(C Ahmed Sheriff)
మీ గుండె కాయ జాగ్రత్త, జంక్ ఫుడ్ తినొద్దండి
మీ లివర్ జాగ్రత్త , జంక్ ఫుడ్ తినొద్దండి
మీ జీర్ణాశయం జాగ్రత్త, జంక్ ఫుడ్ తినొద్దండి…
అని డాక్టర్లఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. అయితే, భారత దేశంలో ఉన్నట్లుండి జంక్ ఫుడ్ వ్యాపారం సగానికి సగం మాయమయింది. పాత బంగారం ఆయుర్వేదానికి (Ayurved) మెరుగుపడుతున్నారు. ఇమ్యూనిటీ పెంచుతుందంటే చాలు, ప్రతికాయ, ఆకు, పండు,కాండం, బెరుడు,విత్తనాలు కొరికి చూస్తున్నారు. పొడిగొట్టి భద్రపరుకుంటున్నారు, జ్యూస్ చేసి ఫ్రిజ్లో దాచుకుంటున్నారు. కషాయం కాంచుకుని మూడుపూటలా మిస్సవకుండా తాగుతున్నారు. దీనితో ఆయుర్వేద మందులు, ప్యాకేచేసిన ఫుడ్స్ వాడకం పెరిగింది. ఇది కరోనా తెచ్చిన కొత్తదనం.
పాండెమిక్ లాక్ డౌన్ లో దొరికిన లీజర్ ని ప్రజలంతా ఎలా అరోగ్యంగా బతకాలలో, ఎలా ఆరోగ్యంగా ఎలాతినాలో, లీజర్లో ఎలా కాలక్షేపం చేయాలనేదాని గురించి ఆలోచిస్తున్నారు.ఈ జీవితానికి సరిపోయే ఆహారా పానీయలు, వాటిని తయారు చేసుకునే పద్ధతులు,నిల్వ చేసుకునే సామాన్లు కొనడంతో వాటి బిజినెస్ విపరీతంగా పెరిగింది. అదేంటో చూద్దాం:
ఫోను డయల్ చేస్తూనే ప్రతి ఒక్కరికీ వినపడే “జనహితార్థం భారత ప్రభుత్వం చేత జారీ చేయబడ్డ” సందేశమిది.
వాట్సాప్,ఫేస్ బుక్ పొద్దునే వోపెన్ చేస్తూనే పది మంది మిత్రులు వంద రకాల సలహాలు , రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ పని చేయండి…అని
ఈ రొజు ప్రపంచం మొత్తం కరోనా తో యుధ్ధం చేస్తోంది. ప్రతిమనిషి శాయశక్తులా శత్రువుతో సైనికుడిలా పోరాడుతున్నాడు.
ఈ యుద్ధాన్ని అంతమొందించడానికి అత్యుత్తమమైన మార్గం ఆ యుద్ధం మొదలు పెట్టక పోవడమే. అంటే యధ్ధం రాకుండా ఆపడమే. అంటే కరోనా మనల్ని తాకకుండా చూసుకోవడమే. అంటే మన రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే.
లాక్ డౌన్, సామాజిక దూరం మనం కోవిడ్ 19 బారిన పడకుండా చాలావరకు సహాయపడినా, వంద శాతం మనం సురక్షితంగా వుంటామన్న నమ్మకం లేదు.
కోవిడ్ 19 వల్ల వ్యాధి సోకకుండా వుండటానికి వాక్సిన్ లేదు. అది సోకితే బాగు చేయడానికి మందులేదు.ఈ విషయాల నేపధ్యం లో కరోనా బారిన పడకుండా తప్పించు కోవడానికి వున్న ఒకే ఒక మార్గం మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడ మే.
ఈ నగ్నసత్యం మనుషుల జీవన శైలిని ఊహించని రీతిలో మాార్చేసింది.
కోవిడ్ 19 పాండెమిక్ మనుషుల ఆరోగ్యానికి సంబంధించి శుచి, శుభ్రత ల విషయాల్లో మాస్కులు ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళూ చేతులు కడుక్కోవడం, ఇంట్లొ వున్నా మాటిమాటికీ చేతులూ ముఖం శుభ్రం చేసుకోవడం లాంటి అనేకమైన మంచి పనుల్ని అలవర్చుకునేట్లు చేసింది.
ప్రజలంతా “ఆరోగ్యమే మహా భాగ్యం” అనే పెద్దల మాటని కొంచం మార్చి “అరోగ్యమే శ్రీరామ రక్ష” అనే దిశలో తమ దైనందిన జీవితాన్ని,ఆచార వ్యవాహారాల్నీ, ఆహారపు అలవాట్లనీ మలుచు కుంటున్నారు.
