బిసిలు గౌతముడు ఆద్యాత్మిక చింతన మార్గాన్ని అనుసరించాలి.ఎందుకంటే మూలభారతీయుడు గౌతమ బుద్ధుడు మాత్రమే కాబట్టి.విదేశీ మూలాలున్న ఆర్య బ్రాహ్మణులు,వైశ్యులు,క్షేత్రియులు అనుసరించేది విదేశీ మనుధర్మం కాబట్టి, మూలభారతీయులంతా సిద్ధార్థుడి మార్గాన్నే అనుసరించాలి. బిసిలను,గిరిజన తెగలను గౌతమ బుద్ధుడి జ్ఞాన మార్గమే రాజ్యాధినేతలను చేస్తుందితప్ప మనువాదం ఎన్నటికీ చేయదు. బిసిలు,గిరిజన తెగలు మనువాదాన్ని అనసరించినంత కాలం రాజకీయ బానిసత్వం నుండి విముక్తి పొందలేరు.
ఎస్సీలు ముఖ్యంగా మాదిగ,మాల వంటి ఉపకులాలు ఇప్పటికే డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ మార్గం గౌతముడి మార్గం అనుసరిస్తున్నారు. అయితే రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్న ఎస్సీల్లో మెజారిటీ ఇంకా మనుధర్మ బంధిలుగానే ఉన్న విషయం తెల్సిందే.
దేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో జనాభాలో 60% ఉన్న బిసిలు అందులో 18%మున్న సంచారజాతులు,15%మున్న ఎంబిసిలు,27%ఉన్నబిసిల ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గమొకటే రాజ్యాధికారం.
బిసిలకు రాజ్యాధికారం ఎట్లోస్తుంది! బిసి ఉద్యమం ఫూలే,సావిత్రి బాయి,సాహుమహారాజ్,పెరియార్ ల సైద్ధాంతిక పునాదులపై నిర్మాణమై, డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్, దాదాసాహెబ్ కాన్షీరాం ల రాజ్యాధికార భావజాల లక్ష్యంతో బిసి ఆత్మగౌరవ పతాకం గొడుగు కిందకు దళిత,గిరిజన,మైనారిటీ ప్రజలను సమీకరించే నూతన నాయకత్వమొకటి అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పైన బిసిల వర్గీకరణ ఎందుకు చేశానంటే బిసిలు దేశవ్యాప్తంగా మూడు పాయలుగా ఉద్యమిస్తున్నారు. భూమి సంబంధాలున్న బిసిలు ఒక సెక్షన్, వృత్తి సంబంధాలున్న ఒక సెక్షన్, సంచారజాతులు ఒక సెక్షన్ గా ఉంటున్నారు కాబట్టి.
ఈ మూడు సెక్షన్ల ను బిసి,ఎంబిసి, డినోటిఫైడ్ ట్రైబ్స్-డిఎన్టీ) సంచారజాతులుగా విడివిడిగా ఉమ్మడి బిసి ఉద్యమ నాయకత్వమే ఆర్గనైజింగ్ చేయాలి. ఈ మూడు పాయల నుండి మండల స్థాయి నుండి నాయకత్వాన్ని అభివృద్ధి పర్చాలి. భూమి సంబధాలున్న అభివృద్ధి చెందిన బిసిలంతా ఆధిపత్య వర్గాలకు ఓటు బ్యాంకుగా ఉంటూ ఎంబిసి,సంచారజాతులను సైతం ఆధిపత్య దోపిడి రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుస్తున్న విషయమూ తెలిసిందే.
బిసి ఉద్యమం నమ్మకూడనివారు వీరే! ఆధిపత్య కులాల యాజమాన్యంలో రాజకీయ పార్టీల అనుకుల మేధావులను,రచయితలను మాటకారి మోతుబర్లను బిసి ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు ఎప్పుడు ఇవ్వరాదు. గతంలో బిఎస్పీ దేశవ్యాప్తంగా ప్రభావం కనబర్చినప్పుడు కాంగ్రెస్ నేత శివశంకర్, సినిమా నటుడు చిరంజీవి లాంటి వాళ్ళు బిఎస్పీకిలో రావాలని చూశారు కానీ వారు బిఎస్పీ సిద్ధాంతాన్ని చూసి కాదు అధికారం వస్తుందనే అవకాశవాదంతో మాత్రమే.
ఈ రోజు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్ని బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ అనుకుల మార్గాన్ని అనుసరించే ఆధిపత్య కులాల యాజమాన్యంలోనివే.
కమ్యూనిస్టు పార్టీల్లో ఒక్క ఎంసిపిఐయు తప్ప అన్ని పార్టీలు విధానపరంగా భారతీయ తాత్విక సైద్ధాంతిక రాజకీయ పునాదులు లేనివే. మూలభారతీయ తత్వవేత్తలైన గౌతమ బుద్ధుడు,ఫూలే,సావిత్రి, అంబేద్కర్,సాహుమహారాజ్, పెరియార్,వీరబ్రహ్మేంద్రస్వామిల సామాజిక తాత్వకత సైద్ధాంతిక పునాదిపై ఏర్పడిన ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బిఎస్పీ మాత్రమే, కానీ దాదాసాహెబ్ కాన్షీరాం అనంతరం ప్రస్తుత నాయకత్వం తమ సైద్ధాంతికతకు తిలోదకాలు ఇచ్చిన కారంగా నేడు బహుజన ఉద్యమాలు వెనకబడటానికి కారణమైంది.
దేశవ్యాప్తంగా బిసి మేధావులు చేయాలసిన తక్షణ కర్తవ్వమేమిటంటే.బిసిలను ఆధిపత్య కులాల సాంస్కృతిక దోపిడి నుండి విముక్తి చేయడానికి ఫూలే,సావిత్రి, పెరియార్, నారాయణ ,అంబెడ్కర్,వీరబ్రహ్మేంద్రస్వామిల సాంస్కృతిక,సంప్రదాయాలవైపు మళ్ళించడమే. ఈ కార్యాకలాపాలకు పూనుకోవాలసిన తక్షణ కర్తవ్యాన్ని స్వీకరించాలి.
బిసి రాజ్యాధికార ఉద్యమానికి ఈ దశ అనంతరమే మార్క్సిజం ఆవశ్యకత అవసరముంటుంది. బిసిలు రాజ్యాధికారం పొందినప్పటికి బిసి రాజ్యాధికారం ద్వారా ఇందులో ఒక సంపన్న వర్గం ఏర్పడుతుంది కాబట్టి ఆ సంపన్న వర్గం నుండి సర్వ బహుజనులకు సమానత్వం సాధించే మార్గమే మార్క్సిజం.
“పూలే-అంబెడ్కర్,మార్క్సిజం” ద్వారానే సంపూర్ణ భారతీయ శ్రామిక బహుజన విప్లవం విజయవంతమవుతుంది.
(దండి వెంకట్. బహజన్ లెఫ్ట్ ఫ్రంట్, తెలంగాణ అధ్యక్షుడు)