(CS Saleem Basha)
ప్రముఖ గాయకులు ఘంటసాల, ముఖేష్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, మహేంద్ర కపూర్ అలాంటి వారు ఇప్పుడు మన మధ్య లేరు. వాళ్లు ఎన్నో అజరామరమైన పాటలు పాడారు. అయితే వారు పాడిన వీడ్కోలు పాటలు చాలా మందికి తెలియదు.
ప్రపంచాన్నో, ప్రేమనో, ప్రేయసినో వదిలి పెట్టి వెళ్ళిపోయే సందర్భంలో సినిమాల్లో వచ్చే పాటలు ఇవి. అట్లాంటి పాట ప్రతి ఒక్కరికీ ఉంది. అది వాళ్ళ సిగ్నేచర్ సాంగ్ ఆ పాటలు పరిచయం చేస్తున్నాను.
ముందుగా ఘంటసాలగారు పాడిన పాట. నాకు చాలా ఇష్టమైన పాట.” మాయని మమత” (1970) సినిమా కోసం ఈ పాట స్వరకల్పన జరిగింది ఎన్టీఆర్ పైన చిత్రీకరించిన ఈ పాట గొప్ప పాట. “రానిక నీకోసం సఖీ.. రాధిక వసంత మాసం” ఈ పాట కంపోజింగ్ పరంగా, సాహిత్యపరంగా, చిత్రీకరణ పరంగా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ పాటకు స్వరకర్త అశ్వత్థామ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దీన్ని రాశారు. ఈ పాట ఎన్టీఆర్ రేడియోలో పాడుతుండగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ హావభావాలు ఒక హైలైట్.
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకొని, జాలిగ గుండెల దాచుకుని దూరపు సీమలు చేరుకొని..
వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు
ప్రతి గాలి సడికి తడబడకు పద ధ్వనులు అని పొరబడకు
కోయిల కూయలే గూడు గుబులై పోయే లే
విషాదభరితమైన పాటలు ముఖేష్ చాలా పాడాడు. అయితే “జీ చాహ్తా హై”(1964) సినిమా లోముఖేష్ పాడిన పాట ఒక గొప్ప పాటగా నిలిచిపోయింది. “హం చోడ్ చలేహై మెహఫిల్ కో.. యాదాయే కభీతో మత్ రోనా. ( నేను సభను వదిలి వెళుతున్నా.. ఎప్పుడన్నా గుర్తుకొస్తే ఏడవకు”) జయ్ ముఖర్జీ, రాజశ్రీ ల పై చిత్రికరించిన ఈ పాట రచయిత హస్రత్ జైపురి, స్వరపరిచింది కళ్యాన్ జీ-ఆనంద్ జీ. ఘంటసాల పాడిన రానిక నీకోసం సఖీ.. రాధిక వసంత మాసం పాటకు, దీనికీ మధ్య సాహిత్యపరంగా సారూప్యం ఉంటుంది,
నేను సభను వదిలి వెళుతున్నా.. ఎప్పుడన్నా గుర్తుకొస్తే ఏడవకు
మనసుకు ఊరటనిచ్చుకో, ఎక్కడన్నా గాభరా పడితే ఏడవకు
మనం ఒక కలను కన్నాము – కళ్ళు తెరిస్తే కల చెదిరిపోయింది
ఈ ప్రేమ ఒక కలగా మారి నిన్ను ఎప్పుడైనా బాధ పెడితే ఏడవకు
నువ్వు నా కలలో మునిగిపోయి- మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
ఎప్పుడైనా నీ స్నేహితురాలు ఎవరైనా- నీకు నచ్చచెపితే ఏడవద్దు
బ్లాక్ అండ్ వైట్లో పిక్చరైజ్ చేసిన పాట, ఆ భావోద్వేగాన్ని ఎంత చక్కగా ప్రదర్శించిదో, చూస్తే తప్ప అర్థం కాదు.
కిషోర్ కుమార్ ” పవిత్ర పాపి” (1970) సినిమాలో పాడిన ” తేరి దునియా సే హోకే మజ్బూరు చలా” పాట కూడా అంతే. చాలా సింపుల్ పిక్చరైజేషన్, ఆ మూడ్ ని పాట ట్యూన్, సాహిత్యం, రెండూ చాలా చక్కగా క్యారీ చేస్తాయి. సంగీత దర్శకుడు (ఈ పాట రచయిత కూడా) ప్రేమ్ ధవన్ చాలా చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. తనుజా కి పెళ్లి అయిపోతుంటే, ఆమె ప్రేమికుడు పరీక్షిత్ సహాని పాట పాడుకుంటూ వెళ్లిపోవడం చాలా చక్కగా చిత్రీకరించారు కూడా. ఈ పాటలో ట్రంపెట్ చాలా చక్కగా వాడడం జరిగింది. సన్నివేశానికి, ఆ మూడ్ కి చక్కగా సరిపోయింది.
తేరి దునియా సే హోకే మజ్బూరు చలా,
మై బహుదూర్.. బహుత్ దూర్ చలా
ఎంత దూరం లో ఉన్నాను అంటే- తిరిగి రా లేనంత
నాలో నేను చేరుకోలేని గమ్యం దగ్గర్లో ఉన్నాను
నేను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాను అన్నది కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను
ఎంత అద్భుతమైన సాహిత్యమంటే. హిందీ వచ్చిన వాళ్ళు ఎలాగో ఎంజాయ్ చేస్తారు, రాని వాళ్ళు కూడా ఆ ఉద్వేగాన్ని అర్థం చేసుకోగలరు. చాలా సింపుల్ పిక్చరైజేషన్. ఈ పాటకి ఇంకో విశేషం ఉంది. కిషోర్ కుమార్ చనిపోయినప్పుడు (13, అక్టోబర్ 1987) ఈ పాటను టీవీలో రేడియోలో ప్రసారం చేశారు.
మహమ్మద్ రఫీ కి కూడా ఉన్న అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ “తుం ముఝే యూ భులాన పావోగే..” 1970 లో వచ్చిన ” pagla kahika” సినిమాలోనిది పాట. షమ్మీకపూర్ పై చిత్రీకరించిన ఈ పాట స్క్రీన్ పైన చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. హజరత్ జైపురి రాసిన చక్కటి ఈ పాటను అంతే చక్కగా స్వరకల్పన చేశారు, శంకర్- జై కిషన్.
ఈ పాట సాహిత్యం చూస్తే.
నువ్వు నన్ను మర్చిపోవడం సాధ్యం కాదు
ఎప్పుడైనా సరే నా పాటను విన్నావంటే
నాతో పాటు నువ్వు కూడా ఆ పాటను పాడుకుంటావు
ఆ వసంత కాలాలు, ఆ వెన్నెలరాత్రుల్లు
ఆ ప్రేమపూర్వకమైన మాటలు
నన్ను నీకు జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటే
అవి నీకు సాక్షాత్కారం అవుతాయి
ఇదే పాటను లతా మంగేష్కర్ కూడా పాడింది
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)