ఏడుకొండలవాడి ‘ఎరువాడ జోడు పంచెలు’ తెలంగాణలో నేస్తారని తెలుసా?

అలంకార ప్రియోః విష్ణుః అని పేరు. శివుడికి అభిషేకం ఇష్టమయినట్లు విష్ణుదేవుడికి అలంకారాలు ఇష్టం. ఆయన అలంకార  ప్రియుడు. ఆయన భార్య శ్రీ మహాలక్ష్మి. అమె సకల సంపద సృష్టికి మూలం.
 అందువల్ల విష్ణుదేవుడి అవతారమయిన వెంకటేశ్వరుడు కూడా  అలంకార ప్రియుడు. మంచి వస్త్రాలు ధరించడం, నగలు అభరణాలు ధరించడం ఆయన ప్రీతికరమయింది.  సందర్భాన్ని బట్టి ఆయన వస్త్రాలు, అభరణాలు మారుతుంటాయి. దీనికి తగ్గట్టుగానే వివిధ రాజ్యాధినేతల్లో ఆ రోజుల్లో వెంకటేశ్వరుడికి, ఆభరణాలు,పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా వెంకటేశ్వరుడికి 12 రకాల వస్తాలు ధరిస్తారు. అవి 1. మెల్చాట్ వస్త్రం, 2, ఉత్తరీయం (అడ్డ తోమాల వస్త్రం) 3.గద్వార ఏరవాడ వస్త్రం 4.తిరుపతి బరి ఉల్చతు వస్త్రం (Tirupati bari ulchathu vastram) 5.కౌపీనం 6. వక్షస్థల తాయార్ల పట్టు వస్త్రం 7. దుపట్టా పట్టు వస్త్రం. 8.భోగశ్రీనివాస మూర్తి పట్టు వస్త్రం 9.కొలువు శ్రీనివాస మూర్తిపట్టు వస్త్రాలు 10.బత్మల్ పావడ 11. పీతాంబరం 12.శేషవస్త్రం.
ఇందులో గద్వాల ఏరువాడ (yeeruwad/ Eruwada) వస్త్రం గురించి ఇపుడు తెలుసుకుందాం.
తిరుమలేశుడికి బ్రహ్మోత్సవాల సందర్బంగా సమర్పించే శేషవస్త్రాలను  ‘ఎరువాడ జోడు పంచెలు’లంటారు. ఇవి తెలంగాణలోని గద్వాల నేతగాళ్లు శ్రీవారికి సమర్పిస్తారు. ఇది 400 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని ప్రతీతి.

గద్వాల్‌ నగరం తుంగభద్ర, కృష్ణా నది మధ్యన ఉంటుంది.  ఈ రెండు నదుల మధ్య ఉండే గద్వాల్‌లోని చేనేత మగ్గాలపై ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. రెండు ఏర్ల మధ్య ఉన్న వాడ (వూరు) అలా రెండు ఏరుల వాడల మధ్యలో తయారవుతునందునే వీటిని ఏరువాడ లేదా ఎరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి కెక్కినట్టుగా చెబుతారు.
ఈ వస్తాలను శ్రీవారి శిరస్సు మీద మొత్తగా ఉండటానికి కప్పుతారు. దీని  మీద కిరీటం అలంకరిస్తారు. అపుడు కిరీటం దిట్టం తలమీద కూర్చుంటుంది.
ఈ శేష వస్త్రాలను ఇలా తయారు చేస్తారు
ఈ జోడు పంచెలను నేయడం శ్రావణమాసంలో ప్రారంభిస్తారు. 41 రోజుల పాటు అంటే ఆరువారాల పాటు   నియమనిష్టలతో ఈ పంచెను అక్కడి సాలీలు  నేస్తారు. దీనినే ఒక మండల కాలం అంటారు. హిందూపంచాంగం ప్రకారం మండలం అంటే 41 రోజులు.

