(సిఎస్ సలీమ్ బాషా)
ఒక సారి ఐన్ స్టీన్ ఒక చక్కటి మాట చెప్పాడు. ” నిరంతరం విజయం కోసం పరుగులు తీసే ఉరుకుల పరుగుల జీవితం కంటే, ప్రశాంతమయిన సాధారణ జీవితమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది”. ఇంతకన్నా విలువైన మాటలు లేవు.
A calm and modest life brings more happiness than the pursuit of success combined with constant restlessness: Einstein
ఈ నాలుగు మాటలు రాసిన చిన్న కాగితపు ముక్క 1.3 మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయింది మరి!
1922 లో జపాన్ పర్యటన సందర్భంగా ఒక హోటల్ కి వెళ్ళిన ఐన్ స్టీన్ అక్కడ బెల్ బాయ్ కి టిప్ బదులుగా ఒక చిన్న కాగితం మీద రాసి ఇచ్చిన మాటలివి. ఆ బెల్ బాయ్ కి ఐన్ స్టీన్ వ్రాసి ఇచ్చిన రెండో మాట “Where there is will there a way (మనసుంటే మార్గం ఉంది).” అది రెండు లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.
అదీ జర్మన్ భాషలో రాశాడు. అది కూడా తనకి నోబుల్ ప్రైజ్ వచ్చింది అని తెలిసిన కొద్దిసేపటికే. “తర్వాత ఇది నీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది” అని బెల్ బాయ్ తో చెప్పడం విశేషం.
నిరంతరం పని లో మునిగి పోయే ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ మాటలు అన్నాడంటే, సంతోషం జీవితానికి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. పని కన్నా సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఈ మాటల సారాంశం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నారు. దేనికోసమో చాలామంది చెప్పలేరు. కొంత మంది చెప్పినా సరిగా చెప్పలేరు. అసలు మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం? అనేదానికన్నా ఎలా చేస్తున్నాం అన్నది ముఖ్యం.
“ నువ్వు ప్రేమించే వృత్తినిఎంచుకో అప్పుడు ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం లేదు”అన్నాడు ప్రముఖ లెబనీస్ అమెరికన్ కవి, తత్వవేత్త, ఖలీల్ జిబ్రాన్. అలా కాకపోయినా కనీసం ఎన్నుకున్న వృత్తిని ప్రేమించినా పరవాలేదు.
దాని అర్థం పని చేయకూడదని కాదు, పని చేసినట్లు ఉండదని! అంటే సంతోషంగా ఉంటారని. ఈ సందర్భంగా తోడికోడళ్ళు సినిమా లో ” ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది” అన్న ఏఎన్నార్ సావిత్రి పాట గుర్తుకొస్తుంది. మొత్తం మీద అర్థం ఏంటంటే సంతోషంగా పని చేస్తుంటే అలసట ఉండదు. పైగా డబ్బులు కూడా (భారీగా కాకపోయినా) వస్తాయి.
అలా కాకపోయినా కనీసం ఎన్నుకున్న వృత్తిని ప్రేమించినా పరవాలేదు. ఇది కూడా చేయకపోతే జీవితంలో సంతోషం దాదాపుగా కొరవడినట్లే!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది నచ్చిన పని చేయటం లేదు. అంటే తమకు నచ్చిన వృత్తిని ఎందుకో లేదన్నమాట. పోనీ ఎన్నుకున్న వృత్తిని ప్రేమిస్తున్నారా అంటే అదీ లేదు. దాంతో జీవితం మొత్తము అశాంతి మాయమైపోతుంది. సంతోషం కోసం ఏ ఆదివారమో, పండగ రోజు కోసమో, ఆకస్మిక బంద్ కోసమో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఎంత మంది తమ వృత్తిలో సంతోషంగా ఉన్నారు? ఈ విషయం మీద చాలా సర్వేలు జరిగాయి. అన్నీ మదింపు చేసి చూస్తే దాదాపు 60 శాతం మంది తాము చేస్తున్నా పని పట్ల సంతృప్తిగా లేరు. అందులో మళ్లీ డెబ్బై శాతం మంది తమకు ఏమాత్రం నచ్చని, సరిపోని వృత్తి లేదా ఉద్యోగం లేదా పని లో ఉన్నారు.
