కరోనా వల్ల ఈ సారి శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం

తిరుమల, 2020 ఆగ‌స్టు 28: సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా  నిర్వ‌హిస్తున్నారు.
శుక్రవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన  టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
స‌మావేశం అనంతర  టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు ఈ విషయం తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో నిర్ణ‌యిస్తామ‌ని ఆయన చెప్పారు.

నేటి టిటిడి బోర్డు విశేషాలు:

–శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, దాత‌ల‌ నుండి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు.
– టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించారు.ప్రస్తుత ప‌రిస్థితుల్లో ‌బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ ఇస్తున్నందు వ‌ల‌న టిటిడి డిపాజిట్ల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఆర్‌బిఐ, ఇత‌ర బ్యాంకుల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు.