రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడానికి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాాదాలు. ఈ పథకంతో పాటు రాయలసీమ చట్టబద్ద నీటి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఇంకా కొన్ని ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాము.
రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ కు పిర్యాదు చేయడం, తెలంగాణ నిర్మిస్తున్న నూతన సాగునీటి ప్రాజక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిర్యాదు చేయడంతో కేంద్ర జలవనురల శాఖ ఈ నెల 5 న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ విజ్ఞాపన పత్రం మీకు పంపుతున్నాము.
రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు మరియు రాయలసీమ న్యాయమైన సాగునీటి కేటాయింపులకై ప్రభుత్వం సరైన వాదనలను ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంధర్భంగా ప్రభుత్వం కింద పేర్కొన్న కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
1. సరైన రిజర్వాయర్లు, కాలువలు లేక పోవడం వలన తుంగభద్ర ప్రాజక్టు కింద చట్టబద్దమైన నీటి వాటాను రాయలసీమ ప్రాజక్టులైన తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె సి కెనాల్, జిడిపి గత 7 దశాబ్దాలుగా వినియోగించుకొనలేక పోతున్నాయి.
2. శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటి మట్టం 854 ఉంచక పోవడం వలన చట్టబద్ద నీటి హక్కులున్న SRBC, KC కెనాల్, మరియు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరి సక్రమంగా నీటిని పొందలేక పోతున్నాయి. దీనికి తోడు సరైన కాలువల సామర్థ్యం లేకపోవడంతో కూడా ఈ ప్రాజెక్టులకు నీరు సక్రమంగా లభించడం లేదు.
3. పైన పేర్కొన్న రాయలసీమలో నిర్మించిన, నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల స్థిరీకరణ కోసం రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు, రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన కింద వివరించిన పలు అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలు:
1. తుంగభద్ర ప్రాజక్టు కింద రాయలసీమ ప్రాజక్టులు వాడుకొనలేని నీటిని శ్రీశైలం రిజర్వాయర్లో నిలువ ఉంచుకునే హక్కు సాదించాలి.
2. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి.
3. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మల్లించడం ద్వారా ఆదా అయిన 45 టీ.ఎం.సీ. ల కృష్ణా జలాలు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి.
4. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిదులు సాదించాలి.
5. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరపాలి.
6. ఎస్ ఆర్ బి సి, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ లకు నీరు సక్రమంగా లభించడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి.
7. వై స్ జగన్ మోహన రెడ్డి గారు పలు సందర్భాలో హామి ఇచ్చిన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి కె సి కెనాల్ అంతరించి పోకుండ పరిరక్షించాలి.
8. హంద్రీ నీవా లిఫ్ట్ మరియు కాలువ సామర్థ్యం11000 క్యూసెక్కులకు పెంచాలి.
(బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి)
(ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పింపిన వినతిపత్రం)