(సిఎస్ సలీమ్ బాషా)
అంజలీదేవి అంటే మనకు గుర్తొచ్చే సినిమా సువర్ణ సుందరి. ఈ సినిమా నేను ఓ నాలుగైదు సార్లు చూసి ఉంటాను. తర్వాత సినిమాలో వచ్చే ” పిలువకురా..” అనే పాటను ఫ్లూట్ మీద 40 సార్లు ప్రయత్నం చేసి నేర్చుకున్నాను.
నిజానికి సువర్ణ సుందరి (1957) సినిమా విడుదలయినప్పుడు నేను పుట్టలేదు. నాకు తెలిసి 1967 లో ఆ సినిమా చూశాను. దాని తర్వాత ఒకటి రెండు సార్లు థియేటర్లో, డి వి డి లో చూశాను.
ఎందుకో నాకు సినిమా బాగా నచ్చింది. చాలా రోజుల పాటు మేము ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమా ఒక బాక్సాఫీస్ బొనంజా. 48 థియేటర్లలో 50 రోజులు, 18 థియేటర్లలో వందరోజులు జరుపుకున్న సినిమా!
అంతకుముందు అనార్కలి, అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాల్లో అంజలి దేవి, ఏఎన్ఆర్ జంటగా నటించారు. దాదాపు 350 పైచిలుకు సినిమాల్లో అంజలీదేవి నటించింది. ఈ రోజు (24.08.1927) అంజలీదేవి జయంతి.
అంజలి దేవి అన్నది సినిమా పేరు. ఆమె అసలు పేరు అంజనమ్మ. నాటకాల్లో వేషాలు వేయడం మొదలు పెట్టిన తర్వాత తన పేరును అంజనీ కుమారిగా మార్చుకుంది. అయితే దర్శకుడు సి.పుల్లయ్య ఆమె పేరును అంజలీ దేవి గా మార్చాడు.
అంజలీదేవి ఎన్ని సినిమాల్లో నటించినా 1963 లో వచ్చినా లవకుశ ఆమెకు ప్రత్యేకమైనది. ఇది పూర్తిగా కలర్ లో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమా. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కొంత భాగం మాత్రమే కలర్ లో తీశారు. అప్పుడు కలర్ అంటే అది కూడా గేవా కలర్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. 18 సెంటర్లలో 175 రోజులు ఆడింది. మొత్తం మీద 62 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ” ఉత్తమ చిత్రం” అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా అంజలికి ఎందుకు ప్రత్యేకమైనది అంటే, ఆమెకు అభినవ సీత గా పేరు తెచ్చింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకీ అంజలీదేవి వెళ్లిన ఒకటి రెండు చోట్ల చాలామంది మహిళలు ఆమెకు పాదాభివందనం చేశారు. దాని తరువాత ఎన్నో రామాయణం నేపథ్యంగా ఎన్నో సినిమాలు వచ్చినా లవకుశ ఇప్పటికీ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. ఈ సినిమాలో 37 పాటలు పద్యాలు ఉన్నాయి. ఇప్పటికీ అది రికార్డు.
యాభైల దశకం లో అందమైన నటిగా పేరుపొందిన అంజలీదేవి అక్కినేని నాగేశ్వరావుతో కలిసి చాలా విజయవంతమైన సినిమాల్లో నటించింది.
అప్పటి నటులు రంగస్థలం ద్వారానే సినిమారంగంలో కి వెళ్లేవారు. అంజలి దేవి కూడా అలా రంగస్థలం లోకి అడుగు పెట్టింది. కొన్ని నాటకాల్లో నటించిన తర్వాత “రాజా హరిశ్చంద్ర”(1936) సినిమాలో ఆమె లోహితాస్యుడు గా చిన్న వేషం వేసింది.
1940 లో ప్రసాద్ “కష్టజీవి” అనే సినిమా తీయడానికి నిశ్చయించుకొని అంజలీదేవికి అవకాశం ఇచ్చాడు. కానీ మూడు రీళ్లు షూటింగ్ తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పుడు దర్శకుడు సి.పుల్లయ్య ఆమెకు ” గొల్ల భామ” సినిమాలో మోహిని వేషం ఇచ్చాడు. ఆ సినిమా హిట్ కావడం తో అంజలి దేవి దశ తిరిగిపోయింది.
ఈ సినిమాను మళ్ళీ 1967 లో భామావిజయం పేరుతో రీమేక్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రానికి మళ్లీ సి. పుల్లయ్యే దర్శకత్వం వహించడం విశేషం..
1949 లో వచ్చిన “కీలుగుఱ్ఱం” అనే చిత్రంలో ఆమె చేసిన గుణసుందరి పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అందులో గుర్రాలను తినే దెయ్యం పాత్రలో ఆమె ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఇక తర్వాత వచ్చిన స్వప్న సుందరి, పరదేశి, అనార్కలి వంటి సినిమాలు నటిగా ఆమె ప్రతిభను చూపించాయి.
1948 లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావును పెళ్లి చేసుకున్న తర్వాత, ఆయనతో కలిసి అంజలి పిక్చర్స్ బ్యానర్ పై అంజలీదేవి ఎన్నో చిత్రాలను నిర్మించింది. అందులో చాలా చిత్రాలు విజయవంతమయ్యాయి. అంజలీదేవి మొదటి సారి 1955 లో అనార్కలి ఈ చిత్రాన్ని నిర్మించింది.
1955 లో అనార్కలి చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు పొందినప్పట్నుంచి, అంజలీదేవి ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందింది.1994 ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2008 లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఆమె నట జీవితానికి లభించిన గౌరవాలు. 86 సంవత్సరాల వయసులో 2014,జనవరి 13, తేదీన ఆమె శాశ్వతంగా మనకు దూరమైంది.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)