వెండి తెరకు నోచుకోని సినిమాలు

(CS Saleem Basha)
సినిమా టైటిల్ ని ప్రకటించి, లేదా ప్రారంభోత్సవం చేసి, లేదా కొంత షూటింగ్ చేసి ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పిన మూడు సినిమాలు మరద నాయగన్, అబూ, బాలకృష్ణ జానపద చిత్రం బాగానే షూటింగ్ చేసిన తర్వాత ఆగిపోయిన సినిమాలు. అవి ఇంక వచ్చే అవకాశం లేదు. గతంలో జై కృష్ణ అనే వ్యక్తి జమున గుమ్మడి సత్యనారాయణలతో “బాలనాగమ్మ” తీశాడు. కానీ విడుదల చేయలేక పోయాడు. వారి కుటుంబీకులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ చేయలేకపోయారు.
అలాగే కె.విశ్వనాథ్ తీసిన “సిరిమువ్వల సింహనాదం” , పురాణం సూరి నరేష్ హీరోగా తీసిన “దిగ్విజయం” విడుదల కాలేదు. కామెడీ చిత్రాల దర్శకుడు శివ నాగేశ్వరరావు కృష్ణ తో తీసిన “అదరహో” ఏమైందో తెలియదు. రఘువరన్ హీరోగా తీసిన “కొండ పిడుగు” పడలేదు!
గిడుతూరి సూర్యం తీసిన “అనుమానం మొగుడు” రిలీజ్ కాలేదు. మహాభారత్ టీవీ సీరియల్ లో ద్రౌపది పాత్ర వేసిన రూపా గంగూలీ హీరోయిన్ గా “శశిరేఖ శపథం” ఏమైందో తెలియదు. అలాగే వేణు, దివ్య ప్రధాన పాత్రధారులుగా తీసిన “మాటిచ్చాను” విడుదల కాలేదు. ఇంకా శ్రీహరి “రౌడీ షీటర్” , మీనా “దాసు” సినిమాల నిర్మాణం ఏమైందో? పృథ్వి హీరో గా నటించిన “పాండు”, జేడీ చక్రవర్తి తో ప్రారంభించిన “నాంది” ప్రస్తావనే లేదు. “ఆటో బయోగ్రఫీ ఆఫ్ గాంధీ” అన్నే రామ్ గోపాల్ వర్మ ఇంగ్లీష్ సినిమా ఆగిపోయింది. దాసరి అరుణ్ కుమార్ హీరోగా ప్రకటించిన “ మార్కెట్ రౌడీ’ షూటింగ్ గురించి తెలియదు. ఇదంతా చాలా కాలం క్రితం జరిగిన విషయాలు.
ఈ మధ్యకాలంలో కొన్ని భారీ సినిమాలు పెద్ద దర్శకుల తో, ప్రముఖ హీరోలతో ప్రకటించారు. వాటి గురించి ఇప్పటివరకూ స్పష్టత లేదు. గతంలో స్వీయ దర్శకత్వంలో బాలకృష్ణ “నర్తనశాల” సినిమాను తీయాలి అనుకున్నాడు. 1.3.2003 ఉదయం 7:30 కు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పర్ణశాల సెట్లో ముహూర్తం షాట్ తీయడం జరిగింది. దురదృష్టవశాత్తూ సినిమాలో నటించాల్సి ఉన్న (ద్రౌపది పాత్రలో) సౌందర్య మరణం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. సౌందర్య తప్ప ఆ పాత్రకు ఎవరు సరిపోరని బాలకృష్ణ భావించడం వల్ల చర్చ ముగిసింది.
బాలకృష్ణ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తీయాలనుకున్న భారీ సినిమా “రైతు”. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అది రూపుదిద్దుకునే అవకాశాలు లేనట్లే !
దీనికి ప్రధాన కారణం ఒక ముఖ్య పాత్రకు అనుకున్న అమితాబచ్చన్ సుముఖత చూపక పోవడమే. కృష్ణవంశీ ఎలాగైనా సినిమా తీయాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. అలాగే అమితాబ్ లేకపోతే రైతు సినిమా లేదు అని బాలకృష్ణ స్పష్టం చేశాడు. సర్కార్ త్రీ సినిమా తర్వాత ఆలోచించి చెప్తాను అన్న అమితాబ్ ఇప్పుడు అవును అని చెప్పే అవకాశాలు లేనట్లే
ఇంకా పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు “జనగణమన” కూడా మొదలు కాలేదు. దాదాపు నాలుగేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా అభిమానుల ద్వారా ఫస్ట్ లుక్ స్టేజ్ కి వెళ్ళినా సినిమా ఇంకా మొదలుపెట్టలేదు.
ఇదివరకు మహేష్ బాబుతో “పోకిరి” , “బిజినెస్ మాన్ ”లాంటి హిట్ సినిమా తీసిన పూరి జగన్నాథ్ ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. . ఈ మధ్యనే ఎలాగైనా సినిమా తీసి తీరుతానని ప్రకటించడం విశేషం! అయితే మహేష్ బాబు తోనే నా అన్న విషయం స్పష్టం చేయలేదు.
చాలా కాలం క్రితం చిరంజీవితో కృష్ణవంశీ తీయాలనుకున్న “వందేమాతరం” సినిమా దాదాపు ఆగిపోయినట్లే. అప్పట్లో తీయాలనుకున్న కుదరలేదు. ఇప్పుడు “సైరా” సినిమా తర్వాత ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే వందేమాతరం లో చిరంజీవి పాత్ర స్వాతంత్ర సమరయోధుడు పాత్ర. మళ్లీ అటువంటి పాత్ర చిరంజీవి ఇప్పట్లో చేయకపోవచ్చు.
2015లో కృష్ణవంశీ హర్రర్ సినిమా “రుద్రాక్ష” అనౌన్స్ చేశాడు. ప్రముఖ హీరోయిన్ ఒకరు ఇందులో భయపెడుతుందని చెప్పడం జరిగింది. చాలామంది అనుష్క హీరోయిన్ అని అనుకున్నారు. కాజల్ కూడా వేయవచ్చు అన్న కథనాలు వచ్చాయి. దెయ్యం గా కాజల్ భయ పెట్టవచ్చు అన్న టీవీ కథనాలు కూడా వచ్చాయి. ప్రకాష్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ హారర్ సినిమా ఇంకా మొదలు పెట్టలేదు
వెంకటేష్ హీరోగా, కిషోర్ దర్శకత్వంలో ” ఆడాళ్ళు మీకు జోహార్లు” సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు వెంకటేష్ దాని పట్ల ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. దాంతో నిర్మాతలు శర్వానంద్ హీరోగా అనుకున్నారట. అది ఎంతవరకు సఫలమవుతుందో తెలియదు.
2014లో మహేష్ బాబు నాగార్జున మల్టీస్టారర్ తీయాలని మణిరత్నం చేసిన ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలియదు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ” భూలోక వీరుడు” అనే సినిమా కొంత చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది. సినిమా చిరంజీవికి పెద్ద నచ్చకపోవడంతో దాన్ని ఆపేశారు. మళ్లీ తీసే అవకాశాలు లేవు.
తెలుగు, తమిళ్, హిందీలో ఇంకా ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మరోసారి తెలుసుకుందాం.
CS Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)

LIKE THIS STORY?  SHARE IT WITH A FRIEND!