(సీమ సాహిత్య, సామాజికోద్యమానికి అవిరళ కృషి చేసిన పాండురంగారెడ్డికి- ఘన నివాళి)
(Dr Appireddy Harinatha Reddy)
రాయలసీమ ప్రాంత సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలలో ఉపాధ్యాయ రంగం, పత్రికా రంగం, వామపక్ష భావజాల నేపథ్యంగా వచ్చి పనిచేసిన అనేకమంది గత దశాబ్దాల కాలంగా చూశాం. అలాంటి వారిలో వైవిధ్యమైన వ్యక్తిగా, కాదు శక్తిగా బి.పాండురంగారెడ్డి సీమ చరిత్రపుటలలో నిలుస్తారు. ప్రగతిశీల భావాజాలంతో వివిధ సంఘాలలో పని చేయడంతోనే ఆగి పోకుండా ఒక నిర్దిష్ట ప్రాంత వెనుకబాటుతనం పై గళమెత్తాడు.
సీమ సమకాలీన ఉద్యమాలలో క్రియాశీలకంగా పని చేసాడు. అన్నింటికీ మించి సీమ సాహిత్య ఉద్యమానికి సీమ సాహితి పత్రిక ద్వారా ఆయువుపట్టుగా నిలిచాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సీమ ప్రయోజనాల కోసం నిలబడిన పప్పూరు రామాచార్యుల “శ్రీ సాధన”, రాజ గోపాలరెడ్డి “మాసీమ”, ఇమామ్ ” కదలిక” పత్రికల కోవలో “సీమ సాహితి” ని నిలిపే ప్రయత్నం చేసారు.
కర్నూల్ జిల్లా నంద్యాల సమీపంలోని, శిరువెళ్ళ మండలం లోని గోవిందపల్లె లో 1946 లో పాండురంగారెడ్డి జన్మించారు.
తిరుపతిలో విద్వాన్ పూర్తి చేసి 1968 లో కర్నూలు జిల్లాలో ని మొలగవల్లి లో ఉపాధ్యాయుడుగా చేరాడు. ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర కార్యదర్శిగాను పని చేసారు. “ఉపాధ్యాయ” పత్రికకు 1992-2006 దాకా సంపాదక వర్గ బాధ్యత నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసారు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే సామాజికోపాధ్యయుడు అనేక పోరాటాలలో పాల్గొన్నారు.
1970 లో విరసంలో సభ్యలయ్యారు. అప్పట్లో “సంకెళ్ళు తెంచుకొందాం..” కవితా సంపుటి ని ప్రచురించాడు. విప్లవభావాజాలంతో తాడిత పీడిత వర్గాల తాత్విక భూమికగా ఆ కవితలు నిలుస్తాయి.
1975 లో అనంతపురములో జరిగిన విరసం ఐదవ రాష్ట్ర మహాసభలలో సిద్దాంత పరంగా ఒక వర్గం విభేధించారు. వారిలో పాండురంగారెడ్డి ఒకరు. విరసం కు రాజీనామా చేసి 1975 లో “జనసాహితి” సంస్థ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు.1978 దాకా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు.
1983 లో రాయలసీమ వెనుకబాటు రూపుమాపేందు రాయలసీమ విమోచన సమితి ఆద్వర్యంలో డా. యం.వి రమణారెడ్డి ఉద్యమం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలవారు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు అందులో ఉన్నారు.
1984 లో ఉద్యమ నిర్వహణకు విస్తృత ప్రాతిపాదికన రాయలసీమ ఉద్యమ కార్యాచరణ కమిటి ఏర్పడింది. తర్వాత 1985లో రాయలసీమ సంయుక్త కార్యాచరణ కమిటిగా కడపలో మహాసభలు నిర్వహించారు. ఈ కమిటీలో ఉపాధ్యాయ రంగాల నుండి పాండురంగారెడ్డి, రాచంరెడ్డి వెంట్రాముడు, భూమన్ తదితరులు క్రియాశీలక పాత్రపోషించారు. ఆ దశాబ్ద కాలంలో జరిగిన సీమ ఉద్యమాలలో తనవంతు కృషి చేసారు.
1991 లో సారా వ్యతిరేక ఉద్యమంలో,1993 లో పౌరహక్కుల నేత బాలగోపాల్ , కామ్రేడ్ సంధ్యల ఏర్పడిన రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట సమితి కార్యకలాపాలలో బాధ్యత నిర్వహించాడు.
