ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే తెలుగు అధ్యక్షుడు , ప్రతిపక్షనాయకుడు వర్ణించారు. ఈ రోజు రాజధాని మార్పుల బిల్లుల మీద గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఏపి పునర్విభజన చట్టానికి వ్యతిరేకం, అమరావతి కాపాడుకునేందుకు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకుఉద్యమానికి సిద్ధం కావాలనిరాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు.
రాజధానుల బిల్లుల మీద గవర్నర్ సంతకం చేయడం మీద స్పందిస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు విలేకరులు సమావేశం ముఖ్యాంశాలు
AP Decentralization andiInclusive development of regions Bill-2020) , సీఆర్డీఏ-2014 (AP Capital regions development authority Bill-2020) బిల్లులకు గవర్నర్ ఆమోద నిర్ణయం తీసుకుని, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తోంది, ఆవేదన కలుగుతోంది.
ప్రజలందరూ కరోనాతో ఎక్కడికక్కడ బాధపడుతూ బైటకు రాలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఆర్ధికంగా చితికిపోయి, ఉపాధులు కోల్పోయి, సరైన తిండికి కూడా నోచుకోని పరిస్థితి సర్వత్రా ఉంది. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్తే బెడ్స్ కూడా లేని పరిస్థితి, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండలేక ఇళ్లకు పారిపోతున్నారు.
ఈ పరిస్థితిలో, మళ్లీ ఇలాంటి చిచ్చు ఈ రాష్ట్రంలో తెచ్చారంటే చాలా బాధేస్తోంది, ఆవేదన కలుగుతోంది.
Andhra Pradesh will not be cowed down by the politics of arrogance and self-interest practiced by those in power. The fight for farmers and future of the state has just begun.#SaveAmaravati#SaveAndhraPradesh
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 31, 2020
ఆంధ్రుల కల అమరావతి. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ను కోల్పోయినప్పుడు, తమ బిడ్డల భవిష్యత్ కోసం మేము కూడా రాజధాని కట్టుకోవాలని, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ఆశపడ్డారు.
అమరావతి అభివృద్ది అవుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మీకు కూడా లాభం కలుగుతుంది అని చెబితే రైతులు భూములు ఇచ్చారు. 29వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయడం దారుణం..
అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, అక్కడి భూమితోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటే, రాష్ట్రం అభివృద్ది చెందుతుంది, పేదలకు సంక్షేమం అందించవచ్చని ఆలోచించాం. అలాంటి రాజధానిని ఇప్పుడు చిన్నాభిన్నం చేశారు. ప్రజల స్వప్నాన్ని, ఆశలను సర్వనాశనం చేశారు.
అమరావతిలో 226 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరు చనిపోయారు, ఆడబిడ్డలు అవమానాల పాలయ్యారు. ఎందుకింత నీచాతినీచంగా ప్రవర్తించారో చెప్పాలి. ఏంటీ పైశాచిక ఆనందం, ఏంటి ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు అని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
‘‘ఒక రాజధాని’’ అని ఏపి పునర్వవస్థీకరణ చట్టంలో చెప్పారు. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి,ఏ దేశానికి ఎక్కడా 3రాజధానులు లేవు, అలాంటిది 3రాజధానులు తెస్తామని, ఏపి పునర్వవస్థీకరణ చట్టానికే తూట్లు పొడుచే పరిస్థితి కల్పించారు.
‘‘13జిల్లాల చిన్నరాష్ట్రం, మనం మనం గొడవ పడితే రాష్ట్రం నష్టపోతుంది, ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్రం నష్టపోతుందని రాజధానికి ఒప్పుకుంటున్నామని’’ ఎందుకు మడమ తిప్పారని అడుగుతున్నాను.
రాజధాని ఎక్కడైనా పెట్టండి దానికి 30వేల ఎకరాలు కావాలని ఆరోజు చెప్పారు, ఈ రోజు 33వేల ఎకరాలు ఇచ్చారు, దానిని ఎందుకు నాశనం చేస్తున్నారు..? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది.
ఆ రోజు అసెంబ్లీలో మీరేం చెప్పారు. మాట చెప్పారు, మభ్యపెట్టారు, ఈ రోజు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. ఈ బిల్లులు సెలెక్ట్ కమిటి వద్ద ఉన్నాయని, సెలెక్ట్ కమిటి రిపోర్ట్ వచ్చాక మేము కోర్టుకు తెలియజేస్తామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.
గవర్నర్, కౌన్సిల్ ఛైర్మన్ ఇద్దరూ స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ వ్యవస్థల ప్రతినిధులు.
