ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ (రచయిత వేరే అయితే క్షమించాలి, చాలా కాలం ముందు చదివిన కథ ) రాసిన ఒక కథలో ఒక సినీ ప్రియుడు రైలు లో ప్రయాణం చేస్తూ వుంటాడు. చుట్టు వున్న తోటి ప్రయాణీకులతో మాటా మాటా కలిపి, తాను ఒక గొప్ప సినిమా రచయిత ననీ, తన ట్రంకు పెట్టె నిండా బొలేడు స్క్రిప్టులు ఉన్నాయని, మద్రాసు స్టేషన్ లో (ఇప్పటి చెన్నై) తన కోసం ఎన్. టీ. రామారావు, ఎస్ వీ రంగా రావు, రేలంగీ వాళ్ళంతా తనను రిసీవు చేసుకోవడానికి వస్తారని కోతలు కోస్తూ వుంటాడు. రైలు మద్రాసు చేరాక సదరు కోతల రాయుడు రైలు దిగి “ఏమిటీ ఎన్. టీ. రామారావు, ఎస్. వీ. రంగా రావు, రేలంగీ రాలేదే “ అని ఆశ్చర్య పోయి , చివరికి “ఓహో రైలు లో వాళ్లకి అబద్ధం చెప్పాను కదా” అని తమాయించు కుంటాడు.
ఈ కథ లోని సమాచారం కామెడీ అయినా దీని సందేశం మాత్రం కామెడీ కాదు.
మనం ముందుగా ఒక విషయం జరుగుతుందని అనుకుంటాం. అలా అనుకొనీ అనుకొనీ చివరికి దాన్ని నమ్మకంగా మార్చుకుంటాం. ఆ నమ్మకం నిజం కావాలని కోరుకుంటాం. అది జరగక పోతే కుంగిపోతాము. మనం తెలుసుకోవలసింది నమ్మకాలు వేరు, నిజాలు వేరని. ఉదాహరణకు, ఒక తండ్రి తన కొడుకు తాను నిర్ణయించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అనుకుంటాడు. అలా జరగాలని ఆకాంక్షిస్తాడు. అది నిజమవ్వాలని కోరుకుంటాడు. ఇది నమ్మకం. ఇది ఒక తండ్రి విషయం లో నిజం కావచ్చు. మరొక తండ్రి విషయం లో అబద్ధం కావచ్చు. అయితే దీనికి విరుధ్ధంగా నిజ మనేది ప్రతి ఒక్కరి విషయం లో నూ ఒకే ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకి, నిప్పులో చేయి పేడితే చేయి కాలుతుందనేది నిజం. ఇది ఎవ్వరి విషయం లో నైనా ఒక్కటే.
“ఊహలు” – కొంచం గంభీరమైన పదం. ఐమాక్సు (Imax) స్థాయి నుండి మామూలు నేల టికట్టు స్థాయి కి వస్తే వీటినే మనం “అనుకోవడాలు” (assumptions) అనొచ్చు. Assumption అంటే “నిజం అనుకునే ఒక నిరూపించనవసరం లేని అంశం”. మన జీవిత ప్రయాణం లో ప్రతి రోజూ మనం లేచిన దగ్గరినుండి మళ్లీ పడుకునేంత వరకు ఎన్ని అనుకోవడాలుంటాయో, ఎన్ని సార్లు మనం “అలా జరుగుతుందనుకో లేదు” అని ముఖం వేలాడేసిన సందర్భాలుంటాయో చూడండి.
చిన్నప్పటి కథ. ఒక పిల్ల వాడు తన తండ్రిని భయ పెట్టడానికి నాన్న పులి వచ్చింది అని అరుస్తాడు. తండ్రి పరిగెత్తు కు వెళ్లి చూస్తే పులి వుండదు. పిల్ల వాడు అబద్ధం చెప్పాడు. కాస్సేపటికి పిల్ల వాడు మళ్లీ పులి వచ్చింది అని అరుస్తాడు. మళ్లీ తండ్రి పరిగెత్తు కెళ్లి చూస్తాడు. పులి వుండదు. మళ్లీ పిల్ల వాడు అబధ్ధం చెప్పాడు. తండ్రి పిల్ల వాణ్ణి మందలిస్తాడు. మూడొసారి మళ్లీ పిల్ల వాడు పులి వచ్చిందని అరుస్తాడు. ఈ సారి పిల్ల వాడు అబధ్ధం చెబుతు న్నా డని తండ్రి వెళ్లడు. ఈ సారి నిజంగానే పులి వుంటుంది. పిల్లవాడు వుండడు.