దీని మూలంగా కొన్ని వస్తువుల వినియోగాలు విపరీతంగా పెరిగాయి.కొన్ని సరుకుల మార్కెట్ పడిపోయింది.
పాండెమిక్ ప్రభావం వల్ల దేశపు ఆర్థిక స్థితి అతలా కుతలమైపోయింది. మాల్స్ మూత బడ్డాయి, సినిమా హాళ్లు లేవు, కొన్ని రకాల వ్యాపారాలు (ఫాషన్, బట్టలూ ) ఆడుగంటి పోయాయి. అయితే అదే సమయంలో కొన్ని వ్యాపారాలు ఆకాశాని కెగిశాయి.
ఈ రోజుల్లో జనమంతా హోం రెమిడీస్ వెదుక్కుంటున్నారు. అల్లం, మిరియాలూ, నిమ్మకాయలూ, జీలకర్ర, లవంగాలూ, దాల్చిన చెక్క మొదలైన మసాల దినుసుల్నీ, సుగంధ ద్రవ్యాల్నీ వాడీ వాటితో తయారు చేసిన రక రకాల కషాయాల్ని తాగడంతో మొదలయింది.
వీటి వినియోగం పెరిగిపోయిందందు వల్ల మార్కెట్లో సదరు పదార్థాల ధరలు పెరిగాయి. అంతే కాక ఇలాంటి వస్తువులు రాను రాను అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు వున్నాయి.
రోగ నిరోధక శక్తి అనగానే మన చూపులన్నీ ఆయుర్వేదం వైపు తిరుగుతాయి. మనకు తెలిసిన ఆయుర్వేద సంస్థలు, డాబర్, హిమాలయా సంస్థల వుత్పత్తుల్లో అరోగ్యాభి వృధ్ధికీ, రోగ నిరోధక శక్తి పెంచుకోవడనికి ఏమున్నాయా? అని వెదుకుతాం.
ముసలి తనం లోనూ యవ్వనం, దేహ దారుఢ్యం కలిగివుండటానికి డాబర్ చ్యవన్ ప్రాశ్ తీసుకోండి అనే డాబర్ అడ్వర్టయిజు మెంటు కళ్ల ముందు కదుల్తుంది.
ఉసిరి కాయ, తేనే, ఔషధపు మొక్కలు, వాడి తయారు చేసిన చ్యవన్ ప్రాస్ మంచి ఫలితాలిస్తున్న సంగతి తెలిసిందే. అంతే దాని గిరాకి పెరిగింది. దీనిని సోషల్ మీడియా బాగా పాపులర్ చేసింది.
అంతర్జాలం లోదొరికిన సమచారం ప్రకారం చ్యవన్ ప్రాస్ అమ్మకాలు ఒక్క జూన్ నెలలోనే 283% (ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం కాదు, రెండు వందల ఎనభై మూడు శాతం) పెరిగాయి.
బ్రాండెడ్ తేనె అమ్మకాలూ 39% పెరిగాయి. భారత దేశం లోనే అత్యధిక ఆయుర్వేద ఉత్పాదనలు కలిగి వున్న డాబర్ అందించిన సమాచారాం ప్రకారం ఏప్రిల్, జూన్ ల మధ్య వారి చ్యవన్ ప్రాస్ అమ్మకాలు 700% వృధ్ధి చెందాయి. ఇది తాత్కాలికమైన డిమాండు కాదు. ఈ కొనుగోళ్లు ఇంకా కొన్ని నెలలు ఇలాగే కొనసాగు తాయని అంచనా.
సాధారణంగా వయసు మళ్ళిన వారు తిరిగి తమ యవ్వనపు శక్తిని పొందడానికి వాడే ఈ ఔషధీయ సప్లిమెంటు ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచు కోవడానికి వయోబేధం లేకుండా ఇంటిల్లిపాదీ తెగ వాడుతున్నారట
స్ట్రీట్ ఫుడ్ మాయం
కరోనా వల్ల వీధుల్లొ దొరికే ఆహారం, చిరు తిళ్ళూ (Street Food) కనుమరుగై పొయాయి. టిఫిన్ సెంటర్లు మూత బడ్డాయి. బయట దొరికే ఇడ్లీ, వడా, పునుగులూ, బజ్జీల లాంటి చిరు తిళ్లూ, టీ బంకుల దగ్గర గంటలకొద్దీ నిలబడి, సిగరెట్లు తాగే సాయంకాలం సరదాలు కనుమరుగయ్యాయి.
