వైసిపి నర్సాపూర్ ఎంపి, పార్టీ రెబెల్ రఘరామ కృష్ణంరాజును ఏంచేయాలో రూలింగ్ పార్టీకి అర్థం కానట్లుంది.
ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్ననిర్ణయాలను వ్యతిరేకించినా, పార్టీ పాలసీలను విమర్శించినా ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేకపోతున్నారు.నర్సాపూర్ ఎంపిగా ఎన్నికైనప్పటినుంచి ఆయన ఎపుడూ పార్టీ ఒరలో ఇమడలేని కత్తిగా లాగా ఉంటున్నారు.
ఆయన ఫేస్ బుక్ పేజీలో జగన్ బొమ్మ ఉండటమే తప్ప ఆయన మనుసులో జగన్ ఎపుడూ లేరు. దీనికి రెండు కారణాలు, రాజు క్షత్రియ కులానికి చెందిన ఇండిపెండెంట్ మనస్తత్వం ఉన్నవాడు. యువకుడు. రాజకీయంగా బలమయిన కుటుంబం నుంచి వచ్చాడు.దానికి తోడు బాగా డబ్బున్నవాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఇపుడు బిజెపికి దగ్గరయినవాడు. అందుకే , ‘జగన్ బొమ్మ ఉంటే ఉండొచ్చ, నా ఇమేజ్ తోనే 2019 ఎన్నికల్లో గెలిచాను,’ అని ప్రకటించి ధైర్యం ప్రదర్శించారు.
ఇదే మరొక బిసి , ఎస్ సి ఎంపియో చేసి ఉంటే ఈ పాటికి ‘ఫసక్’. ఆయన ఏ వూరు వెళితే, ఆవూర్లో రాళ్లుపడేవి. దాడులుజరిగేవి.కారు అద్దాలు పగిలేవి. కులం,డబ్బు, ధైర్యం, రాజకీయ ప్రాబల్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి రఘురామ కృష్ణం రాజును వైసిపీ ఏమీ చేయలేకపోతున్నది.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఆయనకు ఎపుడో నలభై రోజుల కిందట షోకాజ్ నోటీసు ఇచ్చారు. షోకాజ్ నోటీసును రాజు చాలా తెలివిగా తిప్పికొట్టాడు. మరొకరయితే షోకాజ్ నోటీసుకు ఏదో ఒక సమాధానమిచ్చి ఇరుక్కుపోయి ఉండేవారు. తన సమాధానంతో అంత పెద్ద పార్టీని ఇరుకున పెట్టారు రాజు.
పార్టీ నుంచి ఈ పార్టీ బహిష్కరించేందుకు పార్లమెంటు స్పీకర్ కార్యాలయంలో మూడ్ ఎలా ఉందో కనుక్కునేందుకు వైసిపి ఎంపిలు ప్రయత్నించారు. ప్రత్యేక విమానంలో కోవిడ్ ను లెక్క చేయకుండా ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఓమ్ బిర్లాను కలిశారు. రాజును లోక్ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించేందుకు వీలుందేమో చూశారు. అలాంటి వాతావరణం కనిపించలేదు.
పార్టీ వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసి ఒక సభ్యుడిని బహిష్కరిస్తే అనర్హత వేటుపడటం కష్టం. అందుకే గతంలో పార్టీకి దూరమయిన మెహన్ బాబు, దగ్గపాటి తదితరులు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోలేదు. సాధారణంగా పార్టీ విజ్ఞప్తి చేసిందని పార్టీ నుంచి బహిష్కృతుడయిన సభ్యుడిని అసెంబ్లీ/ పార్లమెంటు నుంచి డిస్ క్వాలిఫై చేయడం అంతసులభం కాదు. దానికి సబ్జక్టివ్ జస్టిఫికేషన్ కంటే ఆబ్జక్టివ్ కండిషన్స్ అవసరం.ఇపుడు బిజెపి అండ బాగా ఉన్న రఘురామ కృష్ణంరాజును బహిష్కరించేందుకు వైసిపి వెనకాడుతున్నదిందుకే అనిపిస్తుంది.
లేకపోతే, ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలాగా నడిచే ప్రాంతీయ పార్టీలో నాయకుడిని ఎదిరించడం సాధ్యమా? ఎవరైనా ఎదిరించినపుడు ఖతం చేయకపోవడం అంతకంటే సాధ్యం కాదు.కాని, నలబై రోజులు గడిచినా రాజు మీద చర్యలు తీసుకోలేదు. తీసుకోలేకపోతున్నారు.
అసలు తాను ఎన్నికల్లో పోటీచేసిన పార్టీఏమిటి? తనకు షోకాజ్ నోటీషు ఇచ్చిన పార్టీ ఏమిటి? ఎవరీ ప్రధాన కార్యదర్శి అనే ప్రాథమిక ప్రశ్నలు లేవనెత్తడంతో ఇరుకున పడింది నోటీసు ఇచ్చిన పార్టీయే.
పార్టీ నుంచి బహిష్కరణ అనర్హతకు దారితీస్తుందా?
