిని ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ” ఎప్పుడో ఒకసారి నేను నీ ఆటోగ్రాఫ్ కోసం వస్తాను” అని రమణి చెప్పింది. 1960లో హీరోయిన్ గా నటించిన ” లవ్ ఇన్ సిమ్లా ” ఆమె రీలు జీవితాన్ని, రియల్ జీవితాన్ని కూడా మార్చేసింది.
1960 వ శతాబ్దం బాలీవుడ్ లో గోల్డెన్ ఎరా గా ప్రసిద్ధి చెందింది. అందుకు సాధన కూడా ఒక కారణం. సాధన 1969 – 70 మధ్యలో అప్పట్లో పాపులర్ అయిన హీరోలందరితో నటించింది. 1961 దేవానంద్ హీరోగా వచ్చిన “హం దోనో” సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత రాజేంద్ర కుమార్ తో “మేరే మెహబూబ్” సినిమా సూపర్ హిట్ అయింది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన “ఆర్జూ” సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. అలా దశాబ్దం పాటు సాధన బాలీవుడ్ లో ఒక స్టార్ గా వెలిగింది.
1963లో వచ్చిన ” మేరే మెహబూబ్” సినిమా లో రాజేంద్ర కుమార్ మొదటిసారి సాధనను కలిసినప్పుడు బురఖా లోంచి ఆమె కళ్ళను మాత్రమే చూసే సన్నివేశం హిందీ సినిమాల్లో ఒక మరపురాని సన్నివేశం గా చెప్పుకుంటారు . ప్రతినాయక పాత్రలు వేసే Danny Denzongpa ఈ సన్నివేశం చూసి ఫిదా అయిపోయాడు. ఈ సన్నివేశం దర్శకుడు హెచ్ ఎస్ రవైల్ దర్శకత్వ ప్రతిభ కు సాధన అందానికి ఉదాహరణలు.
ఆమెకు మిస్టరీ గర్ల్ అని పేరు. దీనికి కారణం దర్శకుడు రాజ్ ఖోస్లా తీసిన మూడు సస్పెన్స్ థ్రిల్లర్ లు “ఓ కౌన్ థీ’, “మేరా సాయ”, “అనిత” లలో ఆమె నటించడమే. ఆ మూడు సినిమాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. “ఓ కౌన్ థీ’, మేరా సాయ సినిమాల్లో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. మేరా సాయ సినిమా లో “ఝుంకా గిరారే బరేలీకి బాజార్ మే” పాట చాలా పాపులర్ అయింది.
ఓ కౌన్ థీ’లో ” లగ్ జా గలే” పాట గురించి చెప్పనవసరం లేదు. ఆ పాటలో అదీ బ్లాక్ అండ్ వైట్ లో సాధన హెయిర్ కట్ తో పాటు, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ బోస్టన్లో చికిత్స పొందిన తర్వాత ఆమె కొన్ని సినిమాలు మాత్రమే చేయగలిగింది.1974 లో గీతా మేరా నామ్ సినిమాను తన దర్శకత్వంలో నిర్మించింది. తర్వాత సినిమా రంగం నుంచి తప్పుకుంది. 1995 లో భర్త ఆర్.కే.నయ్యర్ చనిపోయిన తర్వాత పూర్తిగా వంటరి అయిపోయింది. కోర్టు కేసులు అనారోగ్యం ఆమెను మరింతగా కృంగదీశాయి. 2015 క్రిస్మస్ పండుగ రోజు ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుంది.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)