తాజాగా గండికోట ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు ఎత్తిపోతలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎత్తిపోతల పథకాలు అమలు జరిగితే చిత్తూరు జిల్లాకు చెందిన గాలేరు-నగరి రెండద దశకు నీరు ఎక్కడ నుండి తీసుకు వస్తారు? అంతేకాకుండా కడప జిల్లాలోని రాజంపేట కోడూరు ప్రాంతాలకు ఇంతే సంగతులు అంటున్నారు సీనియర్ జర్నలిస్టు నీటి పారుదల విశ్లేషకుడు వి.శంకరయ్య. ఆయన వాదన ఇది:
వాస్తవంలో ఎప్పుడో ఈ బీజం పడింది. గాలేరు నగరి పథకానికి చెందిన రెండు డిపిఆర్ లో కూడా గండికోట నిల్వ సామర్థ్యం 16 టియంసిలగానే వుంది. గండికోట నుండి ఎత్తిపోతల ప్రతిపాదన లేదు. 2006 జూన్ లో చిత్తూరు జిల్లా నగరి వద్ద ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పునాది రాయి వేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బుక్ లెట్ లో గండికోట నీటి నిల్వ సామర్థ్యం 16 టియంసిలుగానే చూపెట్టారు. ఈ పథకం ద్వారా 34 టియంసిలు వినియోగించుకొన బడుతుందని సాగునీటికి 24.351 టియంసిలు తాగునీటికి 3 టియంసిలు ఆవిరి సరఫరా నష్టం 6.649 టియంసిలగా ప్రకటించారు
గండికోట కు 16.484 టియంసిలు వామికొండకు 1.600 సర్వారాయ సాగర్ కు 3.059 ఉద్దిమడుగుకు 1.040 టియంసిలు కడప జిల్లాకు మొత్తం 22 టియంసిలుగా కేటాయించారు.. కాగా చిత్తూరు జిల్లాలో బాలాజీ రిజర్వాయర్లో కు 3 టియంసిలు మల్లిమడుగుకు 2.858 పద్మ సాగర్ కు 0.450 శ్రీనివాస సాగర్ కు 0.448 వేణు గోపాల్ సాగర్ 2.683 వేప గుంట రిజర్వాయర్ కు
0.533 అడవి కొత్తూరు రిజర్వాయర్ కు 0.800 టియంసిలు తిరుపతి తాగునీటితో కలుపు కొని 10 టియంసిలుగా చూపెట్టారు. 2006 నుండి ఇప్పటి వరకు గాలేరు నగరి రెండవ దశ పథకాన్ని పట్టించుకున్న వారు లేరు.. రాజశేఖరరెడ్డి హయాంలో జల యజ్ఞం కింద చేపట్టిన టెండర్ పనులు కుంటి నడకలో వుండగా ప్రస్తుత ప్రభుత్వం అన్నింటిని రద్దు చేసింది.
ఇదిలా వుండగా రాజ శేఖర రెడ్డి హయాంలోనే గండికోట నీటి నిల్వ సామర్థ్యం 26 టియంసిలకు పెంచారు. గాలేరు నగరి మొత్తం పథకం ప్రభుత్వం ప్రకటించిన మేరకు నీటి సామర్థ్యం 32.955 టియంసిలైతే ఒక్క గండికోటలోనే 26 టియంసిలను పెంచితే మిగిలిన రిజర్వాయర్ల గురించి ఆ రోజు ఈ రోజు తుదకు చంద్రబాబు నాయుడు హయాంలోనూ పట్టించుకున్న ప్రజాప్రతినిధులు లేరు.
పోనీ గండికోటలో నిల్వ చేస్తే అవసరం వచ్చినప్పుడు కింద వారు వాడుకొనే అవకాశమూ మృగ్యమైంది. రాజశేఖరరెడ్డి హయాంలోనే తుంగభద్ర నికర జలాలు కేటాయింపులు గల ఎగువ కాలువ కింద గల పులివెందుల బ్రాంచి కెనాల్ ఆయకట్టుకు గండికోట నుండి ఎత్తిపోతలు పథకం అమలు జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పైడిపాలం రిజర్వాయర్ నిర్మింపబడింది పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీటి సరఫరా అమలు జరిగింది. విషాదకరమైన అంశమేమంటే చంద్రబాబు నాయుడూ తన అయిదు ఏళ్ల పరి పాలన కాలంలో చిత్తూరు జిల్లాకు చెందిన గాలేరు నగరి రెండవ దశకు ఒక్క పైసా విడుదల చేయ లేదు. పైగా గ్రావెటీతో వున్న పథకాన్ని భూసేకరణ సాగుచూపి ఎత్తిపోతల పథకంగా మార్పుచేశారు. ఫలితంగా కడప జిల్లాలో కొంత ప్రాంతానికి కూడా అన్యాయం జరిగింది.