గవర్నర్ ను కలిసి ఈ బిల్లులు సెలెక్ట్ కమిటికి పంపామని కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా చెప్పారు. మళ్లా ఆ 2బిల్లులను తెస్తే, కౌన్సిల్ కు వస్తే గొడవలు జరిగి సైనడే చేశారు. ఆ బిల్లులను పంపిస్తే గవర్నర్ సంతకం పెడతారు.
కావాలని అమరావతిపై అపవాదులు వేశారు. భూకంపాలు వస్తాయని, భూముల్లో స్కామ్ లు జరిగాయని ప్రచారం చేశారు. భూమి రైతులది, ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో. అమరావతిని ఏదోవిధంగా చంపేయాలనే ఇదంతా చేశారు. చాలా దారుణంగా నీచంగా చేశారు.
ప్రజలకు కావాల్సింది అభివృద్ది వికేంద్రీకరణ. వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలా చేయకుండా రాష్ట్రాభివృద్దికి విఘాతం కల్పిస్తున్నారు. 3రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడే జిల్లావారీగా అభివృద్ధి ప్రణాళికలు 13జిల్లాలకు ప్రకటించాం.
శ్రీకాకుళం జిల్లాలో 12 అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. నూతన పారిశ్రామిక నగరం, భావన పాడు పోర్టు, కళింగ పట్నం పోర్టు, పైడిభీమవరం పారిశ్రామిక వాడ, నూతన ఎయిర్ పోర్టు, శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటిగా చేయడం, ఫుడ్ పార్క్, వంశధార నాగావళిపై ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఓపెన్ యూనివర్సిటి, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ హబ్, బారువ బీచ్ అభివృద్ది, విజయనగరంలో 10అభివృద్ది కార్యక్రమాలు: గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం, పారిశ్రామిక నగరం, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, ఫుడ్ పార్క్, గిరిజన యూనివర్సిటి, స్మార్ట్ సిటిగా విజయనగరాన్ని రూపొందించడం, ఎలక్ట్రానిక్ మరియు హార్డ్ వేర్ పార్క్, పోర్టు, మెడికల్ కాలేజి, సంగీతం లలిత కళల అకాడమి
విశాఖపట్నంలో 13 అభివృద్ది కార్యక్రమాలు: మెగాసిటీగా విశాఖ, అంతర్జాతీయ విమానాశ్రయం, విసిఐసి పారిశ్రామిక వాడ, మెట్రో రైల్, ఐఐఎం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మెగా ఐటి హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, గంగవరం ఎల్ ఎన్ జి టెర్మినల్, రైల్వే జోన్ తూర్పుగోదావరిలో 14అభివృద్ది కార్యక్రమాలు,పశ్చిమ గోదావరిలో 14అభివృద్ది కార్యక్రమాలు, కృష్ణా జిల్లాలో 14, గుంటూరుజిల్లాలో 11 అభివృద్ది కార్యక్రమాలు, ప్రకాశంలో 9, నెల్లూరులో 9, చిత్తూరులో 12, కడపలో 9, అనంతపూర్ లో 17అభివృద్ది కార్యక్రమాలు ప్రకటించాం.
కర్నూలును స్మార్ట్ సిటిగా చేయడం, నూతన విమానాశ్రయం, ఐఐఐటి, సీడ్ హబ్ గా రూపొందించడం, ఫుడ్ పార్క్, అవుకు నూతన పారిశ్రామిక నగరం, టెక్స్ టైల్ క్లస్టర్, మైనింగ్ క్లస్టర్, సిమెంట్ హబ్ గా రూపొందించడం అభివృద్ది కార్యక్రమాలు ప్రకటించాం.
కర్నూలు వయా శ్రీశైలం నంద్యాల కృష్ణపట్నం 4లేన్ రోడ్లు పెద్దఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులు, ఒకపక్క చెన్నై, ఒకపక్క బెంగళూరు, మరోపక్క హైదరాబాద్ పట్టిసీమ పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో ఆదా అయిన నీటిని రాయలసీమకు ఇచ్చాం. అలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈవిధమైన దుర్మార్గాలకు తెగించారు. చేసిన అభివృద్దిపై నాకెంతో సంతృప్తి ఉంది. హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ, ఫార్మా సిటి ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చేసిన అభివృద్ధిని నాశనం చేసి రాష్ట్రానికి గొడ్డలిపెట్టులాంటి చర్యలు.
