నా ఉద్యమ ప్రస్థానంలో అమ్మ : ఒక సోషల్ యాక్టివిస్టు అమ్మ జ్ఞాపకాలు

(దండి వెంకట్)
33 సంవత్సరాల నా ఉద్యమ జీవితంలో మా అమ్మ కూడా నాకు
తోడుంది…! అత్యంత పేదరికాన్ని అనుభవించినా ఏనాడు నన్ను
ఉద్యమబాట వదలమని గొడవచేయలేదు మా అమ్మ. నా చిన్నతమంతా పేదరికాన్నిమా కుటుంబ బారాన్నిమోసింది మా అమ్మ.
మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం విఠ్ఠోలి గ్రామం. ఈ గ్రామంలో లింగాయత్ ల ఆధిపత్యం ఉంటుంది.1975లో గ్రామ ఆధిపత్యకులాలతో మా కుటుంబానికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మా నాన్న దండి మల్లయ్య మా చిన్న నాన్నా,మా అత్తలు,మామలు గాయపడ్డారు
మా అమ్మ కూడా గాయపడింది.ఆ గాయలతోనే దాదాపు నాలుగు కీలోమీటర్ల దూరంలో ఉన్న ముదోల్ పోలిస్టేషన్ వెల్లి పోలీసులను తీసుకురావడంతో మా కుటుంబ సభ్యులు ఆధిపత్యవాదుల దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ గ్రామ ఆధిపత్య కులాలకు మా కుటుంబానికి జరిగిన ఘర్షణ మూలంగా 1985 ప్రాంతంలో నవీపేట్ మండల కేంద్రానికి వలస రావలసి వచ్చింది మా కుటుంబం.
1988 నుండే కమ్యూనిస్టు ఉద్యమ జీవితం ప్రారంభమైంది. అంటే నా వయసు 19 సంవత్సరాలు అప్పటి నుండి 2001వరకు సిపిఎం పార్టీలో చేరే వరకు అనేకసార్లు పోలీస్ దాడులు,కేసులు జైలు జీవితం సాగిపోయింది.
ఒకసారి నవీపేట్ మండలం బినోలా గ్రామ సర్పంచ్ తో రాజకీయ గొడవ కారణంగా నా ఇద్దరు తమ్ముళ్లు మా అమ్మ 10 సంవత్సరాల నా చెల్లెలితో సహా ఐదుగురం జైలుకు వెల్లాలసి వచ్చినప్పుడు కూడా మా అమ్మ నాపై ఏనాడు కోపం ప్రదర్శించలేదు. బినోలా గ్రామ సర్పంచ్ రోజ్ గార్ నిధుల దుర్వినియోగంపై నా రాజకీయ పోరాటం మూలంగా నా తమ్ముళ్లపై బనాయించిన అక్రమ దొంగతనం కేసుల్లో ఇరికించి, మా ఇంటిని సర్పంచ్ మనుషులు తగలబెట్టినపుడు కట్టబట్టలతో బయటపడ్డాము.ఈ సందర్భంలో కూడా మా అమ్మ ఏనాడు చలించలేదు.
1996లో జనశక్తి పార్టీలో వచ్చిన చీలికల సందర్భంగా నా చిన్నతమ్ముడు దండి చిన్నరాములును కూర రాజన్న సాయుధ మూఠా హత్య చేసినప్పుడు కూడా మా అమ్మ నన్ను నిందిచలేదు ’నీకోసం నా చిన్నకొడుకును జనశక్తి పార్టీ వారు చంపే’శారని.
1996లో సబ్బని లత పద్మశాలి తో నా పెళ్లి సందర్భంగా జనశక్తి మహిళా సంఘం నేతలు రాజకీయ కక్షతో మా అత్తగారి వైపున ఉండి మమ్మల్ని విడదీయాలని నవీపేట్ పోలిస్టేషన్ లో కేసులు పెట్టించినప్పుడు మా అమ్మను కూడా నాతోపాటు లాకప్ లో వేస్తే అప్పుడు నేను అడిగాను మా అమ్మను,‘ అమ్మా నా మూలంగా మన కుటుంబం ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా నన్ను ఏనాడు ఎందుకు మందలించలేదమ్మ,’ అని. అంటే
నవీపేట్ పోలిస్టేషన్ లో మా అమ్మ ఒకమాట చెప్పింది
‘ఒరే ఎంకటిగా మన కులపొల్లు పోలీస్టేషన్ లోకి వచ్చేది ఎందుకో తెలుసా?  తాగి కొట్లాటలు, లేదా ఇతర కేసుల్లో వస్తారు. నీవు పోలీసుల దెబ్బలు తింటున్నది, జైలుకు వెల్తున్నది ఏదో మంచి పనికోసమేకదా ! మన కులంలో ఇలాంటి మంచొడు ఒకడు ఉన్నాడని రాభోయే కాలంలో గుర్తుంటుంది,’ అని చెప్పిన అమ్మ మాటలే నిజంగానే నన్ను ఇంతకాలం నిలబెట్టాయి.
మా అమ్మకు చదువురాకపోయిన రాజకీయ చైతన్యం ప్రదర్శించిన సందర్భం మరోకటి 1996లో మా తమ్ముడు దండి చిన్నరాములును జనశక్తి రాజన్న గ్రూప్ సాయుధ మూఠా హత్యచేసినప్పుడు నక్సల్స్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని తిరస్కరించింది.
