ఆంధ్రా బిజేపి సీనియర్ నేత, మాజీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా(corona) సోకి మరణించారు. ఆయన గత నెలరోజులుగా కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అందినప్పటికీ ఆయన కోలుకోలేక విజయవాడలోని హెల్త్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం కరోనాతో మరణించారు.
నవ్యాంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు తొలి సర్కారులో మాణిక్యాలరావు మంత్రిగా పనిచేశారు. దేవాదాయశాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకు ఆయన సేవలందించారు. మాణిక్యాల రావు తొలిసారి తాడేపల్లి గూడెం నియోజకవర్గం నుంచి బిజేపి తరుపున గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజేపి, జనసేన కలిసి పోటీ చేశాయి. దీంతో కూటమిలో భాగంగా తాడేపల్లి గూడెం నుంచి మాణిక్యాలరావు పోటీ చేసి గెలుపొందారు.
పైడికొండల మాణిక్యాలరావు ఫొటోగ్రాఫర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం రాజకీయాల్లో చేరారు. 1961లో మాణి్క్యాల రావు తాడేపల్లిగూడెంలో జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ లో నానాటికీ కరోనా విశ్వరూపం దాలుస్తోంది. చిన్నా పెద్ద తేడాలేకుండా రోజుకు పదుల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మాణి్క్యాల రావు మరణించడం రాజకీయవర్గాల్లో కలవరం రేపుతోంది.
వివాద రహితుడుిగా పేరున్న మాణిక్యాలరావు మరణం ఆంధ్రా బిజేపి శ్రేణులనే కాకుండా యావత్ ప్రజలకు తీరని లోటు అని బిజేపి నేతలు పేర్కొన్నారు.
సోము వీర్రాజు సంతాపం
మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా సోకి మరణించడం పట్ల బిజేపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. మాణిక్యాలరావు మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. మాణిక్యాలరావు స్వయంగా స్వయం సేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేస్తూ 1989లో బిజేపిలో చేరినట్లు తెలిపారు. తర్వాత పార్టీలో అంచలంచెలుగా ఎదిగారని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని వివరించారు. మాణిక్యాలరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.