చాలామంది ” జేబు” satisfaction కోసం ఉద్యోగం చేస్తున్నారు తప్ప, ” జాబు” satisfaction కోసం మాత్రం కాదు. అంటే కేవలం డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నారు. తమ క్వాలిఫికేషన్ కీ తగిన ఉద్యోగం కాకపోయినా అసంతృప్తితోనే నెట్టుకొస్తున్నారు. దాంతో పైకి బాగానే ఉన్నా, సంతోషంగా లేరు. అంటే డబ్బులు కోసం ఉద్యోగం చేయడం తప్పా? కానేకాదు. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే. కానీ డబ్బుల కోసమే ఉద్యోగం చేయడం వల్ల జీవితంలో కొంత అసంతృప్తి, చాలా అశాంతి కలుగుతాయి
అందుకే రోజు సంతోషంగానే గడపాలంటే, ప్రేమించే పనినైనా చేస్తూ ఉండాలి, లేదా చేస్తున్న పనినైనా ప్రేమించాలి.
సరే ఇదంతా పక్కన పెట్టి ఈ పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండాలంటే బాల్యంలోకి వెళ్లాలి. ఎవరైనా సరే చిన్నప్పుడు సంతోషంగానే ఉంటారు, వయసు పెరిగే కొద్దీ సంతోషం దూరం అవుతూ వస్తుంది వయసు మళ్లిన తర్వాత మళ్లీ సంతోషం కోసం పరుగు మొదలవుతుంది. ఇది ఒక సైకిల్. ఎవరి బాల్య మైనా దాదాపు సంతోషంతో కూడుకొని ఉంటుంది. ” నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే నీలో నీ బాల్యాన్ని సజీవంగా ఉంచుకోవాలి”. అన్నాడు ఓ పెద్దమనిషి చాలామంది మేం పెద్దవాళ్ళు అయ్యాము కాబట్టి పద్ధతిగా ఉండాలనుకుంటారు. పద్ధతిగా ఉండడం తప్పు కాదు కానీ, సంతోషాన్ని, అంటే బాల్యాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు.
చిన్నపిల్లల్ని గమనిస్తే వారు ఏ కారణం లేకుండా సంతోషంగా ఉంటారు. They are always happy for no reason. పోనీ అలా చేసిన పర్వాలేదు .
“If you want to be happy, tie your life to a goal, not to people” అని కూడా చెప్పాడు ఐన్ స్టీన్. ఆ లక్ష్యం పేరు “సంతోషం” అయితే మనకు తిరుగులేదు. జీవితాంతం సంతోషమే లక్ష్యంగా బతకడం కన్నా అద్భుతం ఏముంటుంది? సంతోషమే లక్ష్యంగా ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో జాన్ లెన్నన్(1940-1980) ఒకడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు, “నువ్వు పెద్దయ్యాక ఏం కావాలి అనుకుంటున్నావు?” అని రాయమంటే, లెన్నన్ సింపుల్ గా” సంతోషం (Happy) గా ఉండాలి అనుకుంటున్నాను” అని రాశాడు! రాయటమే కాదు, జీవితాంతం అలాగే బతికాడు. అంటే పని ఏమి చేయలేదా? ఎందుకు చేయలేదు? గాయకుడిగా, నటుడిగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ప్రసిద్ధి పొందిన ” బీటిల్స్’ బ్యాండ్ లో ఒకడు. సంతోషమే లక్ష్యంగా, నచ్చిన పని చేస్తూ ఫేమస్ అయ్యాడు.
ఇది ఉదాహరణగా తీసుకోకపోయినా, సంపాదన కన్నా సంతోషాని కి ప్రాధాన్యత ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఉన్నత స్థాయికి కూడా చేరుకున్నారు. సంపాదనా, సంతోషమా, లేక సంతోషం తో కూడిన సంపాదనా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)