పార్టీ నుంచి ఒక సభ్యుడిని బహిష్కరించినపుడు అది ఆటోమేటిక్ గా అనర్హతకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. 2016 ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ప్రఫుల్ల సి. పంత్ ల ధర్మాసనం ముందు అడిషనల్ సాలిసిటర్ జనరల్ (ASG) పి ఎస్ నరసింహ ఈ వివరణ ఇచ్చారు.
10 వ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Ant-Defection Law) ప్రకారం ఒక పార్టీ తరపున నామినేట్ అయినా లేదా ఎన్నికల్లో గొలుపొందిన సభ్యుడు బహిష్కృతుడయినా సభ్యత్వం కోల్పోడు. కాకపోతే బహిష్కరణ తర్వాత కూడా పార్టీ అదుపులో ఉన్నట్లే లెక్క. అపుడు ఈ విషయం కోర్టు పరిశీలనకు వచ్చింది.
ఎందుకంటే 2010, ఫిబ్రవరి 2న సమాజ్ వాది పార్టీ రాజ్యసభ నుంచి అమర్ సింగ్ ను, లోక్ సభ నుంచి జయప్రదను బహిష్కరించింది. అపుడు తమ సభ్యత్వం పోతుందేమననే భయంతో వారిద్దరు సుప్రీంకోర్టులో బహిష్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ విషయం విచారిస్తున్నపుడే అడిషనల్ సాలిసిటర్ జనరల్ కోర్టుకు ఈ వివరణ ఇచ్చారు.
“Upon expulsion from a political party, there is no automatic disqualification under the 10th Schedule of Constitution from Legislative assembly or Parliament and the member will continue as an unattached member as per the direction of the speaker,” అని అడిషనల్ సాలిసిటర్ జనరల్ చెప్పారు.
అయితే, ఇక్కడొక మెలిక ఉంది. బహిష్కృతుడయిన సభ్యుడు ఏ రాజకీయ పార్టీలో చేరరాదు. పార్టీ విప్ ని ధిక్కరించరాదు. ఇలా చేస్తే 10 వ షెడ్యూల్ లోని అంశాల ప్రకారం స్పీకర్ ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకోవచ్చు.
“…. If there is any overt act of either joining any political party voluntarily or defies any whip of any political party then he will attract the provision of the 10th schedule and action can be taken against him by the Speaker.”
దీనిని అడిషనల్ సాలిసిటర్ జనరల్ నరసింహ చాలా చక్కగా చెప్పారు. ఒక వ్యక్తి పార్టీ ద్వారానే నయినా ఒక సారి సభలో ప్రవేశించడమనేది పుట్టుమచ్చలాంటిది. అది అంత సుళువుగా చెరిగిపోదని చెప్పారు.
“ .. a legislator who is born into a House through a political party or as a nominated member of even as an independent candidate shall retain his birthmark and shall continue as such till the dissolution of the House.”
ఈ వాదన ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బహష్కరించినా రఘురామ కృష్ణంరాజుకు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన లోక్ సభలో సభ్యుడిగా కొనసాగుతాడు. ఇక విప్ ధిక్కరించడమంటారా అది ఎపుడో గాని ఎదురుకాదు. బిజెపి-వైసిసి కి ఇపుడునడుస్తున్న బంధుత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సభ్యులకు వైఎస్ ఆర్ సి విప్ జారీ చేసే పరిస్థితి లేదు. అదెప్పటీకి రాకపోవచ్చు. ఆమేరకు రఘరామకృష్ణం రాజు సేఫ్.
ఈపరిస్థితులలో జగన్ వంటి బలమయిన నాయకుడు కూడా రెబెల్ ఎంపి మీద చర్యతీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.ఇపుడు రెబెల్ ఎంపిని బహిష్కరించి సాధించేదేమీ లేదు. ఎందుకంటే ‘జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎంపి’ అని లోక్ సభ నుంచి తరిమేయాలి. అది జరిగేలా లేదు. పోనీ అలాగే ఉండనీయాలా? జగన్ ని ఎదిరించిన వాడు రోజూ పార్లమెంటులో కనిపించడం భరించడం కష్టం. ఇదీ సమస్యే. అంటే రఘురామకృష్ణం రాజునులోక్ సభ నుంచి తరిమేయలేరు, సభలోకొనసాగకుండా అడ్డుకోలేరు. ఇదీ వైసిపి ఇరకాటం. ఇక మిగిలింది ఒక్కటే మార్గం. రఘురామరాజు కృష్ణం రాజు లోక్ సభ సభ్యుడిగా కొనసాగలేని పరిస్థితులను సృషించి ఆయనే విసుగొచ్చి స్వయంగా రాజీనామా చేసేలా చేయాలి. ధన,జన,కుల,రాజకీయ,బుద్ధిబలం ఉన్న రాజును ఇలా సతాయించడం సాధ్యంకాదేమో. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి ఏంచేస్తుందో అనేది ఆసక్తికరమయిన ప్రశ్న. ఇగో శాటిష ఫాక్షన్ కోసం పార్టీ నుంచి బహష్కిరించి వదిలేస్తుందా? లేక బిజెపికి నేతలకు చెప్పి ఆయన పార్టీని తీవ్రంగా విమర్శించకుండా చూసుకుని ఇగ్నోర్ చేస్తుందా? చూద్దాం ఏంజరుగుతుందో. వైసిపి అంత ఈజీగా వదిలేస్తుందనుకోలేం.