పౌర హక్కుల సంస్థ ఒపిడిఆర్ లోను పని చేసారు.
1996 లో సీమసాహిత్యం, సాంస్కృతిక రంగాలలో కృషి జరగనిదే కేవలం సామాజిక, రాజకీయ పోరాటలతో సీమ ప్రజలను చైతన్యవంతం చేయలేమని గుర్తించాడు. నంద్యాల కేంద్రంగా “సీమ సాహితి ” సంస్థను ఏర్పాటు చేశాడు. సీమలోని అనేక మంది రచయితలతో సంప్రదించి అందులో భాగస్వామ్యం చేసాడు. సీమ ప్రత్యామ్నాయ గొంతుకగా సీమ సాహితి ప్రారంభమైంది. 1996 జనవరి నెలన తొలి సంచిక వచ్చింది. విద్వాన్ విశ్వం, శ్రీబాగ్ ఒడంబడిక, నెత్తుటి మడుగుల్లో రాయలసీమ, బళ్ళారి రాఘవ అలా ప్రత్యేక సంచికలతో కలుపుకొని ఏడు సంచికలు 1998 దాకా వెలువడినాయి. ఆ తర్వాత పత్రిక ఆగింది. ఏడు సంచికలే అయినా అవి ఇచ్చిన స్ఫూర్తి ఎంతో వెలకట్టలేనిది. పత్రికకు అనుబంధంగా సీమ సాహితి గ్రంథాలయం కూడా నంద్యాలలో ఏర్పాటుకు కృషి చేసాడు.
కేవలం పత్రిక తీసుకొని రావడమే కాక ఆ రోజులలో సీమ విషయంగా ఎన్నో వ్యాసాలు రాసిన భూమన్ గారి “రాయలసీమ ముఖచిత్రం” పుస్తకం సీమ సాహితి పక్షాన ప్రచురించారు.
పి .రామకృష్ణారెడ్డి గారి “పెన్నేటి కథలు “, “మనిషి -పశువు” పుస్తకాలు ప్రచురించి సీమ రచనలు వెలుగులోకి తీసుకొచ్చాడు. విద్వాన్ విశ్వం పెన్నేటి పాట మొదలుకొని మరెన్నో పుస్తకాల ప్రచురణకు ప్రయత్నం చేసాడు. ఉపాధ్యాయ పత్రిక పక్షాన “కెరటాలు” కవిత్వ సంకలనానికి సంపాదకులుగా ఉన్నారు.
ఉద్యోగ పదవీ విరమణ అనంతరం 2001 లో రాయలసీమ ఉద్యమ సన్నాహక కమిటీ ఏర్పాటు చేసారు. రాజకీయ ప్రక్రియపైనే సీమ బాగోగులు ఆధారపడినాయని 2004 లో “రాయలసీమ పార్టీ” ఏర్పాటు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో శ్రీ కృష్ణ కమిటికీ నివేదిక సమర్పించి సీమకు న్యాయం చేయాలని కోరాడు. రాజధాని విషయమై శివరామన్ కమిటీకీ శాస్త్రీయ అంశాలతో నివేదిక ఇచ్చాడు.
2014 ఆగష్టు లో “రాజధాని రాయలసీమ హక్కు” అని చిన్న బుక్ లెట్ గా ఆ వ్యాసంలోని అంశాలను జెన్నే మాణిక్యమ్మ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.
తన జీవిత కాలంలో ప్రగతిశీల ఉద్యమాలకు, రాయలసీమ బాగోగులకు కోసం ఎక్కువ సమయం కేటాయించాడు.
సీమ సాహితీ సేవకుడుగా ఆయన కృషి ఎంతో స్ఫూర్తిని, బాధ్యతను కలిగిస్తుంది. పాండురంగారెడ్డి మనల్ని ఈ రోజు వదిలి వెళ్ళినా, మనకు కావలసినంత సీమ సాహిత్య, సాంస్కృతికోద్యమ పనికి దారి చూపాడు. నిబద్ధతగా ఆ పనిని కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళి.
———————-
# డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక.
(Dr Appireddy Harinatha Reddy, teacher, Kendra Sahitya academy Yuva Puraskar awardee-Convenor, Rayalaseema Samskrutika Vedika).