(Kasipuram Prabhakar Reddy)
రాయలసీమ హక్కుల నిరంతరం పరితపించిన సాహితీఉద్యమ కారుడు బి పాండురంగారెడ్డి మరణించారు. రాయలసీమలోనే కాదు, కవిగా వక్తగా ఆయన రాష్ట్రమంతా సుపరిచితుడే.
అయన ఎన్నో ఉద్యమాలు చేశారు. సామాజిక అసమానతల పై విప్లవ కవితాఝరి కురిపించారు . పీడిత తాడిత ప్రజల విముక్తి కోరుతూ ఆయన రాసిన “సంకెళ్లను తెంచుదాం ” కావ్యం ఒకప్పుడు సంచలనం .
అలుపెరుగని సీమ ఉద్యమకారుడాయన. ఈ తెల్లవారు జామున 3గంటలకు కన్నుమూశారు.
పాండురంగా రెడ్డి గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు . APTF రాష్ట్ర కార్యదర్శి గా , “ఉపాధ్యాయ ” పత్రికా సంపాదకుడిగా ఉపాధ్యాయ సంఘాలకు చిరపరిచితుడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఆయన అనేక విప్లవ పోరాటాలలో పాల్గొన్నారు .
“విరసం” ఆవిర్భావ సభ్యులలో పాండు రంగారెడ్డి గారు ఒకరు.
ఆయన రాసిన “సంకెళ్లను తెంచుదాం” విప్లవ కావ్యం అప్పట్లో సంచలనం . ఆయన సహచరులు ఇప్పటికి “పాండు ” అనే పిలుస్తారు .
విప్లవోద్యమంలో వచ్చిన విభేదాల రీత్యా రమణా రెడ్డి , భూమన్ , నిఖిలేశ్వర్ , జ్వాలా ముఖి , రంగనాయకమ్మ , రవిబాబు తదితరులతో పాటు విరసం నుంచి బయటకొచ్చి “జనసాహితి” అనే వేదిక ఏర్పాటు చేసుకున్న వారిలో పాండు సార్ కూడా ఒకరు .
APTF ప్రచురించిన “కెరటాలు” అనే కవితా సంకలనం కు ఈయన ప్రధాన సంపాదకులు .
1991 లో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దత్తు ఇచ్చారు . 1993 లో పౌరహక్కుల నేత బాల గోపాల్ , కామ్రేడ్ సంధ్య ల నేతృత్వాల్లో ఏర్పడిన ” రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట సమితి” కి వెన్నుదన్నుగా నిలిచారు . ( ఈ సంస్థ పోరాటం వల్లనే రాయలసీమ లో విచ్చలవిడి తుపాకీ లైసెన్స్ లను నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రద్దు చేశారు )
పౌర హక్కుల సంస్థ OPDR కు కర్నూల్ జిల్లా ప్రతినిధులు గా పాండు సార్ , ఆయన తమ్ముడు నరసింహా రెడ్డి లు పనిచేశారు .
1996 లో రాయలసీమ రచయితలను అందరినీ ఏకం చేసి నంద్యాల లో “సీమ సాహితి ” సంస్థను ఏర్పాటు చేశారు. మధురాంతకం రాజారాం , భూమన్ , రామకృష్ణా రెడ్డి తదితర ప్రముఖులను కలుసుకునే అవకాశం నాకు ఈ వేదిక కల్పించింది.