ఇదే సందర్భలో మరో విషయాన్ని మీకు గుర్తుచేస్తున్నాను, మా తమ్ముడు దండి చిన్నరాములు హత్య కేసులో ఉన్న ప్రధాన నింధితులైన మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త బొడిగ గాలయ్య మరికొందరు వచ్చి వారి బిడ్డలతో అమ్మ కాళ్ళపై పడి క్షమాపణ కోరితే క్షమించి వదిలేసిన సందర్భంగా వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పుడు అమ్మ వారిని ఉద్దేశించి మీరు జైలుకెల్తే మీ పిల్లలు అనాధలవుతారని నా కొడుకును హత్య చేసిన మిమ్మల్ని మీ పాపనికి వదిలేస్తున్నానని చెప్పిన మాటలకు నాకు నోటమాట రాలేదు.
నిరక్షరాసులైన మా అమ్మలో ఇంతటి చైతన్యం ఉండబట్టే మేము నలుగురం (ఇద్దరు తమ్ముళ్లు నేను చెల్లెల్లు) కులాంతర పెళ్ళిళ్ళు చేసుకోగలిగామనిపించింది.
మా పెళ్లిళ్ళ విషయంలో బంధువులు మా అమ్మను సూటిపోటి మాటలనే వారు పిల్లలను కన్నావు ఏమిటి లాభం ఒక్కరికీ కూడా కులం పద్దతిలేదని అమ్మను విమర్శించేవారికి తాను మౌనంగా ఉండిపోయేది.
మరో సందర్భంగా 1997లో మా బాబు పుట్టిన మూడు నెలల పసిబిడ్డను తీసుకెళ్లి వాడికి 18 నెలలు వచ్చే వరకు పెంచింది. అప్పుడు ఒకవైపు పోలీసులు మరోవైపు జనశక్తి కూర రాజన్న సాయుధ మూఠా దాడుల నుండి నేను నా జీవిత సహచరణి సబ్బని లత కూడా కొంత కాలం అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు మా ఇద్దరి రక్షణ కోసం నా బిడ్డను తానే పెంచింది మా అమ్మ.
మా అమ్మ ఏడ్చిన సందర్భం
ఎప్పుడు నాకు పిరికితనాన్ని నూరిపోయని అమ్మ 2017లో నేను సిపిఎం పార్టీకి రాజీనామా చేసినప్పుడు మాత్రం చాలా ఏడ్చింది..! ‘ఒరే పెద్దొడా మనం మన ఊరికే వెల్లిపోదంరా ఈ ఎర్రజెండా పార్టీలోల్లు మంచోళ్ళు కాదేమో అనిపిస్తుందిరా. ఒక ఎర్రజెండా పార్టీలోనా చిన్న కొడుకును పొట్టన పెట్టుకున్నారు. ఈ సిపిఎం పార్టొల్లు నిన్ను పార్టీ నుండి వెల్లగొట్టి నా కోడలను పార్టీలో ఉంచారు. అంటే వాళ్ళు నాకొడల్నినిన్ను మీ ఇద్దరిని విడదిస్తారేమో,’  అంటూ మా అమ్మ అమాయకంగా ఏడుస్తూ అడిగిన ప్రశ్నలు ఇంకా నా గుండెలను పిండేస్తునేఉన్నాయి.
అదికాదమ్మ నీ కోడలి అభిప్రాయం ప్రకారమే తాను సిపిఎంలో కొనసాగుతోందని తన అభిప్రాయాలను గౌరవించడం నా బాధ్యతకదమ్మ అంటూ మా ఇద్దరి వ్యక్తిగత జీవితానికి ఏలాంటి ఇబ్బందిలేదని చెప్పినా వినకుండా ఇంటి నుండి వెల్లిపోయింది అమ్మ.
అప్పటి నుండి ఏరోజు కూడా సరిగా మాట్లడలేదు.ఎందుకంటే నీవు ఎర్రజెండా పార్టీలో కొచ్చి తమ్ముడ్ని పోగొట్టుకున్నావు, నీకు ఎర్రజెండా పార్టీలో అన్యాయమే జరిగిందంటూ తన చివరి రోజుల్లో కాస్త భాదపడింది.
కమ్యూనిస్టు ఉద్యమ జీవితంలో దశాబ్దాలుగా పనిచేసిన నాలాంటి ఎందరో కార్యకర్తల, నాయకుల తల్లుల హృదయంతరాలనుండి వచ్చిన ఆవేదనయే మా అమ్మ ఆవేదనకు కారణమైయ్యింది.
అమ్మ ప్రేమతో ‘ఒరే పెద్దోడా’ అని, తనకు కోపమోస్తే
‘ఒరే ఎంకటి’గా అంటూ మందలించిన నా మాతృమూర్తి కడచూపుకు నోచుకోని పరిస్థితి ఏ బిడ్డలకు రావద్దని కొరుకుతున్నా.
నా ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా అమ్మ అంత్యక్రియల
బాధ్యతను నా జీవిత సహచరణి సబ్బని లత,నా పిల్లలు,
చెల్లెల్లు తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకులు బంధువులు పూర్తి చేశారు.
ఇది చదువుతుంటే మీకు నా ఆత్మకథలాగే ఉంటుంది కానీ ఇది నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన ఒక పేజీ మాత్రమే..

( ఈ నెల  26న మా అమ్మ దండి చంద్రబాయి మమ్మల్నందరిని శాశ్వతంగా వదలిపోయిన సందర్భంగా అమ్మ జ్ఞాపకాల
నెమరువేత)

Dandi Venkat
(దండి వెంకట్. బహజన్ లెఫ్ట్ ఫ్రంట్, తెలంగాణ అధ్యక్షుడు)