తిండి విషయానికి వచ్చేసరికి ప్రజలు మరింత ఒక్క దెబ్బతో గతంలో ఎపుడూ లేనంతగా అప్రమత్తమై పోయారు. శుచి అంటున్నారు, శుభ్రత అంటున్నారు. నీట్ గా పాకింగ్ చేసి వచ్చిన అహార పదార్థాలనే కోరుకుంటున్నారు.
ఒక రకంగా వీటిని మనం “హ్యుమన్ అన్ టచ్డ్” ఆహార పదార్థాలనొచ్చు. పాకేజ్డ్ “ఇన్ స్టాంట్” తిండి పదార్థాలకి గిరాకీ పెరుగిపోయింది. ఈ జాబితాలో బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్, “హీట్ అండ్ ఈట్” చపాతీలు, కూరలూ లాంటివి వాటికి గిరాకీ పెరిగింది.
తమాషా ఏంటంటే, మాగీ నూడుల్స్, కిట్ కాట్, మంచ్ లాంటి తినుబండారాలు విపరీతంగా సేలవుతున్నాయ్.
పాపులర్ మాగీ నూడుల్స్ సంస్థ నెస్లే ఇచ్చిన సమాచారం ప్రకారం, వీటి కొనుగోళ్ళు మార్చి నెల త్రైమాసికం లో 10.7% పెరిగాయి. మన ప్రజలకు బిస్కట్ల పై మక్కువ ఎక్కువ. ఈ కారణంగానే “పార్లే-జీ” బిస్కట్లు (Biscuit sales) వాటికి సంబంధించిన ఇతర వుత్పాదనల అమ్మకాలు ఏప్రిల్, మే నెలల్లో బాగా పెరిగాయి. అలాగే ఇలాంటి వుత్పాదనలే ఉన్న మరో సంస్థ బ్రిటానియా (Britannia) ఈ సమయంలో మరో లబ్ధిదారు అయింది.
క్రమ బధ్ధత, శుచీ శుభ్రతా లేని వీధి చిరుతిళ్ళ నుంచి ప్రజలు శుభ్రంగా పాక్ చేయబడిన సౌకర్య వంతమైన ఆహారం వైపు ఆకర్షితువుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ దాదాపు కనుమరుగైపోయినట్లే. ఇది మరింత ఆరోగ్యకరం. ఇదంతా పాండెమిక్ ప్రభావమే.
మారుతున్న వినియోగాలూ, కొనుగోళ్ళూ
ఇక ఈ లాక్ డౌన్ లో కొనుగోళ్లు పెరిగిన మరో క్షేత్రం ఎలెక్త్రానిక్ వస్తువులది. ముఖ్యంగా లాప్ టాపులు. ఇది విదితమే. ముఖాముఖి సంభాషణలు కరువైన నేపధ్యం లో ప్రజలు డిజిటల్ స్క్రీన్ లకు అతుక్కు పోయి ఫోన్లూ, ట్యాబులూ, ల్యాప్ టాపు ల ద్వారా, మిత్రులతో, మిగతా ప్రపంచం తో సంపర్కం కలిగి వుండటానికి ఇవి తప్పవు మరి.
వర్క్ ఫ్రం హోం కి, పెద్దల కోసం సంగీతం, డాన్సుల వంటివి నేర్పించే ఆన్ లైన్, క్లాసులకు, పిల్లల స్కూలు ఆన్ లైన్ క్లాసులకూ, వినోదానికి, డిజిటల్ మీడీయా అవసరమైంది. ల్యాప్ టాపులూ (Laptop Sales), స్మార్ట్ ఫోన్లూ విరివిగా అమ్ముడయ్యాయి. ఇంట్లో కూర్చుని, కూర్చుని బోరెత్తిన జనం తమ వినోదానికి, ఉల్లాసానికీ, “నెట్ ఫ్లిక్సు” , “ప్రైం వీడియో”, “జీ5” లాంటి స్ట్రీమింగ్ చానెళ్ళ వాడకం మొదలెట్టారు. వీటి వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన సినిమాలూ, వెబ్ సీరీస్ లు చూసే అవకాశం వున్నందున వేలాది అకౌంట్లు రిజిస్టర్ అయ్యాయి.
