(CS Saleem Basha)
సంతోషానికి హార్మోన్లు కారణమా? అవును, అని చెప్తుంది నాడీ శాస్త్రం (Neuroscience). మనిషి మెదడు అద్భుతమైన, పూర్తిగా అర్థం చేసుకోలేక పోతున్న ఒక అవయవం. మన మెదడు కొన్ని హార్మోన్లు విడుదల చేయడమే పరోక్షంగా మన సంతోషానికి కారణం అవుతుంది. గత కొంత కాలంగా న్యూరో కెమికల్స్ అంటే నాడీ రసాయనాలు, ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి. అవి మన సంతోషానికి పరోక్షంగా ఏవిధంగా కారణమవుతాయి అని పరిశోధనలు జరుగుతున్నాయి. కాలక్రమేణా కొన్ని నిజాలు బహిర్గతం అవుతున్నాయి.
కొన్ని పరిశొధనల్లో తేలిన విషయం ఏంటంటే మనిషి జీవితంలో బహిర్గతం అవుతున్న అనేక ఎమోషన్స్ కు కారణం మన లోపలే ఉందంట! బయట నుంచి ఏది మనల్ని ప్రభావితం చేయలేదు. కానీ బయట ఉన్న విషయాన్ని మెదడు ఉపయోగించుకొని విడుదల చేసే 4 రకాల హార్మోన్లు మన సంతోషానికి, ఇతర ఉద్వేగాల కి అవుతున్నాయి అంట. దీన్నే విజయ రసాయనాలు(success chemicals) అని కూడా నాడి శాస్త్రవేత్తలు అంటున్నారు.ఆ నాలుగు రకాల హార్మోన్లు ఏంటో కొంచెం చూద్దాం.
ఇందులో మొదటిది ‘ఎండార్ఫిన్’ (Endorphin). దీన్ని న్యూరో కెమికల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. ఎండార్ఫిన్ అనేది అనేది నొప్పి నివారిణి అంటే పెయిన్ కిల్లర్. మన శరీరం నొప్పిని తట్టుకోవడానికి విడుదల చేసే రసాయనం ఇది. మనం బయటి నుంచి కూడా దీన్ని మాత్రల రూపంలో, లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం. కానీ మెదడు అవసరమైనప్పుడు దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసినప్పుడు ఇది సహజంగానే ఉత్పత్తి చేయబడుతుంది. మన శరీర సామర్థ్యానికి మించి మనం ఏదైనా చేసినప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య లాంటిది. మనిషి అనాగరికంగా బతుకుతున్న కాలంలో ఎప్పుడైనా ఏదో ఒక జంతువు దాడికి గాయాల బారిన పడితే తాత్కాలికంగా ఈ రసాయనం విడుదలయి, నొప్పిని తగ్గించి, సురక్షిత స్థలానికి వెళ్లడానికి అవకాశం కలిగించేది. అప్పుడు మనిషికి అదంతా తెలియదు. ఇప్పుడు మనము అడవుల్లో లేవు కాబట్టి ఇది అంత అవసరం లేకపోయినా, మనకున్న ఒత్తిడి దృష్ట్యా ఇది అప్పుడప్పుడు ఉత్పత్తి కావడం అవసరం. ఉదాహరణకి మనం ఏదైనా విషాదవార్త గాని, షాకింగ్ న్యూస్ కానీ విన్నప్పుడు మన కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు ఎండార్ఫిన్ విడుదల కావడానికి ప్రేరేపిస్తాయి. అయితే ఎండార్ఫిన్ తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. అందుకే మనం కొంత మందిని చూస్తుంటాం, వాళ్లు సమస్య వచ్చినప్పుడు అంతా కన్నీళ్లు పెట్టుకొని ఎండార్ఫిన్ విడుదల చేసుకొని స్వాంతన పొందుతుంటారు. చాలామంది సమాజంలో వచ్చే సమస్యలకు దీన్ని వాడుతుంటారు.
ఈ ఎండార్ఫిన్స్ నవ్వినప్పుడు బాగా ఉత్పత్తి అవుతాయని పరిశోధనలో తెలిసింది. అందుకే తరచూ నవ్వడం ద్వారా మన బాధలను తాత్కాలికంగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రకాల ఆహార పదార్ధాలు కూడా ఎండార్ఫిన్స్ విడుదల కావడానికి కారణం అని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక చిన్న పరీక్ష నిర్వహించారు. కొంతమందిని తీసుకొని రెండు గ్రూపులుగా చేసి, ఒక గ్రూప్ కి హాస్యానికి సంబంధించిన వీడియోలు, చూపించారు. మరో గ్రూప్ కి సాధారణ వీడియోలు చూపించారు. తర్వాత రెండు గ్రూపుల నొప్పిని తట్టుకునే స్థాయిలను పరిశీలిస్తే హాస్య వీడియోలు చూసి బాగా నవ్విన గ్రూపు నొప్పి భరించే స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది
ఇక రెండో హార్మోను “డోపమైన్” మనం ఏదైనా సాధించినప్పుడు కలిగే రసాయనం. దీన్నే “ఉత్సాహ” హార్మోన్ అని కూడా అంటారు. మన నిత్య జీవితంలో ఈ హార్మోన్ అవసరం ఎంతైనా ఉంది. మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ హార్మోన్ మనకు జీవితాంతం బ్యాక్ గ్రౌండ్ లోపనిచేస్తూ ఉంటుంది. ఉద్యోగం సాధించినప్పుడు, పరీక్షల్లో విజయం సాధించినప్పుడు, ఏదైనా ఆటలో గెలిచినప్పుడు ఇది పనిచేస్తుంది. మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఇది మరింత ఉత్పత్తి అయ్యే మళ్లీ ఇంకా ఏదైనా సాధించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మనం ఏదైనా సాధించినప్పుడు మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే అప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సెల్ఫ్ మోటివేషన్ వల్ల కూడా మనకు ఈ హార్మోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మనకు మనం గొప్ప వాళ్ళు గా ఫీల్ అయినప్పుడు ఇది విడుదల అవుతుంది.