పట్టణంలోని కొంకతి కుటుంబం ఈ వస్త్రాలను తయారు చేస్తుంది. వీరు దాదాపు పదితరాలుగా శ్రీవారికి శేష వస్త్రాలను నేసి అందిస్తున్నారు. ఈమేరకు వారికి గద్వాల జమీందారునుంచి ఉత్తర్వులు కూడా ఉన్నాయని, దాని మేరయే ఈ సంప్రయదాయం కొనసాగుతున్నది కొంకతి కుటుంబీకులు చెబుతారు.
ఈ చీరెలను ఒక ప్రత్యేెక మగ్గం మీదే తయారు చేస్తారు. ఈ మగ్గం మీద మరొక వస్త్రం నేయరు.  అందువల్ల ఈ మగ్గాన్ని ఏడాదికొకసారే వాడు. ఈ మగ్గం ఉన్న గదిలోకి నేత గాళ్లు మరొక ప్రవేశించరు. రోజుకు ఆరుగంటల మగ్గం నేస్తారు.
ఈమగ్గానికి అవసరమయిన నాణ్యమయిన నూలును కొయంబత్తూరు, చీరాలనుంచి కొనగోలు చేస్తారు. నూలుకయ్యే ఖర్చు దాదాపు 15 వేల నుంచి 20వేలదాకా ఉంటుంది. వస్త్రాలు తయారయి వాటిని టిడిటికి సమర్పించేనాటికి   మొత్తం విలువు రు. 40 వేలకు చేరుకుంటుంది. టిటిడి నుంచి కేవలం ముడిసరుకు ఖర్చు ను మాత్రమే తీసుకుంటారు. ఇవన్నీ ధవళ వస్తాలు. వీటికి వక్క రంగ అంచు ఉంటుంది.

నిష్ఠగా నేస్తారు
ఎరువాడ జోడుపంచెలు నేసేటపుడు నేతగాళ్లు చాలా నిష్టగా ఉంటారు. వాళ్లు ముందే వంట సామాగ్రి తెచ్చిపెట్టుకుంటారు. తమ వంట తామే అదే గదిలోనే  వండుకుంటారు,
ఈ సందర్భంగా నేతగాళ్లు ఉపవాసాలు పాటిస్తూ  గోవిందనామ స్మరణ  చేస్తూ మగ్గం నేస్తుంటారు. ఎరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. ఈ పంచెలపై రాజా కట్టడాలకు గుర్తుగా 8 కంచుకోట కొమ్మ నగిషీతో సుందరంగా, కళాత్మకంగా తయారు చేస్తారు.
పంచెతయారీకి 20 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా పనులు సాగవు, మగ్గం కదలదన్న కారణంత నిరాటంకంగా నేత కొనసాగేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
వస్తాలను నేసిన తర్వాత, వాటిని టిటిడి పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తారు
ఈ పంచెలా లాటుని మగ్గాన్ని  ఇద్దరు కలిసి నేస్తారు. కానీ ఈ మగ్గం ప్రత్యేకత ఏంటంటే ముగ్గురు ఒకేసారి నేసేలా ఉంటుంది. దీనికి నామాల మగ్గం అని పేరుంది.
ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో కానుకలు అందుతుంటాయి. కానీ గద్వాల నుంచి వచ్చే జోడుపంచెలు అన్నింటి కంటే విశిష్టమయిన కానుకలు.ఇాలాంటి పంచెలను కానుకగా  తయారు చేసే అవకాశం లభించడం  తమ పుణ్యఫలంగా ఈ సాలీలు భావిస్తారు.  గద్వాల సంస్థానాదీశుల తరపున మహంకాళి కరుణాకర్‌ కొన్నేళ్లుగా తన ఇంట్లో ఈ ఎరువాడ జోడు పంచెలను తయారు చేయిస్తున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజున శ్రీవారి మూల విరాట్‌ విగ్రహానికి ఎరువాడ జోడుపంచెలను అలంకరిస్తారు.
ప్రస్తుతం కరోనా సమయంలో కూడా వీటిని నేయడం ఆగలేదు. జోడు పంచెల నేత కొనసాగుతూనే ఉంది. కాకపోతే, మునుపటి హడావిడి కనింపిచదు. కరోనా జాగ్రత్తలన్నీ తీసుకుంటూ పంచెలునేస్తున్నామని వారు చెబుతున్నారు.
చరిత్ర
ఈ సంప్రదాయానికి ఒక చరిత్ర ఉంది.  శ్రీవారికి గద్వాల జోడుపంచెలను సమర్పించే సంప్రదాయం గద్వాల సంస్థానాధీశుడు నల సోమనాద్రి రాజా కాలంలో మొదలయింది. ఆయన వెంకటగిరి రాజులకు మంచి మిత్రుడు. ఒక సారి గద్వాల రాజావారు, వెంకటగిరి రాజావారితో కలసి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అపుడు బ్రహ్మోత్సవాల అంకురార్పణ రోజున అంటే తొలిరోజున శేషవస్తాలను తాను ప్రతియేటా సమర్పించాలనుకుంటున్నట్లు అభిలాషను వ్యక్తం చేశారు. దీనికి వెంకటగిరి రాజావారు అంగీకరించారని, ఆ ఏర్పాటును ఆలయం కూడా అంగీకరించిందని ఈ కుటుంబ సభ్యులు చెబుతారు. అప్పటినుంచి కొంకతి కుటుంబానికి ఈ వస్తాలను నేసే అదృష్టం దక్కిందని వారుగర్వపడతారు.

 

(Like this story? Share it with a friend)