ఈ కథ అబధ్ధాలు చెప్పకూడదు అనే నీతి ని తెలియ జేయడాని కైతే బాగానే వుంది. కానీ మనం పిల్ల వాడు అబధ్ధం చెబుతున్నా డు అనే తన assumption ని తండ్రి సరి చూసుకుని వుండాలి అన్న విషయానికి ఈ కథను అన్వయిస్తే, పిల్ల వాడు బ్రతికే వాడు. ఈ సంగతే త్రివిక్రం “సన్ అఫ్ సత్య మూర్తి “ సినిమాలో ప్రకాష్ రాజ్ చేత చెప్పించాడు.
ఈ రోజుల్లో ప్రతి కార్పోరేటు సంస్థలో ప్రాజెక్టు మానేజిమెంటు (Project Management) (ఈ పద ద్వయం యొక్క అర్థం అందరికీ తెలిసిఉంటుందనే వుద్దేశ్యం కొంత కారణంగా, దీనికి సరియైన తెలుగు పదం దొరకని కారణంగా ఈ సబ్జెక్టు పేరును ఇలాగే వాడుతున్నాను) అవసరం పెరిగిపోతోంది. దీన్ని చేపట్టడానికి ప్రాజెక్టు మానేజర్ల (Project Manager)ఉద్యోగాలు విపరీతంగా వెలుస్తున్నాయి. మన దైనందిన జీవితాలకు అన్వయిస్తే ప్రాజెక్టు మానేజిమెంటు ను ఒక పని నిర్వహణ గా చెప్పుకోవచ్చు. మనం రోజూ చేసుకునే పనుల్ని ఫల ప్రదంగా చేసుకోవడానికీ, ఆ పనులు చేయడం లో జరిగే అవకతవకల్ని నివారించడానికీ ప్రాజెక్టు మానేజిమెంటు లో వున్న పరికారాలు (పనిముట్లు) లేదా సాంకేతికత (టెక్నిక్) లు ఎంతో వుపకరిస్తాయి. అలాంటి ఒక టెక్నికే “Assumptions Validation”. అంటే మనం జరుగుతాయి అనుకున్న విషయాలు జరుగాతాయా లేదా ? మనం అనుకున్నది నిజమేనా? అని సరి చూసుకుంటూ వుండటం.
ఉదయం లేచిన దగ్గరినుండి మళ్లీ పడుకునేంతవరకు ప్రతి మనిషి చుట్టూ అనేకమైన ఊహలుంటాయి, ఎన్నో అనుకోవడాలు (assumptions) ఉంటాయి. ఈ క్రమ బద్ధతను ను ప్రతి మనిషి మాటి మాటికీ సరి చూసుకుంటూ వుంటాడు. ఉదాహరణకి మీరు ఉదయం 4 గంటలకి ఎయిర్ పోర్టు వెళ్లడానికి ఒక టాక్సి బుక్ చేసారనుకుందాం. అది 4 గంటలకు మీ ఇంటిముందుకు వచ్చి ఆగుతుంది అనేది ఒక assumption. అలా అనుకుని మీరు వూరికే వుంటారా? మూడు గంటలనుంచే ఆ టాక్సి డ్రయివరు కు ఫోను చేస్తూ వాడు టాక్సీ ని 4 గంటలకు మీ ఇంటి ముందుకు తెచ్చి ఆపే విషయం నిజమయ్యేంత వరకూ సరి చూసుకోరూ? ఆ టెన్షన్ అనుభవించరూ?
ఇలా సరి చూసుకుంటు వుండటం వల్ల వాడు రాక పోతే ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటాం. అయితే టాక్సీ విషయం లో ఈ టెక్నిక్ వాడిన మనం కొన్ని ముఖ్య మైన సందర్భాల్లో ఈ సరి చూసుకోవడం అనే టెక్నిక్ ని వాడకుండా కష్టాల్లో పడి పోయి ఇలా జరుగుతుందనుకోలేదు అని ముఖం వేలాడేస్తాం.
అయితే ప్రతి చిన్న విషయానికి ఈ పధ్ధతి వాడినా జీవితం అశాంతి మయంగా మారొచ్చు. మనం అనుమాన పురుగులుగా మారి పోవచ్చు. అయితే ఈ assumptions validation అన్నది చాలా విషయాల్లో అవసరం. ఏ విషయం లో నైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం లోని నిజా నిజాలు నిర్ధారించుకోవడం అన్నది చాల అవసరం. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు మానేజర్ల విషయం లో. ఈ క్రింది వుదాహరణ చూడండి. ఇదొక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు PMP (ప్రాజెక్టు మానేజిమెంట్ ప్రొఫెషనల్) పరీక్షకు వెళ్లే అభ్యర్తులకు వస్తాయి.
మీరొక ప్రాజెక్టులో ప్రాజెక్టు మానేజర్ (PM) గా పని చేస్తున్నారు. మీ టీము లో సునీల్, అజయ్ అనే ఇద్దరు టీం (Team) మెంబర్లు వున్నారు. ఒక రోజు సునీల్ మీ వద్దకు వచ్చి అజయ్ సరి యైన నిబంధనల్ని పాటించకుండ ప్రాజెక్టు లో ఒక మార్పు చేసాడనీ దాని వల్ల ప్రాజెక్టు దెబ్బ తిన్నదని చెబుతాడు. ఒక ప్రొఫెషనల్ ప్రాజెక్టు మానేజర్ గా మీరు మొట్ట మొదట ఏం చేస్తారు?
ఈ ప్రశ్న ఆప్షన్లు ఇవి
ఈ ప్రాజెక్టు చాలా క్లిష్టమైన ప్రాజెక్టు (critical project) కాబట్టి, ఈ విషయాన్ని వెంటనే మీ సి. ఈ. ఓ. (CEO) కు తెలియచేస్తారు
మొత్తం టీము ను సమావేశ పరిచి, వచ్చిన సమస్యను తీర్చి, ప్రాజెక్టును సరియైన దారి లో పెడతారు
ప్రాజెక్టులో మార్పులు చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలని పాటించాలి అనే విషయాల్ని అందరికి తెలియ జేస్తారు
అజయ్ ను కలిసి మాట్లాడతారు.
మీకు ఈ పాటికే సమాధానం తెలిసి వుంటుంది. మొదటి మూడు ఆప్షన్లు సమస్య జరిగిందని నిర్ధారించు కున్న తరువాత చేసే పనులు. చివరి ఆప్షన్ నిజంగా సమస్య జరిగిందా లేదా అని తెలుసుకునేది. అదే సరియైన సమాధానం. మొట్ట మొదట ప్రాజెక్టు మానేజరు చేయవల్సిన పని నిజా నిజాలు తెలుసుకోవడం నిర్ధారించు కోవడం..
పామూ ముంగిస కథ గుర్తు తెచ్చు కోండి.
తాను పిల్ల వాడికి కాపలా గా పెట్టిపొయిన ముంగిస రక్తపు నొటితొ ఎదురొచ్చేసరికి అది తన పిల్లవాణ్ని చంపివుంటుందని రైతు ముంగిసను చంపేస్తాడు. నిజానికి ముంగిస నోటి మీద వున్నది, ఇంట్లోకి వచ్చిన పాముతో యుధ్ధం చేసి దాన్ని చంపినందువల్ల అంటిన రక్తం. ఈ విషయం తెలుసుకుని తరువాత పాస్చాత్తాప పడతాడు ఆ రైతు. Assumption Validation అనేది మన జీవితం లో మనల్ని ఎన్నో ప్రమాదాల్నించి కాపాడుతుంది. ముందు జాగ్రత్తల్ని తీసుకోవడం లో సహాయ పడుతుంది. ప్రత్యామ్నాయాలని (alternatives) వాడుకునే అవకాశాలని కలిపిస్తుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య అపోహలు రాకుండా చూస్తుంది.