మరో విశేషమేమంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని నిలువ రించేందుకు చంద్రబాబు నాయుడు హయాంలో పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి అనే టిడిపి నేత గడ్డం పెంచి ఎత్తిపోతలను ప్రారంభోత్సవం చేయించారు. అప్పట్లో ఈ ఎత్తిపోతలకు మరి కొన్ని నిధులు వ్యయం చేశారు.
ఈ కార్యక్రమం తదుపరి సతీష్ రెడ్డి గడ్డం తీశారు. ఇప్పుడు ఈ సతీష్ రెడ్డి చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైకాపా లో చేరి పోయారు.
పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సమ న్యాయం అని చెబుతున్నందుకు చిత్తూరు జిల్లాకు చెందిన గాలేరు నగరి రెండవ దశ పథకానికి మోక్షం లభిస్తుందని ఆశ పడుతుండగా కుక్క ఆశ గుండ్రాయితో తీరి పోయినట్లు తాజాగా గండికోట ఆధారం చేసుకొని మరో రెండు ఎత్తిపోతలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఎత్తిపోతల పథకాలు అమలు జరిగితే చిత్తూరు జిల్లాకు చెందిన రెండవ దశకు నీరు ఎక్కడ నుండి తీసుకు వస్తారు.? ఒక్క చిత్తూరు జిల్లానే కాకుండా కడప జిల్లాలోని రాజంపేట కోడూరు ప్రాంతాలకు ఇంతే సంగతులు.
ప్రస్తుతం సర్వాయ సాగర్ వరకు ప్రధాన కాలువ వుంది. ఆ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాలేదు. తదుపరి కడప జిల్లాలో వచ్చే ఉద్దిమడుగుకు అతీ గతి లేదు. ఇంత కాలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం పోరాడిన సీమ పరిరక్షణ ఉద్యమ నేతలు ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ విధంగా స్పందించుతారో వేచి చూడాల్సివుంది. రాయలసీమలో చిత్తూరు జిల్లా కూడా వుంది. గాలేరు నగరి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి నీరు ఇస్తామనే వాదన ఆచరణలో సాధ్యం కాదు. మల్యాల నుండి జీడి పల్లి రిజర్వాయర్ వరకు 240 కీలోమీటర్ల కాలువ వెడల్పు చేస్తే గాలేరు నగరి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం లేకుండా చిత్తూరు జిల్లా నీరు ఇవ్వ వచ్చు. ప్రస్తుతం రెండు వేల క్యూసెక్కులు మాత్రమే ఎత్తి పోస్తున్నారు. చిత్తూరు జిల్లాకు ఏవిధంగానూ హంద్రీనీవా నీళ్లు రావు. ఒక వేళ గాలేరు నగరి హంద్రీనీవా లింకు ఏర్పిడినా చిట్ట చివర వుండే చిత్తూరు జిల్లా పరిస్థితి ఇంతే. కృష్ణ డెల్టా సాగర్ కుడి కాలువ చివర రైతుల గతే తప్ప వేరు కాదు.
రేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల ఆధారంగా వున్న ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఏ మేరకు చేస్తుందో చెప్పలేము. పైగా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం వివాదంలో చిక్కుకున్నది. గోదావరి పెన్నా అనుసంధానం జరిగి సోమశిలకు నీరు చేరితే కండలేరు పూడి కాలువ వెడల్పు చేస్తే….. అయితే గియితే అప్పటి సంగతి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెంది గాలేరు నగరి పథకానికి చెంది నీటి కేటాయింపులు ఎండ మావుల్లో నీటిని వెతకడమే.
గమనార్హమైన అంశమేమంటే చంద్రబాబు నాయుడు హయాంలోనూ గాలేరు నగరి రెండవ దశ పథకం గురించి జిల్లా తూర్పు ప్రాంత ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ప్రస్తుతం అందుకు భిన్నంగా వుండబోదు.
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)