మంచిర్యాల్ పట్టణం తెలంగాణ గ్యాంబ్లింగ్ క్యాపిటల్ అవుతూఉందా? నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే, కొత్తగా జిల్లా అయినా మంచిర్యాల లో కొంత మంది తొందరగా, రాత్రికి రాత్రి ‘పెద్దవాళ్లు’ అయిపోవాలనుకుంటున్నారు. దీనికొక మార్గం కనిపెట్టారు. అదే గ్యాంబ్లింగ్.
దీనితో కొత్త జిల్లా మంచిపేరు తెచ్చుకోవడానికి బదులు ఉన్న మంచిపేరు పొగొట్టుకునే పరిస్థితి వచ్చింది.
తెలంగాణలో మొదటి గ్యాంబ్లింగ్ హబ్ ఇదేనా?
తెలంగాణ లో గ్యాంబ్లింగ్ ఉన్నమాట నిజమే, గాని కోస్తాంధ్రలో లాగా గ్యాంబ్లింగ్ హబ్ ఇక్కడ లేదు.తెలంగాణలో ఏ పట్టణానికి గ్యాంబ్లింగ్ హబ్ అనే పేరు లేదు. ఇపుడు మంచిర్యాల ఆ ‘లోటు’ తీరుస్తున్నాదా అని ఆందోళన కలిగించే వార్తలొస్తున్నాయి. ఆందోళన ఎందుకంటే, గ్యాంబ్లింగ్ వెంటే మరిన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. గ్యాంబ్లింగ్ లో ఆడేవాళ్లకంటే ఆడించే వాళ్లకు మాంచి లాభాలుంటాయి. దీనితో మన పొరుగు రాష్ట్రంలో మహిళలు కూడా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ఉండటం బయటపడింది. 2019 నవంబర్ లో ఆంధ్ర రాజధాని ప్రాంతం తాడే పల్లిలో ఏంజరిగిందో తెలుసా? తాడే పల్లి అనగానే అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్లు గుర్తుకొస్తుందికదూ. అవును, నిజమే, ఆయన నివాసం పక్కనున్న పట్టాభిరామయ్య నగర్ లో పోలీసుల ఒక గ్యాంబ్లింగ్ డెన్ మీద రెయిడ్ చేసి అవాక్కయిపోయారు. ఎందుకో తెలుసా? అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నదని మహిళలు. ఎనిమిది మహిళలను అరెస్టు చేసి రు.1.3 లక్షలు స్వాదీనంచేసుకున్నారని టైమ్స్ ఆప్ ఇండియా రాసింది. ఇది మొదటి సారి కాదని, గతంలో మహిళలను నిర్వహించే మూడు గ్యాంబ్లింగ్ కేంద్రాలను తాడేపల్లి లోనే చేధించామని పోలీసులు చెప్పారు.
అయితే, ఇపుడిలాగా మంచిర్యాల్ కూడా పెద్ద గ్యాంబ్లింగ్ హబ్ అయిపోయిందని వార్తలొస్తున్నాయి. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం, మంచిర్యాల్ పట్టణం తెలంగాణ జూద గాళ్లనే కాదు,ఛత్తీష్ గడ్, మహారాష్ట్ర జూదగాళ్లను కూడా అకట్టుకుంటూ ఉంది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే జాదగాళ్ల, మంచిర్యాల జూదానికి మంచిగా ఉందని, సేఫ్ అని, జూదగృహాలు చక్కటి వసతులు కల్పిస్తున్నారని నమ్ముతున్నారు.దీనితో మంచిర్యాల్ జూద మార్కెట్ నూరు కోట్ల దాకా పెరిగిందని తెలంగాణ టుడే పత్రిక రాసింది. ఎవరో రాస్తే అనుమానించ వచ్చు. ఏకంగా, కేవలం అభివృద్ధి వార్తలు రాసే ఈ పత్రిక రాసిందంటే ఆలోచించాల్సిందే.
జూదం ఏలా నిర్వహిస్తున్నారు?
ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అతిధి జూదగాళ్లు వస్తున్నారు కాబట్టి వాళ్లకు ఏలోటు లేకుండా చూసుకుంటూ పట్టణంలో జూదగృహాలు నిర్వహిస్తున్నారు, హైటెక్ సిటి కాలనీ లతో పాటు, పట్ణణంలో మంచి పేరున్న కాలనీలలో ఫ్లాట్స్ , ఇళ్లు అద్దెకు తీసుకుని అనుమానం రాకుండా సంసార పక్షంగా జూదాన్ని నిర్వహిస్తున్నారని ఈ పత్రిక రాసింది. ఇతర రాష్ట్రాలనుంచి జూదమాడేందుకు వచ్చే వాళ్లకు ఇక్కడ విలాసవంతమయిన వసతి ఏర్పాటుచేస్తున్నారు. మందు విందు ఇస్తున్నారు. రవాణా సదుపాయం కూడాకల్గిస్తున్నారు. అంతేకాదు, చుట్టుపక్కల అక్కడక్కడ నిఘా కూడాపెట్టి పోలీసులెవరూ అటువైపు రాకుండా గమనిస్తూన్నారు. ఈ ఏర్పాట్లు చేసినందుకు అతిధి హోదా ను బట్టి వేయినుంచి ఐదు వేల రుపాయల దాకా వసూలు చేస్తారు. దీనితో నగరానికి గ్యాంబ్లింగ్ వచ్చే వాళ్లంతా మంచిర్యాల్ మస్తు సేఫ్ అని భావం కలిగేలా చేస్తున్నారట.
ఫైనాన్స్ కూడా ఎరేంజ్ చేస్తున్నారు
జూదగాళ్ల హబ్ గా మారిపోవడం తో పట్టణంలో ఫైనాన్స్ బిజినెస్ కూడా వూపందుకుంది. ఇన్ స్టంట్ లోన్ వసతి ఏర్పాటుచేశారు. అప్పటికపుడు జూదానికి ఫైనాన్స్ చేస్తున్నారు. కాకపోతే, వడ్డీ మాత్రం మోపుడుంటుంది. పూటకి లక్షకి పది వేలరుపాయల దాకా ఉంటుంది. పైనాన్స్ కూడా ఈజీగా దొరుకుతుంది. వచ్చే వాళ్లంతా చాలా దూరాన్నుంచి వస్తున్నారు కాబట్టి వాహనాల్లోనే వస్తారు. సింపుల్. వెహికిల్ డాక్యుమెంట్లు తాకట్టుపెడితే చాలు గ్యాంబ్లింగ్ లోన్ దొరుకుతుంది. అడవచ్చు,పాడవచ్చు, జల్సా చేసుకోవచ్చు. అంతా సేఫ్.
లాక్ డౌన్ లో భలేమంచి బిజినెస్
తెలంగాణ టుడే పత్రిక అందిసున్న వివరాలుఅసక్తికరంగా ఉన్నాయి. వీటిని బట్టి చూస్తేలాక్ డౌన్ లో దేశంలో ఏకానమీ పాడయినా గ్యాంబ్లింగ్ బాగానే నడుస్తున్నదని పిస్తుంది.
మంచిర్యాల్ హైటెక్ సిటి కాలనీలో ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని వెచ్చగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక్కడి నుంచి ఆగస్టు 23న ఏడుగురిని అరెస్టు చేసి రెండులక్షల రుపాలయలు స్వాదీనం చేసుకున్నారు.
మే 18 న గోపాల్ వాడలో మరొకగ్యాంబ్లింగ్ డెన్ మీద దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గిర నుంచి ఒక మొబైల్ ఫోన్ ,రు8,540 స్వాదీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 25న మంచిర్యాల్ శివార్లలోని రాజీవ్ నగర్ లో ని డెన్ మీద దాడి చేసి మరొక పది మందిని పట్టుకున్నారు. వాళ్లదగ్గిర నుంచి 10మొబైల్ ఫోన్లు, అయిదు మోటార్ బైకులు రు.45,000 నగులు సీజ్ చేశారు.
ఏప్రిల్ 11 మందమర్రిలో అయిదుగురిని అరెస్టు చేశారు. జేబులో డబ్బులుంటే పోలీసులుదొరకవచ్చ. అందువల్ల వీళ్ల ఒక ముందుకేసి గూగుల్ పేలో చెల్లింపులు చేస్తున్నట్లు పోలీసులు గమనించారు.
నగరంలో గ్యాంబ్లింగ్ నాలెడ్జ్ వాళ్లు చెప్పేదేమంటే నెలకు అయిదారు కోట్ల మేరకు గ్యాంబ్లింగ్ నడుస్తు ఉందని చెప్పారు.
పోలీసులు జాగ్రత్తగా నిఘా వేసి గాంబ్లింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీుకుంటున్నట్లు డిప్యూటి పోలీస్ కమిషనర్ డి ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాపితంగా కూడా గ్యాంబ్లింగ్ నివారణకు చర్యలుతీసుకుంటున్నామని ఆయన చెప్పారు,
తెలంగాణలో 2017 జూలైలో ఒక ఆర్డినెన్స్ (Telangana Gaming (Second Amendment) Ordinance,2017 తీసుకువచ్చి గ్యాంబ్లింగ్ నిషేధించారు. దీనితో తెలంగాణలో ఆన్ లైన్ రమ్మీతో పాటు, గేమింగ్, బెట్టింగ్ కూడా నిషేధమయ్యాయి.