రాజకీయ పార్టీలపై విన్యాసాలు, కక్ష సాధింపు చర్యలు,ప్రజలపై తప్పుడు కేసులు, ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక చర్యలు ఈ రోజు చేసిన పని అరాచకాలకు పరాకాష్ట.
రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులకు చెప్పాం. అందుకే 33వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్లిచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పరిశ్రమతో ఒక ఒప్పందం చేసుకుంటే దానిని ఉల్లంఘిస్తే దానిని చక్కదిద్దే యంత్రాంగం ఉంది. ఇది రైతులు చేసుకున్న ఒప్పందం.
జెఏసి పిలుపు ఇచ్చిన ఆందోళనలకు తెలుగుదేశం పూర్తి మద్దతు ఇస్తోంది. మీరంతా ముందుకొచ్చి మీ భవిష్యత్తును కాపాడుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. ఇది తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబు నాయుడుకో, కొంతమంది వ్యక్తులకో అన్యాయం కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది.
ఎక్కిన చెట్టును నరుక్కుంటూ, మేము చేసిందే రైటని చెప్పుకుని చంకలు ఎగరేసే పరిస్థితిలో వైసిపి ఉంది. ఈ రోజు నా ఆవేదన, ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు అర్ధం అవుతుంది.
ఇది నాకెందుకు వచ్చింది, ఇది తెలుగుదేశం సమస్య, చంద్రబాబు సమస్య అని గమ్మున ఉండటం సరికాదు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు దానికి నిరసనలు తెలియజేసి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీపై ఉంది.
రాజకీయ పార్టీగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ప్రజలు కూడా తమ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగింది, రేపు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి జరుగుతుందని అనేది గుర్తుంచుకోవాలి.
బాధ్యతలేని ప్రభుత్వం వల్ల చాలా సమస్యలు వస్తాయి. నేను ఆలోచించేది నా ఇంటి కోసమో, నా కుటుంబం కోసమో కాదు. రేపు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏదని అడిగితే మావి 3రాజధానులని చెప్పుకుని సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. ఒక వ్యక్తి వల్ల, ఒక ప్రభుత్వం వల్ల ప్రజలంతా తలవంచుకునే పరిస్థితి రాకూడదు.
కావాలని నామీద అభాండాలు వేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. మీ భవిష్యత్తు కోసమే రాత్రింబవళ్లు రాష్ట్రాభివృద్ది కోసం కృషిచేశాను.
మనకెందుకులే అని మీరు గమ్మున ఉంటే నష్టపోయేది 5కోట్ల ప్రజలు, జాతి నష్టపోతుంది, దయచేసి ఆలోచించండి. రాజకీయాలు కక్ష తీర్చుకోవడం కోసం కాదు. రాజకీయాలు పైశాచిక ఆనందం పొందడానికి కాదు. మీ కష్టాలు తీర్చడానికి, మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి.
ఈ 2బిల్లులపై పెట్టిన శ్రద్ద కరోనాపై పెట్టి, ప్రాణాలు కాపాడటంపై పెడితే, ప్రజలకు సోకకుండా చేస్తే బాగుండేది. వీళ్లే కరోనా వైరస్ ను రాష్ట్రం అంతా వ్యాపింపజేసి, ఈ రోజు వైరస్ ను గాలికి వదిలేసి ప్రాణాలు అరచేత పెట్టుకుని బైటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు.
డిశ్చార్జ్ అయిన ఆడబిడ్డ కుటుంబ సభ్యులు తీసుకెళ్లకపోతే భవనం పైనుంచి దూకి చనిపోయే దుస్థితి. ప్రకాశం జిల్లాలో నాటుసారా, కల్తీ మద్యం తాగి 10మంది చనిపోతే, చాలా తేలిగ్గా శానిటైజర్ తాగి చనిపోయారని చెప్పడం దారుణం. దీనికి ఈ ప్రభుత్వానిది బాధ్యత కాదా..?
ఆ రోజు అమరావతిని రాజధానిగా ఎంపికచేస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా ఇది తప్పు అని చెప్పలేదు, అందరూ ఆమోదించిన రాజాధాని అమరావతి. దాని కోసం త్యాగం చేసిన రైతాంగం అమరావతి రైతాంగం. అందరూ చైతన్యవంతులై అమరావతిని కాపాడుకోవడమే దీనికి పరిష్కార మార్గం. మీరంతా అభిమానించే వ్యక్తిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను.
రాష్ట్ర ప్రజలుగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. రాబోయే రోజుల్లో జెఏసి పోరాటానికి మీరంతా మద్దతు ఇవ్వండి.