వ్యక్తిత్వ వికాసం ఒక పని చేయడానికి తగిన ప్రేరేపణ ఇస్తే, ప్రాజెక్టు మానేజిమెంటు (Project Management) ఆ పనిని సౌకర్య వంతంగా ఎలా చేయవచ్చో చెబుతుంది. ప్రాజెక్టు మానేజి మెంటు లో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు, పరికరాలూ, టెక్నిక్కు లూ వున్నాయి. ప్రాజెక్టు మానేజి మెంటు అంటూనే చాలా మంది, పెద్ద పెద్ద డ్యాములూ, మీటరు స్కేళ్లూ, వెడల్పాటి టేబుళ్లకు అడ్డంగా పడి గీచే డ్రాయింగులూ అనుకుంటారు. దానికి దూరంగా జరుగుతారు. అసలు ప్రాజెక్టు మానజిమెంటు మన చుట్టునే వుంది. ప్రాజెక్టు మానేజిమెంటు పనుల్ని సవ్యంగా ఎలా చేయవచ్చో చెబుతుంది. అలా చేయడానికి అవసరమైన పరికరాల్ని, మెళకువల్నీ తెలుపుతుంది.
Assumption మంచిదా కాదా?
Assumption మంచిదా కాదా అన్న దాని మీద నిర్దుష్టమైన అభిప్రాయాలు లేవు. అదీకాక, ఈ విషయం సందర్భాన్ని బట్టి కూడా మారుతుంది. ఉదాహరణకి, తన వ్యాపారం వృద్ధి చెంది ఫల ప్రద మవుతుంది అని ఒక వ్యాపార వేత్త అనుకోక పోతే అతడు వ్యాపారం లో ముందుకు సాగలేడు. ఇక్కడ assumption అవసరం.
ఒక పడవలో ప్రయాణం చేసే వాడు పడవ మునిగి పోతుందని అనుకోకూడదు. అతడు ప్రయాణం చేయలేడు.కానయితే అతడు తన ప్రయాణం సాఫీగా సాగుతుందని అనుకోవాలి. ఇక్కడ దిశ మారుతుంది అంతే కానీ ఒకలా అనుకోకూడదంటే మరోలా అనుకోవాలనే అర్థం కదా. ఈ అనుకోవడాలే పెరిగి పెద్దవయి పాజిటివ్ దిశలో వెళితే కలలు గా మారవచ్చు, అవే నెగెటివ్ దిశలో వుంటే అనుమానాలూ, భయాలు గా మారవచ్చు. లెదా మూఢ నమ్మకాలు గా మార వచ్చు.
Project Management మనం చేసే పనుల్లో, assumptions వుంటాయనీ వాటిని ఎప్పటికప్పుడు నిజనిర్ధారణ కు లోను చేయాలని మాత్రమే చెబుతుంది. భావోద్వేగాలు ప్రవేశిస్తే నిజ నిర్ధారణ కొత్త పోకడలు పోతుంది. ఫలితాలు వ్యాకులం కలిగించేవి గా వుండవచ్చు వీటి వల్ల నష్టాలు కూడా వాటిల్ల వచ్చు.
ఉదాహరణకి ఇందాక చెప్పిన టాక్సీ సంఘటనే తీసుకుందాం. అతృత అనే భావోద్వేగం వల్ల ప్రతి రెండు నిమిషాలకీ ఫోను చేస్తున్నా మనుకుందాం, వాడు మనల్ని తిట్టి మూడ్ పాడు చేయవచ్చు, లేదా కాన్సిల్ చేసి అసలు రాకుండా వెనక్కి వెళ్లి పోవచ్చు. assumptions ఎలా సంబాళించుకోవాలో మనం నిర్ణయించు కోవాలి. ఇక్కడ మానసిక శాస్త్రం, వ్యక్తిత్వ వికాసం సహాయ పడతాయి.
నిజం చెప్పాలంటే ఇంటి పనులు చక్కగా చేసుకునే ఓ గృహిణిని మించిన ప్రాజెక్టు మానేజరు మరొకరుండరంటే అతిశయోక్తి కాదేమో