మట్టికుండ (కవిత)

మట్టికుండంటే మనకు
చులకనగానీ..
కుండను సృష్టించటం
అంత సులువు కాదు
ఒక్కసారి
కుమ్మరి వీధుల్లోకి
చూపుల్ని సారిస్తే..
రకరకాల ఆకృతుల్లో..
చెక్కిన కుండలన్నీశిల్పాలై..
ప్రతి పూరిగుడిసె
ఒక గుడిలా..
దర్శన మిస్తుంది ¡¡
సారె ముందు కుమ్మరి
మట్టి ముద్దకు
ప్రాణం పోస్తున్న
బ్రహ్మలా కనిపిస్తాడు.
అతడంటే మట్టి కెందుకో..
అంతమమకారం
అతడు కనిపిస్తే..
పసిపిల్లాడిలా
అతడిపాదాలను
చుట్టేసుకుంటుంది !!
అతడు పగలంతా..
ఎండను గుండెకెత్తుకుని
మడిలో శివ తాండవం
చేస్తుంటే..
చిందిన స్వేదాన్ని
పవిత్ర గంగలా..
స్వీకరిస్తుంది మన్ను !!
మన్నుని కాటుక
చేసే క్రమంలో..
సందెవేళకి కాళ్ళన్నీ..
గుంజుకు పోతుంటే..
ఆ కాళ్ళకి చందన
లేపనాలు అద్ది
సేదతీర్చేది మన్నేగా..
సారెమీద
అందమైన ఆకృతి
రానందుకు
మట్టి మీద అతడలిగితే..
అలక తీర్చేందుకు
ఎన్నెన్ని పువ్వులై
అతడి పిడికిళ్ళలో..
విచ్చుకుని అలక తీర్చేదో..
అతడు చేసిన
మట్టికుండ కల్లునింపుకుని
ఎందరి గీత కార్మికుల
కన్నీళ్ళను తుడిచిందో..
అతడు చేసిన
బువ్వకుండ ఎందరి
నిరుపేదల గుడిసెల్లో..
గంజి మెతుకై
ఆకలి తీర్చిందో..
మనిషి పుట్టుకలోనూ..
చావు లోనూ..
మట్టి కుండే ముందుంటుంది.
బొడ్డుపేగు తెగినప్పుడు
ఉమ్మనీరు నింపుకుంటుంది
మనిషి మరణించినాక
చితాభస్మాన్ని
గుండెలో నింపుకుని
గంగలో స్నానమాడుతుంది.!!
మనిషినీ మట్టికుండని
ఎప్పటికీ విడదీయలేం..
ఆదిమ నాగరికతకు
నాంది ఈ మట్టికుండ !!!
(జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, మొబైల్  8885999335)