ఇక మూడోది ఆక్సిటోసిన్. దీన్ని మనం ఎవరినైనా నమ్మినప్పుడు, ప్రేమించినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది విడుదల కావడం అంత సులభం కాదు. దీన్ని “టచ్” హార్మోన్ అని కూడా అంటారు ఎవరినైనా మనం హత్తుకున్నప్పుడు ఇది విడుదల అయ్యే అవకాశం ఉంది. తల్లి పిల్లలకు పాలిచ్చే టప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. మనం ఎవరి మీదన్న సానుభూతి,(sympathy) లేదా సహానుభూతి(empathy) చూపినప్పుడు ఈ హార్మోన్ పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. ఇది మన ఉద్వేగ ప్రజ్ఞను(EQ) పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.2009 లో జరిగిన ఒక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, సానుభూతిని ప్రేరేపించే వీడియోలు చూసిన వారిలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరగటం. దీన్ని సినిమా పరిభాషలో చెప్పాలంటే, మున్నాభాయ్ ఎంబీబీఎస్ లో ” జాదూ కి చప్పి ” అన్నమాట. ఆక్సిటోసిన్ సంబంధించిన జాదూ కి చప్పి , అంటే ప్రేమగా హత్తుకోవడం మనలో ఆక్సిటోసిన్ స్థాయిని బాగా పెంచుతుంది. లవ్ డాక్టర్ అని పిలువబడే డాక్టర్ పాల్ జాక్ అభిప్రాయం ప్రకారం రోజుకి కనీసం ఎనిమిది సార్లు ఎవరినైనా హత్తుకోవడం మంచిది. అది ఒక్కరే కావచ్చు లేదా ఎనిమిది మంది వేరే వేరే వ్యక్తులు కావచ్చు. అదే లాభం కలుగుతుంది. వర్జీనియా సాతిర్ అనే సైకోథెరపిస్ట్ ఇలా చెప్పింది “ మనకు బతకాలంటే రోజుకి 4 సార్లు , జీవితాన్ని సజావుగా గడపాలంటే ఎనిమిది సార్లు, జీవితంలో ఎదగాలి అనుకుంటే 12 సార్లు ఎవరినైనా హత్తుకోవాలి”. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కౌగిలింత వేరు, హత్తుకోవడం వేరు!
అంటే ఇది మానవ సంబంధిత హార్మోన్. మన మానవ సంబంధాలు మెరుగు పరిచే క్రమంలో చక్కటి సంబంధాలు నిర్వహిస్తే ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎవరినైనా నమ్మితే, ఎవరైనా మనల్ని నమ్మితే ఈ హార్మోన్ రిలీజ్ కావడం ఖాయం. ఎవరైనా స్నేహితులతో గాని, కావాల్సిన వాళ్లతో గానీ కాసేపు ముచ్చటిస్తే కూడా ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఒంటరిగా పాటలు పాడుకున్నా కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది
ఇక చివరిది ” సెరటోనిన్” (Serotonin). ఇది గుర్తింపు హార్మోన్. సమాజంలో మనకు కాస్త గుర్తింపు రావాలి. దీన్ని న్యూరో కెమికల్ ఆఫ్ రెస్పెక్ట్ అని కూడా అంటారు. ఇదే మనకు కాసింత మర్యాదను సంపాదించి పెడుతుంది. దాంతో మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది బిడియస్తులు ఉంటారు. వాళ్లు చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉంటారు. కానీ సెరోటోనిన్ ఉత్పత్తి అయిన మరుక్షణం వాళ్లలో మార్పు వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకు కాస్త మర్యాద, గుర్తింపు ఇచ్చిన వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గుర్తింపు, మర్యాద మనలో సెరటోనిన్ స్థాయి ని పెంచి ఉంటుంది. మనం ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే సర్వరు మనకి మర్యాద ఇచ్చి, బాగా సర్వ్ చేస్తే, మళ్లీ ఇంకో సారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సర్వర్ ని మనం కూడా మర్యాదగా పలకరిస్తాము. టిప్ కొంచెం ఎక్కువ ఇచ్చిన ఆశ్చర్యంలేదు.
మన జీవితంలో ఈ నాలుగు హ్యాపీనెస్ హార్మోన్స్ తగుపాళ్లలో ఉత్పత్తి అవుతూ ఉంటే (ఇందులో మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి) మన సంతోషం కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది.
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)