పాండెమిక్ లో జనం కొంటున్నవివే…
జీవితంలో గతంలో ఎపుడూ లేనంతగా శుచి, శుభ్రత, ఇమ్యూనిటీ వంటి మాటలకు ప్రాముఖ్యం పెరగడం మార్కెట్ కు టానిక్ లాగా పనిచేసింది. శుచిగా,శుభ్రత, ఇమ్యూనిటి వూరికే రావుగా. అదొక ఆర్థిక వ్యవస్థ. డబ్బులు బటయకు తీయాలి. మార్కెట్ తనిఖీ చేయాలి, ఆన్ లైన్ బుక్ చేయాలి. కొనాలి. వాడాలి. ఇదంతా పెద్ద ఎకనమిక్ యాక్టివిటి. దీనితో పాండెమిక్ కాలంలో ప్రజలు వ్యాక్యూం క్లీనర్లు, మిక్సర్, గ్రైండర్లు, జ్యూసర్లు లాంటి కిచన్ పరికరాల మీద కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు మార్కెట్ సర్వేలు చెబుతున్నాయ్.
ఇవి కాక మనం ఉహించని కొన్ని వస్తువుల అమ్మకాలు పెరిగాయి. ఇవికాకుండా కుదలయిన మార్కెట్లో చలనం తీసుకువచ్చిన సరుకులు కొన్ని ఉన్నాయి. అవి స్త్రీ, పురుషులు వాడే ఎలెక్ట్రానిక్ గ్రూమింగ్ పరికరాలు.వీటన్నింటిని కలిసి do-it-yourself (DIY) ప్రాడక్ట్స్ అంటారు. వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది.
ఉదాహరణకి, మగవారి హెయిర్ ట్రిమ్మర్లు (Hair Trimmers) (సెలూన్ కి పోకుండా వీటితో మనమే హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు).పురుషుల ఎలెక్ట్రిక్ గ్రూమింగ్ కిట్లను తయారు చేసే హావెల్సు కంపేనీ కథనం ప్రకారం అమ్మకాలు 5 నుంచి 6 రెట్లు పెరిగాయి.
దీనికి కారణం హెయిర్ కటింగ్ సెలూన్లు చాలా కాలం మూత బడటమే. ఫిలిప్సు ఇండియా కథనం ప్రకారం ఇలాంటి వస్తువుల అమ్మకాలు 60% – 70% పెరిగాయి ఇవన్నీ ఊహించని కొత్త కొనుగోళ్ళు, జనానికి కొత్త ఖర్చులు. వ్యాపారాలకు కొత్త రాబడి.
కష్టాల్లో అండగా నిలిచిన బంగారు
అయితే కొంతమంది జీవితాలు కరోనా కాలంలో బాగా దెబ్బతిన్నాయి.ధరలు పెరిగాయి. ఉద్యోగాలు పొయాయి. డబ్బుకి కటకట. కరోనా భయంతో ఆరోగ్య జాగ్రత్తలు వస్తువులు కొనాల్సి వస్తోంది. కొత్త వస్తువులు, మందో మాకో కొనాల్సి వస్తుంది. భయంతోనైనా కొన్ని కొని దాచుకోవలసి వస్తున్నది. వీటికి డబ్బు కావాలి. చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాల్ని పునరుధ్ధరించుకోవడానికి డబ్బు కావాలి. వుద్యోగాలు పోగొట్టుకున్నవారు ఈ పాండెమిక్ తాకిడికి తట్టుకోవడానికి డబ్బు పోగేసుకోవాలి. ఎలా? ఇలాంటి దుర్ధలో మిలమిలలాడుతూ కనిపించేది బంగారమే. ఆభరణాలపై ఋణాలు తీసుకోవాలి. ప్రజలు విపరీతంగా బంగారును తాకట్టు పెడుతున్నారు. దానికి తోడు ఇపుడు రిజర్వు బ్యాంకు బంగారు రుణం పరిధి ని 75 శాతం నుంచి 89 శాతానికి పెంచింది.
ఇాలాంటి కుదువ వ్యాపారంలో పేరుమోసిన ముతూట్ ఫైనాన్సు లావాదేవీలు దీనివల్లే బాగా పెరిగాయి, మనప్పురం ఫైనాన్సు గోల్డు లోన్లు 4.5% శాతం పెరిగాయి.
శుచీ, శుభ్రతల కోసం ప్రజలు ఖర్చు పెడుతున్న డబ్బు, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి వారు అవలంబిస్తున్న జీవన శైలి, మంచి ఫలితాల నివ్వాలనీ కోరుకుందాం. కరోనాతో యుధ్ధాన్ని ఆపుదాం.
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610
(C Ahmed Sheriff)